తెలంగాణ

telangana

కేజ్రీవాల్‌ను ఇంటికి ఆహ్వానించిన ఆటోడ్రైవర్​.. దిల్లీ సీఎం ఏమన్నారంటే..

By

Published : Sep 12, 2022, 9:34 PM IST

Kejriwal Gujarat Visit

Kejriwal Gujarat Visit : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈ తరుణంలోనే ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయనను.. ఇంటికి రావాలని ఆహ్వానించాడు ఓ ఆటోవాలా. దీనిపై ఆయన ఏమన్నారంటే?

Kejriwal Gujarat Visit : ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ గట్టిగా దృష్టిపెట్టింది. గత కొద్ది రోజుల నుంచి దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా ప్రముఖ నేతలందరూ రాష్ట్రంలో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్‌ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్‌.. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆటోవాలా దిల్లీ సీఎంను తన ఇంటికి భోజనానికి ఆహ్వనించగా.. స్వయంగా వచ్చి ఆటోలో తీసుకెళ్లాలని కేజ్రీవాల్‌ కోరారు.

ఈ ఉదయం కేజ్రీవాల్‌ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ.. దిల్లీలో తమ పార్టీకి మద్దతిచ్చినట్లుగానే గుజరాత్‌లోనూ ఆప్‌ను గెలిపించాలని కోరారు. ఆయన ప్రసంగం అయిపోగానే.. ఓ డ్రైవర్‌ లేచి కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. "నీకు మీకు(కేజ్రీవాల్‌) చాలా పెద్ద అభిమానిని. పంజాబ్‌లో మీరు ఓ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం చేసిన వీడియోను సోషల్‌మీడియాలో చూశాను. గుజరాత్‌లోనూ అలాగే చేస్తారా? మా ఇంటికి వస్తారా?" అని ఆ ఆటోవాలా అడిగారు.

ఇందుకు కేజ్రీవాల్‌ ఒప్పుకుంటూ.. 'ఎన్ని గంటలకు రమ్మంటారు?' అని అడిగారు. దీంతో ఆ ఆటోడ్రైవర్‌ సంతోషపడుతూ ‘రాత్రి 8 గంటలకు రండి’ అని పిలిచారు. ఆ వెంటనే కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. "అయితే మీరు నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి మీ ఆటోలో నన్ను తీసుకెళ్తారా? నాతో పాటు మరో ఇద్దరు పార్టీ నేతలు కూడా వస్తారు మరి" అని చెప్పారు. దీనికి ఆ డ్రైవర్‌ ఆనందంగా సరే అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

గతంలో పంజాబ్‌ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్‌ ఓ ఆటోవాలా ఇంట్లో భోజనం చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అప్పుడు కూడా ఆయన హోటల్‌ నుంచి ఆ డ్రైవర్‌ ఆటోలోనే అతడి ఇంటివెళ్లి నేలపై కూర్చుని భోజనం చేశారు.

ఇవీ చదవండి:రాహుల్ పాదయాత్రలో విచిత్ర సమస్య.. ఆ దొంగల దెబ్బకు అంతా హడల్

'ఎన్​కౌంటర్​ చేయకండి సార్​.. లొంగిపోతా'.. మెడలో బోర్డుతో పోలీస్​ స్టేషన్​కు పరుగులు

ABOUT THE AUTHOR

...view details