తెలంగాణ

telangana

ముంబయిలో స్వైన్ ఫ్లూ విజృంభణ, దిల్లీలో కరోనా విలయం

By

Published : Aug 16, 2022, 10:18 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో స్వైన్​ఫ్లూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆగస్టు ఒకటి నుంచి 14 వరకు 138 కేసులు బయటపడ్డట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, దిల్లీలో కరోనా విలయం కొనసాగుతోంది.

delhi covid cases
MUMBAI SWINE FLU

Swine flu Mumbai 2022: మహరాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. 15 రోజుల వ్యవధిలో ముంబయిలో 138స్వైన్‌ ఫ్లూ కేసులతో పాటు 412 మలేరియా, 73 డెంగీ కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ఆగస్టు 1 నుంచి 14వరకు నమోదైనట్టుగా తెలిపారు. జులై నెలతో పోలిస్తే ఆగస్టులో ఈ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) బారిన పడినవారిలో జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, డయోరియా, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Delhi Covid cases: మరోవైపు, దిల్లీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ రాజధానిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతిరోజు రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు సగటున 8-10 మంది మృతిచెందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణలు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని దిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ట్వీట్‌ చేశారు. 'కొవిడ్‌ వ్యాప్తిని చూస్తున్నాం. అధిక కేసులు, పాజిటివిటీ రేటు నమోదవుతోంది. మహమ్మారి ఇంకా కొనసాగనుందనే విషయాన్ని మనం గ్రహించాలి. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలి' అని పేర్కొన్నారు. వైద్య నిపుణురాలు, లాన్సెట్‌ కమిషన్‌ సభ్యురాలు సునీలా గార్గ్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సోమవారం, మంగళవారం మినహా.. గడిచిన 12రోజులు దిల్లీలో వరుసగా 2వేలకు పైగానే కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా, దిల్లీలో 917 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, పాజిటివిటీ రేటు మాత్రం 19.20 శాతంగా ఉంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 1,227 కేసులు నమోదవగా, పాజిటివిటీ రేటు 14.57శాతంగా ఉంది. ఎనిమిది మంది మరణించారు. అంతకుముందు ఆదివారం 2,162 మందికి పాజిటివ్‌గా తేలింది. ఐదుగురు ప్రాణాలు విడిచారు. అంతకుముందు రోజు 2,031 మందికి కరోనా నిర్ధారణ కాగా, తొమ్మిది మంది మృతిచెందారు. కేసుల విజృంభణతో దిల్లీ ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది.

ABOUT THE AUTHOR

...view details