తెలంగాణ

telangana

సినిమాలు పైరసీ చేస్తే మూడేళ్లు శిక్ష, భారీగా ఫైన్.. సెన్సార్ సర్టిఫికేట్ల జారీకి కొత్త రూల్స్

By

Published : Jul 27, 2023, 5:34 PM IST

Updated : Jul 27, 2023, 6:32 PM IST

సినిమా పైరసీని నియంత్రించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం సినిమాలను పైరసీ చేసే వ్యక్తులకు మూడేళ్ల శిక్ష విధించనున్నారు. దీంతో పాటు సినిమా బడ్జెట్​లో ఐదు శాతాన్ని జరిమానాగా విధించనున్నారు. మరోవైపు, సెన్సార్ సర్టిఫికేట్లలో కొత్తగా కేటగిరీలు ప్రవేశపెట్టనున్నారు.

RS-CINEMATOGRAPH BILL
RS-CINEMATOGRAPH BILL

సినిమాల పైరసీని అడ్డుకునే విధంగా మార్పులు చేసిన 2023 సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మణిపుర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు వాకౌట్ చేసిన నేపథ్యంలో.. బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. 1952 సినిమాటోగ్రాఫ్ చట్టానికి సవరణగా ఈ బిల్లును తీసుకొచ్చారు. సినిమాలను పైరసీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణ బిల్లు రూపొందించారు. దీని ప్రకారం.. సినిమాల పైరసీ కాపీలను రూపొందించే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా.. సినిమా వ్యయంలో ఐదు శాతాన్ని నిందితులకు జరిమానాగా విధించనున్నారు.

దీంతో పాటు సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్​సీ) ఇచ్చే ధ్రువీకరణను ప్రస్తుతం ఉన్న పదేళ్ల కాలానికి బదులుగా.. శాశ్వతంగా కొనసాగేలా చట్ట సవరణ చేశారు. వయసు ఆధారంగా ఇచ్చే సెన్సార్ సర్టిఫికేషన్​లో కేటగిరీలు తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. 'యూఏ7 ప్లస్', 'యూఏ 13 ప్లస్', 'యూఏ 16ప్లస్' కేటగిరీలను తీసుకురావాలని ప్రతిపాదించారు. టీవీలు, ఇతర మాధ్యమాల కోసం ప్రత్యేక సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని సీబీఎఫ్​సీకి కట్టబెడుతూ చట్టంలో సవరణ చేశారు. అనధికారంగా సినిమా రికార్డ్ చేయడాన్ని నిషేధిస్తూ ఈ బిల్లులో కొత్త నిబంధన చేర్చారు. వాటిని ప్రదర్శించడాన్నీ నిషేధించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని, దాన్ని అరికట్టేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని సభలో ఓ ప్రశ్నకు బదులుగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

లోక్​సభలో మరో బిల్లు పాస్..
దీంతో పాటు వ్యాపార నిర్వహణకు సంబంధించి పలు చిన్న దోషాలను నేరజాబితాలో నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన 2023-ది జన్ విశ్వాస్ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. 42 చట్టాల్లోని 183 నిబంధనలను ఇది సవరించనుంది. ఈ బిల్లు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు గట్టెక్కింది. మరోవైపు, ఆఫ్​షోర్ ఏరియాస్ మినరల్ సవరణ చట్టాన్ని లోక్​సభలో ప్రవేశపెట్టారు.

పార్లమెంట్​లో అదే సీన్..
ఇక.. మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గురువారం రెండు బిల్లులు ఆమోదం మినహా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. విపక్ష సభ్యులు కొందరు నల్లదుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభంకాగానే... స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. తమ స్థానాల నుంచి లేచి వెల్ లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు.. ఇండియా ఫర్ మణిపుర్ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. తక్షణం మణిపుర్ అంశంపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనడం వల్ల స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2గంటల వరకు లోక్‌సభను వాయిదా వేశారు.

ఆ తర్వాత సభ సమావేశం కాగానే విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరగడం వల్ల సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. 3గంటలకు తిరిగి సమావేశం కాగా.. ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. విపక్షాల నినాదాల మధ్యే వాటిని ఆమోదించిన తర్వాత లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోను మణిపుర్‌ అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. చర్చకు ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా.. విపక్షాలు వాకౌట్‌ చేశాయి. అంతకుముందు కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, 2 గంటల వరకు మరోసారి రాజ్యసభ వాయిదా పడింది.

'ముందు అవిశ్వాస తీర్మానంపై చర్చిద్దాం'
పార్లమెంట్​లో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వీలైనంత త్వరగా చర్చ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. నిబంధనల ప్రకారం.. అవిశ్వాస తీర్మానం ఉన్న సమయంలో బిల్లులను ఆమోదించుకోవడం సరికాదని హితవు పలికింది. మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించాలని డిమాండ్ చేసింది.

Last Updated : Jul 27, 2023, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details