తెలంగాణ

telangana

లఖింపుర్‌ ఘటనలో మరో ఛార్జ్‌షీట్‌.. రైతులపైనా అభియోగాలు..

By

Published : Jan 22, 2022, 5:28 AM IST

Lakhimpur Kheri Violence: లఖింఫుర్ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్​షీట్ దాఖలైంది. భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు రైతులపైనా అభియోగాలు మోపుతూ రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు అధికారులు.

lakhmimpur
లఖింపుర్

Lakhimpur Kheri Violence: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకుగాను కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇదే ఘటనలో భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు రైతులపైనా అభియోగాలు మోపుతూ రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఇందులో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. రైతులపై వాహనం దూసుకెళ్లడం వల్ల ఆగ్రహం చెందిన రైతులు కారు డ్రైవర్‌, అందులోని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, కారు డ్రైవర్‌ మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు జోక్యంతో లఖింపుర్‌ ఖేరీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఘటనపై దర్యాప్తు జరిపిన సిట్‌ సంచలన విషయాలను వెల్లడించింది. ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల 5000 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

ఇక రైతులపై దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక భాజపా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడుగురు రైతులను అరెస్టు చేసి విచారించారు. ఈ రైతులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details