తెలంగాణ

telangana

'వెన్న తింటున్న కృష్ణుడి బొమ్మ'... కేరాఫ్ ముస్లిం మహిళ

By

Published : Sep 30, 2021, 5:30 PM IST

muslim woman painting sri krishna
muslim girl sri krishna painting ()

కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ (Muslim girl Painting) ఇప్పటివరకు 500కు పైగా శ్రీకృష్ణుడి బొమ్మలను గీశారు. వీటిని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం వల్ల.. చాలావరకు గుళ్లకు, తెలిసినవారికి దానం చేశారు. ఈ పెయింటింగ్​లకు పూజచేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయన్న వార్తతో.. ఆమె చిత్రా​లకు డిమాండ్ పెరిగిపోయింది.

ఆమె ఓ యాదృచ్ఛిక కళాకారిణి... వందల కొద్దీ శ్రీకృష్ణుడి పెయింటింగ్​లు వేశారు.. కానీ ఏ ఒక్కటీ ఇంట్లో ఉంచుకునే భాగ్యం లేదు. దీంతో వేసిన పెయింటింగ్​లను చాలావరకు గుడికి దానం చేసేశారు. కానీ ఒక్కసారి కూడా గుడిలోకి వెళ్లే అదృష్టం కలగలేదు. మందిర ఆచారాలు, నిబంధనలు ఇతర మతానికి చెందిన వ్యక్తులను అనుమతించవు. దీంతో ఆమెకు గుడిలోకి వెళ్లి పెయింటింగ్​లను స్వయంగా అందించే భాగ్యం దక్కలేదు. కానీ కాలం కలిసొచ్చింది. గర్భగుడిలోకి వెళ్లే అవకాశం వచ్చింది.

కథనంలోకి వెళ్తే...

త్రిస్సూర్ జిల్లాకు చెందిన జాస్న సలీం(28) (Jasna Salim ) గత ఆరేళ్లలో 500కు పైగా కృష్ణుడి బొమ్మలేశారు. ఎలాంటి శిక్షణ లేకుండానే వీటిని తన కుంచెతో తీర్చిదిద్దారు. బంధువులు, సామాజిక వర్గానికి చెందినవారు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆమె వినలేదు. ఇంటి పనులు చూసుకుంటూనే వెన్న ఆరగిస్తున్న చిన్నికృష్ణుడి బొమ్మలను తీర్చిదిద్దారు. వీటిని ఇంట్లో ఉంచుకునేందుకు పెద్దలు అడ్డుచెప్పినందుకు పెయింటింగ్​లను అన్నింటినీ.. గురువయూర్ శ్రీకృష్ణ మందిరానికి (Guruvayur Temple) ఇచ్చేవారు.

జాస్న సలీం గీసిన కృష్ణుడి బొమ్మ
.
.

అప్పుడొచ్చింది ఆహ్వానం..

అయితే, ఆమెకు పథనంతిట్ట జిల్లాలోని పండళం ప్రాంతంలో ఉన్న ఉలనాడు శ్రీకృష్ణస్వామి మందిర (Ulanadu Sreekrishna Temple) నిర్వాహకులు అనూహ్యంగా ఆహ్వానం పంపారు. గత ఆదివారం సంప్రదాయపద్ధంగా పెయింటింగ్​ను మహిళ నుంచి నేరుగా స్వీకరించారు. దీంతో సలీం ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న కల నిజమైందని ఆమె సంతోషంలో మునిగితేలుతున్నారు.

శ్రీకృష్ణుడి పెయింటింగ్​తో జాస్న సలీం
.

"నిజంగా నా కల సాకారమైన క్షణాలివి. నా జీవితంలో తొలిసారి గుడిలోకి వెళ్లి దేవుడిని దర్శించుకున్నా. గర్భగుడి ముందు నిల్చున్నా. గుడి అధికారులు నాకు ఆచారాల గురించి వివరించారు. గర్భగుడి ముందు నిలబడే.. పెయింటింగ్​ను ఓపెన్ చేసి.. దేవుడికి చూపించా. పెయింటింగ్​ను పూజారి తులసీ దండతో అలంకరించారు. ఇది నిజంగా మనోహరమైన అనుభూతి."

-జాస్న సలీం

గత జన్మాష్టమికి గురువాయుర్ మందిరానికి సలీం ఇచ్చిన పెయింటింగ్​ను చూసి పథనంతిట్టలోని అధికారులు ఆమెను సంప్రదించారు. పుణెకు చెందిన భక్తులు కొందరు స్థానిక మందిరానికి పెయింటింగ్ అందించాలనుకుంటున్నారని, దాన్ని మీరే గీయాలని సలీంతో చెప్పారు. హిందూయేతరలకు ఆ మందిరంలోకి వెళ్లకుండా ఆంక్షలేవీ లేవని, స్వయంగా గుడిలోకి వెళ్లి పెయింటింగ్ సమర్పించవచ్చని తెలిపారు. దీంతో జాస్న కల సాకారమైనట్లైంది.

.

వెన్నదొంగ చిత్రాలే...

చిత్రమేంటంటే.. జాస్న సలీం గీసిన పెయింటింగ్​లన్నీ కృష్ణుడివే. ఆమె వృత్తిరీత్యా పెయింటర్ ఏం కాదు. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ సాధారణ గృహిణి మాత్రమే. జాస్న కేవలం వెన్న పట్టుకున్న చిన్నికృష్ణుడి బొమ్మలు మాత్రమే గీయగలుగుతోంది. వేరే పెయింటింగ్​లను ప్రయత్నించినా.. అవి అంత పరిపూర్ణంగా రావడం లేదు.

శ్రీకృష్ణ, గోపికల అవతారంలో ఉన్న చిన్నారులతో...

"నేను యాక్సిడెంటల్ ఆర్టిస్ట్​ని. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు. ఆరేళ్ల క్రితం సడెన్​గా పెయింటింగ్ వేయడం ప్రారంభించా. అప్పుడు నేను గర్భంతో ఉన్నా. అదే సమయంలో యాక్సిడెంట్ జరిగింది. దీంతో పెయింటింగ్​ను ప్రయత్నించా. కృష్ణుడి బొమ్మలు మాత్రమే కచ్చితత్వంతో గీయగలుగుతున్నా. దీనికి కారణమేంటన్నది మాత్రం తెలియదు."

-జాస్న సలీం

జాస్న తొలి పెయింటింగ్ వేసినప్పుడు.. ఆమె భర్త వద్దని వారించారు. సంప్రదాయాలను పాటించే తన కుటుంబంలోని వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తారని భయపడ్డారు. అయితే, అందుకు జాస్న మనసు ఒప్పుకోలేదు. దీంతో పెయింటింగ్ పూర్తైన తర్వాత దాన్ని.. దగ్గర్లోని నంబూతిరి కుటుంబానికి జాస్న భర్త కానుకగా ఇచ్చారు. ఈ పెయింటింగ్​ను ఇంట్లో పెట్టుకొని పూజించిన తర్వాత నంబూతిరి కుటుంబానికి బాగా కలిసొచ్చింది. తన కోరికలు చాలా వరకు తీరిపోయాయని వారు చెప్పారు. దీంతో ఈ వార్త కాస్తా జనంలోకి వెళ్లిపోయింది. ముస్లిం మహిళ శ్రీకృష్ణుడి బొమ్మల గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వారు తమకూ ఓ బొమ్మ గీసిపెట్టాలని కోరుతూ వచ్చారు. ఇప్పుడైతే ఏకంగా సెలెబ్రిటీలు సైతం జాస్న పెయింటింగ్​ కోసం ఎదురుచూస్తున్నారు. కేరళలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచీ పెయింటింగ్​ల కోసం అభ్యర్థనలు వస్తున్నాయి.

జాస్న గీసిన చిత్రం.

"దుబాయ్​లో పనిచేస్తున్న నా భర్త.. నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. ఆయన స్నేహితుల్లో చాలా వరకు హిందువులే. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా నా పనికి అభ్యంతరం చెప్పడం లేదు. నా మతానికి వ్యతిరేకంగా నేనేం చేయడం లేదని వారు గుర్తించారు. మా విశ్వాసాలను విడిచిపెట్టడం లేదని వారికి అర్థమైంది. కొందరు బంధువులు ఇంకా నా పనిని ఒప్పుకోవడం లేదు. నేనేం తప్పు చేయడం లేదు కాబట్టి వారి అభ్యంతరాలను పట్టించుకోను. నా భర్త, కుటుంబ సభ్యుల అభిప్రాయమే నాకు ముఖ్యం. నా పెయింటింగ్​లు ఇతరులకు ఆనందాన్ని ఇస్తున్నాయంటే.. నేనెందుకు ఆ పని ఆపేయాలి?"

-జాస్న సలీం

నెలకు ఐదు నుంచి ఆరు పెయింటింగ్​లను వేస్తున్నారు జాస్న. ఒక్కో చిత్రాన్ని రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. మందిరంలోకి వెళ్లి పెయింటింగ్ సమర్పించాలన్న కోరిక నెరవేరిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక చిత్రాన్ని బహూకరించడాన్ని తన తదుపరి ఆశయంగా పెట్టుకున్నారు జాస్న.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details