తెలంగాణ

telangana

పార్టీ చీఫ్ కోసం నిరీక్షణ.. చివరికి ప్రమాణ స్వీకారమే వాయిదా!

By

Published : Nov 11, 2021, 9:00 PM IST

Updated : Nov 11, 2021, 10:39 PM IST

తమ పార్టీ అధ్యక్షుడు వచ్చేవరకు వేచి ఉండాలని పట్టుబట్టి చివరకు ప్రమాణస్వీకారం చేయకుండానే వెనుదిరిగారో ఎమ్మెల్యే. అయితే ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయిందని చెప్పిన అధ్యక్షుడు.. ప్రమాణస్వీకారం చేయించాల్సిందిగా స్పీకర్​ను అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే మరోరోజు ప్రమాణం చేసేందుకు సిద్ధపడ్డారు.

mla oath
కాంగ్రెస్

తమ పార్టీ అధ్యక్షుడు వచ్చేవరకు వేచి ఉండాలని పట్టుబట్టిన ఓ ఎమ్మెల్యే చివరికి ప్రమాణస్వీకార కార్యక్రమాన్నే వాయిదా వేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో హంగల్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్‌ శాసనసభ్యుడు శ్రీనివాస్‌ మానె గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ వచ్చేవరకు సమయం ఇవ్వాల్సిందిగా స్పీకర్​ విశ్వేశ్వర హెగ్డేని కోరగా.. ఆయన నిరాకరించారు.

కొద్దినిమిషాల ముందు బయటకు..

సింద్గీ నుంచి కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యే రమేశ్ భుస్నూర్‌తో ప్రమాణం చేయించిన స్పీకర్.. తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస్ కోసం చూశారు. కానీ ప్రమాణస్వీకారానికి కొద్ది నిమిషాల ముందే ఆయన బయటకు వెళ్లిపోయారు. కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టిన ఆయన.. వేదిక నుంచి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే వర్షం, ట్రాఫిక్‌ కారణంగా శివకుమార్‌ ఆలస్యంగా వచ్చారని.. ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలన్నది తన కార్యకర్తల కోరిక అని మానె శ్రీనివాస్ పేర్కొన్నారు.

"ప్రమాణస్వీకారం కోసం కొంత సమయం వేచి ఉండమని స్పీకర్‌ను అభ్యర్థించా. కానీ ఆయన 'చెప్పలేం' అని అన్నారు. కార్యక్రమం అనుకున్న సమయానికి పూర్తయింది. స్పీకర్ నిర్ణయమే అంతిమం. నేనేమీ నిరాశ చెందట్లేదు. నా ప్రమాణ స్వీకారం మరొక తేదీన జరుగుతుంది."

---శ్రీనివాస్ మానె, కాంగ్రెస్ ఎమ్మెల్యే

'నో.. నో.. రాను రాను..'

స్పీకర్ వెళ్లిపోయిన కాసేపటికి విధానసభ వద్దకు చేరుకున్న శివకుమార్.. ప్రమాణ స్వీకారం చేయిస్తారని భావించి ఆయన కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా వ్యక్తిగతంగా స్పీకర్​కు ఫోన్ చేసి అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాను ముందస్తు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని.. మరో రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పీకర్ తెలిపారు.

మరోవైపు.. తన ఆలస్యానికి ట్రాఫిక్‌ మాత్రమే కారణమని శివకుమార్ స్పష్టం చేశారు. హంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన భాజపా.. శ్రీనివాస్ మానె ప్రమాణ స్వీకారం ఆగిపోవడాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

"అసెంబ్లీ విధుల పట్ల మాకు అవగాహన ఉంది. మేం స్పీకర్ కుర్చీని గౌరవిస్తాం. కావాలంటే స్పీకర్ ఐదు నిమిషాల పాటు వేచి ఉండగలరు. వెళ్లిపోయినప్పటికీ తిరిగి రావచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు,"

---డీకే శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు

కర్ణాటకలో అక్టోబర్ 30న రెండు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఒక స్థానంలో భాజపా గెలుపొందగా.. మరో స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి చేదు ఫలితాలనిచ్చాయి. హంగల్‌లో భాజపా ఓటమిని ఆయనకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్న షిగ్గావ్ నియోజకవర్గం హంగల్​కు పక్కనే ఉంటుంది. ఇక్కడ భాజపా గెలుపు కోసం ఆయన విస్తృతం ప్రచారం చేశారు. కానీ ఫలితం దక్కలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 11, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details