తెలంగాణ

telangana

'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు

By

Published : Jul 20, 2022, 4:00 PM IST

shivsena supreme court
CJI Ramana Shivsena case

CJI Ramana Shivsena case: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యాలపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Maharashtra politics SC hearing: శివసేన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు, అనర్హత, పార్టీ విలీనం అంశాలపై ఈ వ్యాజ్యాలు అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవెనత్తుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీటిపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. వచ్చే బుధవారం (జులై 27) నాటికి అన్ని పార్టీలు తమ సమస్యలపై వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్​నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్​పై ధర్మాసనం విచారణ జరిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్.. పార్టీ నియమించిన విప్​కు బదులుగా ఇతరులను విప్​గా గుర్తించడాన్ని ఠాక్రే తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇది పదో షెడ్యూల్​కు విరుద్ధమని, ప్రజల తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ నుంచి దూరమైన ఓ వ్యక్తి(శిందే)తో గవర్నర్.. ప్రమాణస్వీకారం చేయించడం సరికాదని వాదించారు.

అయితే, శిందే తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. సిబల్ వాదనను తోసిపుచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూటమిగా ఏర్పడి తమ నాయకుడిని ఎన్నుకోవచ్చని అన్నారు. 'ఓ నాయకుడు పార్టీలో మెజారిటీ సంపాదించి.. పార్టీలో నుంచి బయటకు వెళ్లకుండా ఆ పార్టీ నాయకుడినే ప్రశ్నిస్తే అది ఫిరాయింపు కిందకు రాదు. పార్టీలోని నేతలంతా తమ నాయకుడిని ఎంచుకోవడంలో తప్పేముంది? ముఖ్యమంత్రి మారినంత మాత్రాన ఆకాశం ఊడిపడినట్లు కాదు' అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సీజేఐ కల్పించుకొని.. 'ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు' అని వ్యాఖ్యానించారు. 'వాదనలు విన్న తర్వాత కొన్ని సమస్యలపై విస్తృత ధర్మాసనం పరిశీలన అవసరమనిపిస్తోంది. వచ్చే బుధవారం లోపు అన్ని పక్షాలు దీనిపై అభిప్రాయాలు సమర్పించాలి' అని సీజేఐ బెంచ్ పేర్కొంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details