సోనియాకు ఈడీ 110 ప్రశ్నలు.. అన్నింటికీ ఒకటే సమాధానం!

author img

By

Published : Jul 27, 2022, 3:57 PM IST

Sonia Gandhi ED case

Sonia Gandhi ED probe: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు విచారించిన ఈడీ.. అవసరమైనప్పుడు మరోసారి పిలుస్తామని తెలిపింది. మరోవైపు, ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Sonia Gandhi ED case: నేషనల్ హెరాల్డ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే రెండు రోజులు సోనియాను విచారించిన ఈడీ.. బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించింది. కొత్తగా ఎలాంటి సమన్లు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారు.

సెంట్రల్ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ చేరుకున్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ ఆమె వెంట వెళ్లారు. 11.15 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. కేసు విచారణ జరుపుతున్న కీలక అధికారి.. సోనియాను ప్రశ్నలు అడిగారు. మరో అధికారి ఆమె చెప్పిన సమాధానాలను రాసుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం కోసం సోనియా ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3.30కి మరోసారి రావాలని అధికారులు తొలుత సమాచారం ఇచ్చారు. అయితే, విచారణ ముగిసిందని, ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయానికి రావాల్సిన పని లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సోనియాకు చెప్పినట్లు సమాచారం. సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

కాంగ్రెస్ ఆందోళన..
సోనియాను ఈడీ ప్రశ్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ నేతలు బైఠాయించారు. మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలతో పాటు సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సైతం నిరసనల్లో పాల్గొనడం గమనార్హం.

Sonia Gandhi ED case
నేతలను బస్సులోకి ఎక్కిస్తున్న పోలీసులు

రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్​సభలో కాంగ్రెస్​పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు నిరసనకు దిగారు. నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించడం సహా పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. అయితే, నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన వారిని సైతం నిర్బంధించారు.

"ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి సమస్యలపై ప్రజల తరఫున మేం పోరాడుతున్నాం. ఈడీ సహా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై మా పోరాటం కొనసాగిస్తాం. ఎంపీలపై సస్పెన్షన్ విధించడం తప్పు. దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం" అని ఖర్గే అన్నారు. 'విపక్షాలు లేని దేశాన్ని ప్రభుత్వం కోరుకుంటోంది. దర్యాప్తు ఏజెన్సీలను సర్కారు ఇలా ఉపయోగించడాన్ని బట్టి చూస్తే ఇది స్పష్టమవుతోంది' అని కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.

"వరుసగా మూడోరోజూ ఆందోళన చేస్తున్న ఎంపీలను నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో దేవుడికే (ప్రధాని, కేంద్ర హోంమంత్రి) తెలియాలి. ఇది ప్రజాస్వామ్య హత్యే. జీఎస్టీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. చర్చ జరపాలని పార్లమెంట్​లో మేం అడిగితే మళ్లీ ప్రతీకార రాజకీయాలు మొదలుపెడుతున్నారు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు.
అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నేతల్ని విడిచి పెట్టినట్లు కాసేపటి తర్వాత పోలీసులు ప్రకటించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.