తెలంగాణ

telangana

'గాంధీ'లకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​.. సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు

By

Published : Aug 3, 2022, 6:06 PM IST

Updated : Aug 3, 2022, 6:54 PM IST

national herald case
'గాంధీ'లకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​.. సోనియా ఇంటి వద్ద హైఅలర్ట్ ()

ED Seals Young Indian Office: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ దూకుడు పెంచింది. దిల్లీలోని యంగ్ ఇండియన్​ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం చర్చనీయాంశమైంది.

ED Seals Young Indian Office: నేషనల్ హెరాల్డ్​ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. మంగళవారం నుంచి దిల్లీ, లఖ్​నవూ, కోల్​కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్​కు చెందిన హెరాల్డ్​ హౌస్​లోని యంగ్ ఇండియన్​ ఆఫీస్​ను సీజ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది. మంగళవారం జరిపిన ఈడీ దాడుల్లో అధికార ప్రతినిధులు హాజరుకానందున సాక్ష్యాలను సేకరించలేకపోయామని, వాటిని భద్రపరిచేందుకే తాత్కాలికంగా సీజ్​ చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్​ హెరాల్డ్​ ఆఫీస్​లో యంగ్​ ఇండియన్​ సంస్థ మినహా మిగతా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది.

హెరాల్డ్​ హౌస్​ ప్రాంగణం తెరవొద్దని ఈడీ నోటీసులు
10 జన్​పథ్​లోని సోనియా నివాసం ఎదుట భారీగా మోహరించిన పోలీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు, యంగ్ ఇండియన్​ కార్యాలయం సీజ్ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్​పథ్​లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. దిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్​ చేశారని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి.. మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట పోలీసుల మోహరింపు

ఏంటీ కేసు?
కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్​లను ఈడీ ప్రశ్నించింది. మూడు రోజుల విచారణలో భాగంగా సోనియాకు వందకు పైగా ప్రశ్నలు సంధించింది.

నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇవీ చూడండి:ఆ రూ.50లక్షల కారణంగానే సోనియా, రాహుల్​కు ఇన్ని చిక్కులు!

సోనియాకు ఈడీ 110 ప్రశ్నలు.. అన్నింటికీ ఒకటే సమాధానం!

Last Updated :Aug 3, 2022, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details