తెలంగాణ

telangana

మార్చురీగా హైస్కూల్​.. విద్యార్థులు, టీచర్లు హడల్​​.. ఒడిశా సర్కార్​ కూల్చివేయనుందా?

By

Published : Jun 8, 2023, 10:58 PM IST

Odisha Train Tragedy Mortuary : ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్థానిక బహనగా పాఠశాలలో ఉంచారు. ఆ పాఠశాల భవనాన్ని తాత్కాలిక మార్చురీగా మార్చి.. అందులో భద్రపరిచారు. అయితే, ఇప్పుడు ఆ పాఠశాలలోకి వెళ్లేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు భయపడుతున్నారు. దీంతో ఆ పాఠశాల భవనాన్ని కూల్చివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించారు. వారు ఏమన్నారంటే..?

Odisha Train Tragedy Mortuary
Odisha Train Tragedy Mortuary

Odisha Train Tragedy Mortuary : ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను ప్రమాద ప్రాంతమైన బహనాగా బజార్​ హైస్కూల్​లో ఉంచారు. తాత్కాలిక మార్చురీగా స్కూల్ భవనాన్ని మార్చి అక్కడే రైలు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను భద్రపరిచారు. దీంతో అక్కడికి వెళ్లాలంటే ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం కూడా పాతబడిన కారణంగా కూల్చివేసి.. కొత్త భవనం కట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఎస్​ అశ్వతి.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 'చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నట్లు గుర్తించాము. కాబట్టి ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తాం. మానసిక కౌన్సెలింగ్‌ కోసం డిపార్ట్‌మెంట్‌ నుంచి ఒక బృందాన్ని పంపుతాం' అశ్వతి వెల్లడించారు.

ఇప్పటికే స్థానిక అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్​తో కూడిన రెండు కమిటీలు.. బహనాగా పాఠశాలను వరుసగా రెండు రోజులు సందర్శించాయి. అందులో భాగంగా బాలేశ్వర్​ జిల్లా కలెక్టర్​ దత్తాత్రేయ బావుసాహెబ్​ శిందే గురువారం బహనగా పాఠశాలను సందర్శించారు. పాఠశాల నిర్వాహణ కమిటీ, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'పాఠశాల భవనం ఆస్బెస్టాస్ పైకప్పుతో నిర్మించింది. ఇప్పటికే చాలా పాతది కావడం వల్ల మార్చురీగా ఉపయోగించారు. దీని వల్ల ప్రజల్లో కొంత భయాందోళనలు ఉన్నందున కూల్చివేయాలని స్థానికులు అడుగుతున్నారు. ప్రజలు భయపడుతున్నట్లు పాఠశాలలో దెయ్యాలు ఏమి లేవు.' అని కలెక్టర్ చెప్పారు.

జూన్​ 2న బాలేశ్వర్​లో లూప్‌లైన్‌లో ఆగిన గూడ్స్‌ రైలును.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దాని బోగీలు ఎగిరి పక్కనున్న పట్టాలపై పడడం వల్ల.. ఆ మార్గంలో వెళ్తోన్న బెంగళూరు-హవ్‌డా కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 288 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనాస్థలిలో పునరుద్ధరణ పనులు పూర్తికావడం వల్ల రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.

విద్యుత్​​ షాక్​తోనే 40 మంది మృతి!
Odisha Train Crash Electric Shock : ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో దాదాపు 40 మంది కరెంట్​ షాక్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు, రక్తస్రావం లేకపోవడమే అందుకు కారణం. ప్రమాద సమయంలో విద్యుత్​​ తీగలు బోగీలపై పడటం వల్ల కరెంట్​ షాక్​తో వీరు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు దాదాపు వంద మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉండగా ఎక్కువకాలం వీటిని భద్రపర్చడం మంచిది కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details