తెలంగాణ

telangana

Omicron variant in India: 'ఒమిక్రాన్​ భయాలొద్దు- యాంటీబాడీలే రక్ష'

By

Published : Nov 30, 2021, 2:47 PM IST

Omicron variant in India: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కొవిడ్ రెండో దశ సమయంలోనే మెజారిటీ ప్రజల్లో కరోనా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్, సహా ఇతర వేరియంట్ల నుంచి రక్షణ కలిగి ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ అప్రమత్తత అవసరమన్న నిపుణులు.. జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.

Omicron virus India
భారత్​లో ఒమిక్రాన్​

Omicron variant in India: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచదేశాలను కలవరపెడుతున్న నేపథ్యంలో కొత్త రకం కరోనాతో భారతీయులకు ముప్పు తక్కువేనని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భారతీయులు.. ఒమిక్రాన్ సహా ఇతర కొవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ పొందారంటున్న నిపుణులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొవిడ్ అంశంలో ఏర్పాటైన కన్సార్టియం ఇన్‌సాకాగ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్ షాహిద్ జమీల్ ఈ మేరకు అభిప్రాయపడ్డారు.

ఒమిక్రాన్​ను నుంచి యాండిబాడీలు రక్షిస్తాయి

డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో కొవిడ్ రెండోదశ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందన్న షాహిద్ జమీల్​ ఊహించిన దానికంటే అధిక నష్టాన్ని కలిగించిందన్నారు.

Covid Sero survey in India

దేశవ్యాప్తంగా నిర్వహించిన నాలుగో సెరో సర్వేలో దేశంలోని 67 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలిందని జమీల్ చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో వేగం పుంజుకోని సమయంలోనే సుమారు 93 నుంచి 94 కోట్ల మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వివరించారు. ఇటీవల నిర్వహించిన సెరో సర్వేలో దిల్లీలో 97 శాతం, ముంబయిలో 85 నుంచి 90 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలిన విషయాన్ని గుర్తుచేశారు.

జాగ్రత్తలు తప్పనిసరి

వీటన్నింటిని విశ్లేషిస్తే.. ఇప్పటికే దేశ జనాభాలో చాలామందికి ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్ల నుంచి రక్షణ లభించినట్లు తెలుస్తోందని జమీల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రజలు.. కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలన్నారు.

ఆ వార్తలు నిరాధారం

Omicron news: ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయనే విషయంలో స్పష్టత కోసం మరింత డేటా అవసరమని జమీల్ తెలిపారు. ఒమిక్రాన్‌పై టీకాల ప్రభావం కొద్దిమేర తగ్గినప్పటికీ.. వ్యాక్సిన్లు నిరుపయోగం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా కాకుండా నిరోధించేవి టీకాలు మాత్రమేనని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్.. యువత మీద అధిక ప్రభావం చూపుతుందన్న వార్తలను తోసిపుచ్చిన ఆయన.. అలాంటి సమాచారం ఏదీ లేదని వెల్లడించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details