తెలంగాణ

telangana

Vizag Steel Plant Issue : 'కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది మరి'

By

Published : Apr 13, 2023, 5:40 PM IST

TS Minsters Responded on Vizag Steel Plant Issue : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ministers
ministers

Minsters Responded on Vizag STEEL PLANT Issue: భారత రాష్ట్ర సమితి తెగించి కొట్లాడిన తర్వాతే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది ముఖ్యమంత్రి మాత్రమేనని తెలిపారు. ఆ ప్రభావంతోనే కేంద్రం ఈ ప్రకటన చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీ ప్రైడ్ కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవార్డులు, ప్రోత్సాహకాలను కేటీఆర్ అందించారు. తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో కేంద్రం కూడా అదే చేస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులు గొప్పగా ఎదుగుతున్నారని.. దళితబంధు పథకం కేసీఆర్‌లాంటి దమ్మున్న నాయకునితోనే సాధ్యమని అన్నారు. ఇంటింటికీ వంద శాతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని పేర్కొన్నారు.

ప్రజల ఆశీర్వాదం ఉంటేనే:అదే గుజరాత్‌లో 12 ఏళ్లు గడిచినా ఇంకా పనులు పూర్తి కాలేదని కేటీఆర్ తెలిపారు. ఎర్రటి ఎండల్లో కూడా జలాశయాల్లో నీరు నిండుకుండలా ఉన్నాయని పేర్కొన్నారు. నీళ్లు వచ్చాయా, ఎక్కడున్నాయని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి అవి చూపిస్తానని రమ్మంటే.. రాకుండా పైకి మళ్లీ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. దళిత, గిరిజనుల పారిశ్రామిక వేత్తల కోసం.. రెండెకరాల స్థలాన్ని దండుమల్కాపూర్‌లో రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పిస్తామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారంలో ఉంటామని.. లేదంటే ఎవరైనా చెత్త బుట్టలో ఉండాల్సిందేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేంద్రం దిగొచ్చింది: విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ దెబ్బకు.. కేంద్రం దిగివచ్చిందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడం లేదని.. బలోపేతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. దీనిపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం చేసిందని వివరించారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాము తెగించి కొట్లాడాం:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ విజయమని.. బీఆర్‌ఎస్‌ విజయం అని అన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు.. విశాఖ కార్మికుల విజయమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కుపైన గట్టిగా మాట్లాడింది సీఎం కేసీఆర్ అని వివరించారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం ఇప్పుడు ఈ ప్రకటన చేసిందని వెల్లడించారు. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు.

ఇవీ చదవండి:ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాలనుకోవట్లేదు: కేంద్రమంత్రి ఫగ్గన్‌

'ఆ కంపెనీల్లో 40లక్షల ఉద్యోగాలు'.. 71వేల మందికి మోదీ అపాయింట్​మెంట్ లెటర్స్

ABOUT THE AUTHOR

...view details