ETV Bharat / bharat

Omicron India: ఒమిక్రాన్​ భయాలు- ఆఫ్రికా నుంచి వచ్చిన 100 మంది అదృశ్యం!

author img

By

Published : Nov 30, 2021, 10:25 AM IST

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron India)​ ప్రభావం భారత్​పై కనిపిస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణికులకు తప్పనిసరిగా టెస్టులు నిర్వహిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే.. బిహార్​కు వచ్చిన వారిలో దాదాపు 100 మంది ఆచూకీ (Passengers missing) కనుగొనలేకపోతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో.. వైరస్​ వ్యాప్తి చెందుతుందన్న భయం నెలకొంది.

ఆఫ్రికా నుంచి వచ్చిన 100 మంది అదృశ్యం

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron virus)​.. ప్రపంచ దేశాలను వణికిస్తుంటే ఇప్పుడు భారత్​పైనా ప్రభావం పడేలా ఉంది. ఒమిక్రాన్​ తొలుత వెలుగుచూసిన ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల బిహార్​కు వచ్చిన 281 మంది భారతీయుల్లో.. 100 మంది కనిపించకుండా పోయారు. వారిని పట్టుకోవడం ఆరోగ్య శాఖకు చాలా కష్టతరంగా మారింది. వారి వారి పాస్​పోర్ట్​ల్లో వెల్లడించిన చిరునామాల్లో లేకపోవడం గమనార్హం.

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్ష తప్పనిసరి చేసింది బిహార్​ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ఆఫ్రికా నుంచి వారిలో చాలా మంది కనిపించకపోవడం (Passengers missing) ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 11 మందికి మాత్రమే టెస్టులు చేయగా.. వారికి నెగెటివ్​గా తేలినట్లు వెల్లడించారు వైద్యులు.

15 రోజుల్లో 1000 మంది..

ఆఫ్రికా దేశాల నుంచి గత 15 రోజుల్లో 1000 మంది ప్రయాణికులు మహారాష్ట్రలోని ముంబయి చేరుకున్నారు. తమకు అందిన జాబితా ప్రకారం.. 466 మంది నుంచి ఇప్పటివరకు 100 మందికిపైగా టెస్టులు చేసినట్లు బృహన్​ ముంబయి మునిసిపల్​ కార్పొరేషన్​ అధికారులు తెలిపారు.

కేరళ..

వైరస్​ విజృంభణ (Omicron variant in India) నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారి నమూనాలు సేకరించేందుకు రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాల్లో ఆరోగ్య సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​. వారికి క్వారంటైన్​ తప్పనిసరి అని వెల్లడించారు.

7 రోజులు క్వారంటైన్​..

సౌతాఫ్రికా నుంచి కర్ణాటక చేరుకున్న ఇద్దరికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయ నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు. కరోనా టెస్టు రిపోర్టులు ఉన్నప్పటికీ మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఎయిర్​పోర్ట్​ను శానిటైజ్​ చేశారు.

కరోనా నెగెటివ్​గా తేలినవారు కూడా.. 7 రోజులు క్వారంటైన్​లో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. 8వ రోజు మళ్లీ టెస్టులు చేయనున్నట్లు వెల్లడించారు.

తీవ్ర ముప్పు..

ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో (Omicron cases in India) తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధకవ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందన్న డబ్ల్యూహెచ్‌ఓ.. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా తీవ్ర పరిణామాలు తలెత్తవచ్చని చెప్పింది. వ్యాక్సినేషన్ వేగవంతం సహా ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

భయం వద్దు: బైడెన్​

కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు మహమ్మారిపై ఎలా పోరాడాలో వివరిస్తూ.. ప్రత్యేక వ్యూహాన్ని తయారుచేయనున్నట్లు తెలిపారు. ఈ వేరియంట్​ను చూసి భయం, కంగారు పడొద్దని ప్రజలకు సూచించారు.

ఒమిక్రాన్​ బారిన పడకుండా ఉండాలంటే.. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు అంటున్నారు. బూస్టర్​ డోసు పంపిణీని ప్రారంభించడం కూడా ఉత్తమం అని చెబుతున్నారు.

ఇవీ చూడండి: 'ఒమిక్రాన్​ను చూసి భయాందోళనకు గురి కావొద్దు'

ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.