తెలంగాణ

telangana

బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి.. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి..

By

Published : Dec 10, 2022, 9:23 AM IST

Updated : Dec 10, 2022, 10:13 AM IST

మధ్యప్రదేశ్​లోని బేతుల్​ జిల్లాలో ఐదు రోజుల క్రితం బోరు బావిలో పడ్డ చిన్నారి శనివారం ఉదయం మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. బావి నుంచి అతడి మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

madhyapradesh-betul-borewell-child-died
madhyapradesh-betul-borewell-child-died

మధ్యప్రదేశ్​లోని బేతుల్​ జిల్లాలో బోరు బావిలో పడ్డ చిన్నారి దాదాపు ఐదు రోజులు మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం మృతిచెందాడు. గత ఐదు రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్​ బాలుడి ప్రాణాలను రక్షించలేకపోయింది. బావి నుంచి అతడి మృతదేహాన్ని ఉదయం ఐదు గంటల సమయంలో వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. చిన్నారి తన్మయ్​ మృతికి సంతాపం తెలిపిన మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ అతడి కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్​గ్రేషియాను ప్రకటించారు.

మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్ సింగ్​ చౌహాన్​ ట్వీట్​

ఇదీ జరిగింది
డిసెంబర్​ 6న సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటున్న బాలుడు బోరుబావిలో పడ్డాడు. అది చూసిన తన్మయ్​ సోదరి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి పడిపోయిన గంట తర్వాత సంబంధిత అధికారులు రెస్క్యూ ఆపరేషన్​ను ప్రారంభించారు. బాలుడి చేతిని తాడుతో కట్టి లాగేందుకుయత్నించారు. సుమారు 12 అడుగుల వరకు బాలుడు బాగానే పైకి వచ్చినప్పటికి ఆ తరువాత తాడు తెగిపోయింది. దీంతో మరో మార్గం ద్వారా వెలికితీసేందుకు ప్రయత్నించారు. అంతే కాకుండా బాలుడితో తండ్రి మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆ సమయంలో తండ్రితో మాట్లాడిన బాలుడు "ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది నాన్న.. నన్ను త్వరగా బయటకు తీయండి" అని అన్నాడు. తర్వాత బాలుడి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆపరేషన్​ను మరింత ముమ్మరం చేశారు. మూడు రోజులైనా వెలికి తీయకపోవడం వల్ల చిన్నారి తల్లి అధికారులపై మండి పడింది. కాసేపటికి ఆమెకు సర్ది చెప్పిన అధికారులు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ఐదు రోజుల తర్వాత శనివారం బాలుడి నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలిపిన అధికారులు అతన్ని వెలికి తీయగా అప్పటికే చిన్నారి తన్మయ్​ మృతి చెందినట్లు నిర్ధరించారు.

Last Updated : Dec 10, 2022, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details