ఆ రూ.50లక్షల కారణంగానే సోనియా, రాహుల్​కు ఇన్ని చిక్కులు!

author img

By

Published : Jun 14, 2022, 3:21 PM IST

National Herald Case

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి ఈడీ సమన్లు పంపడం.. మరోవైపు రాహుల్ గత రెండు రోజులుగా ఈడీ విచారణకు హాజరవ్వడమే ఇందుకు కారణం. నేషనల్ హెరాల్డ్​ పత్రికలో అవకతవకలు జరిగాయని అధికార భాజపా విమర్శలు కురిపిస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం అటువంటిదేమీ లేదని సమర్థించుకుంటోంది. అసలేంటీ నేషనల్ హెరాల్డ్ కేసు?

National Herald case: బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ 'నేషనల్‌ హెరాల్డ్‌' పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. స్వాతంత్య్ర సమరయోధులు 5వేల మంది వాటాదారులు కాగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాన దాత. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ పార్టీ అధికార పత్రికగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆంగ్లంలో, 'క్వామీ అవాజ్‌'గా ఉర్దూలో, 'నవజీవన్‌'గా హిందీలో వెలువడేది. 2008లో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక మూతపడే నాటికి రూ.90.25 కోట్ల మేర కాంగ్రెస్‌ పార్టీకి ఆ సంస్థ బకాయిపడింది. ఇది వడ్డీలేని రుణం.

యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ ప్రారంభం: కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) 2009లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత 2010లో లాభాపేక్షలేని దాతృసంస్థగా యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌(వైఐఎల్‌) ఆవిర్భవించింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆ సంస్థ డైరెక్టర్‌. రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ నేతలు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ ఆ సంస్థ భాగస్వాములు. ఆ తర్వాత మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ మృతి చెందారు.

2010 నాటికి ఏజేఎల్‌ 1057 మంది షేర్‌ హోల్డర్లను కలిగి ఉంది. వారిలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ తండ్రి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జు తండ్రి కూడా ఉన్నారు. అయితే, తనకు బకాయిపడిన ఏజేఎల్‌ను కాంగ్రెస్‌ పార్టీ 2011లో యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. దీనికి గాను కాంగ్రెస్‌ పార్టీకి రూ.50 లక్షలను చెల్లించిన వైఐఎల్‌...నేషనల్‌ హెరాల్డ్‌ హక్కులను సొంతం చేసుకుంది. 2016లో ఏజేఎల్‌... మూడు భాషల్లో పత్రికలను పునఃప్రారంభించింది.

2012 నుంచి కీలక మలుపులు: నేషనల్‌ హెరాల్డ్‌, ఏజేఎల్‌ అప్పులు, ఆస్తులన్నీ యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు దఖలుపడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తీసుకుంది. నేషనల్‌ హెరాల్డ్‌ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్‌ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రమణ్య స్వామి 2012లో దిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

స్వామి ఆరోపణలివి..: రాహుల్‌ గాంధీ డైరెక్టర్‌గా ఉన్న వైఐఎల్‌ మూలధన పెట్టుబడి రూ.5 లక్షలు మాత్రమే. కోల్‌కతాకు చెందిన డొల్ల సంస్థ డొటెక్స్‌ మర్చెండైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.కోటి రుణం తీసుకుని అందులోంచి రూ.50 లక్షలను కాంగ్రెస్‌కు చెల్లించి నేషనల్‌ హెరాల్డ్‌పై హక్కులు పొందింది. ఏజేఎల్‌కు చెందిన మూతపడిన మీడియా సంస్థలను, వాటికి దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రూ.2వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను వైఐఎల్‌ మోసపూరితంగా స్వాధీనం చేసుకుంది.

  • నేషనల్‌ హెరాల్డ్‌ నుంచి రావాల్సిన బకాయి రూ.90.25 కోట్లకు గాను వైఐఎల్‌ నుంచి రూ.50 లక్షలు మాత్రమే తీసుకున్న కాంగ్రెస్‌పార్టీ.. మిగతా రుణ మొత్తం రూ.89.75 కోట్లను చెల్లించనవసరం లేకుండా మాఫీ చేసింది. ఏజేఎల్‌లో మిగిలిన వాటాదారులు శాంతి భూషణ్‌, మార్కండేయ కట్జు తదితరుల అనుమతిలేకుండానే ఆ సంస్థకు చెందిన రూ.వందల కోట్ల ఆస్తులు సోనియా, రాహుల్‌ గాంధీలకు చెందిన వైఐఎల్‌కు మళ్లాయి.
  • నేషనల్‌ హెరాల్డ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన రూ.90.25 కోట్ల అప్పు కూడా అక్రమమే.

కాంగ్రెస్‌ స్పందన ఇదీ..: ఏజేఎల్‌కు రూ.90.25 కోట్లను వడ్డీలేని రుణంగా ఇచ్చినందున ఇది సక్రమమేనని కాంగ్రెస్‌ పార్టీ సమర్థించుకుంది. ఏజేఎల్‌ తమ అనుబంధ సంస్థేనని, మూతపడిన సంస్థను, దానికి చెందిన పత్రికలను పునరుద్ధరించడం పార్టీ బాధ్యతగా పేర్కొంది. యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ దాతృ సంస్థ మాత్రమేనని, లాభార్జన ఉద్దేశం లేదని చెబుతోంది.

ఇవీ చదవండి: 'ఇకపై జాగ్రత్తగా ఉంటా'.. ఈడీ అధికారులకు రాహుల్ క్షమాపణ!

రాష్ట్రపతి రేసుకు 'పవార్'​ దూరం.. పట్టుబడుతున్న విపక్షాలు.. అయినా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.