తెలంగాణ

telangana

'రైలు ప్రమాదానికి కారణమేంటి?'.. CRS విచారణలో ఆ అయిదుగురు!

By

Published : Jun 12, 2023, 4:23 PM IST

Updated : Jun 12, 2023, 10:39 PM IST

Odisha Train accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధానంగా ఐదుగురు ఉద్యోగులను రైల్వే అధికారులు విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రైళ్లు ఢీకొనకుండా కాపాడే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ట్యాంపరింగ్ జరిగిందా లేదా సాంకేతిక లోపమా లేదా నిర్లక్ష్యమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బహానగ రైల్వే స్టేషన్ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ సహా ఐదుగురు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించిన అధికారులు విచారణ అనంతరం వారిపై భవిష్యత్ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

Odisha Train Tragedy cbi picks 3 employees for interrogation
Odisha Train Tragedy cbi picks 3 employees for interrogation

Odisha Train Tragedy Reason : ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 288 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనకు సంబంధించి బహానగా బజార్ స్టేషన్ మాస్టర్‌ సహా ఐదుగురు రైల్వే ఉద్యోగులను విచారిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు సిగ్నలింగ్ సంబంధిత పనిని నిర్వహిస్తున్నారని మిగతా ఒకరు స్టేషన్ మాస్టర్ అని పేర్కొన్నాయి. ఐదుగురు ఉద్యోగులను ప్రస్తుతం విధుల నుంచి తొలగించినట్లు చెప్పిన అధికారులు.. రైల్వే భద్రతా కమిషన్-CRS విచారణ నివేదిక తరువాత భవిష్యత్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

రైళ్లు ఢీకొనకుండా, ప్రమాదాలు జరగకుండా సిగ్నల్స్‌ను ఆపే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. మరో మూడు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను కావాలనే ట్యాంపరింగ్ చేశారా? లేదా పొరపాటున జరిగిందా? లేదా ఆ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే పనుల వల్ల జరిగిందా అన్న కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఒడిశా రైలు ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది.

Odisha Train Accident Cause : 'ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పులు ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా పొరపాటున జరిగిందా? లేదా ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా జరిగిందా? తదితర కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం అయిదుగురు రైల్వే సిబ్బంది విచారణలో ఉన్నారు. సీఆర్‌ఎస్‌ నుంచి త్వరలో తుది నివేదిక వస్తుంది' అని ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమేనా? దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో సీబీఐ సైతం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టింది.

కేసును సీబీఐకి అప్పగించేటప్పటికే.. ఈ ప్రమాద ఘటనపై కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ దర్యాప్తు చేపట్టింది. ఖరగ్‌పుర్‌, బాలేశ్వర్ సహా వివిధ ప్రాంతాల్లో CRS బృందం పర్యటించి సమాచారం సేకరించింది. ప్రమాదానికి గురైన కోరమాండల్‌, బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైళ్లలో విధులు నిర్వర్తించిన లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, ప్రమాదం జరిగిన స్టేషన్‌లో సిగ్నలింగ్‌ సిబ్బంది సహా 55 మందిని విచారించింది. మూడు రైళ్లలో విధుల్లో ఉన్న పలువురు ఇతర ఉద్యోగులను, ప్రమాదం జరిగిన స్టేషన్‌తోపాటు పక్క స్టేషన్లలో సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది సీఆర్​ఎస్​ బృందం. సీఆర్​ఎస్​ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా సమాంతరంగా సాగనుంది.

Odisha Train Crash : జూన్ 2న.. ఒడిశా బాలేశ్వర్​ జిల్లా బహానగా రైల్వే స్టేషన్​ వద్ద మూడు రైళ్లు ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలు.. పట్టాలపై పడిఉన్న బోగీలను ఢీకొట్టాయి. ఘటనలో మొత్తం 288 మంది మృతి చెందారు. మరో 1,200 మందికిపైగా గాయపడ్డారు.

Last Updated :Jun 12, 2023, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details