తెలంగాణ

telangana

కర్ణాటకలో మోదీ ప్రచార జోరు.. బెంగళూరులో 26 కి.మీ మెగా రోడ్​ షో.. తరలివచ్చిన కార్యకర్తలు

By

Published : May 6, 2023, 10:33 AM IST

Updated : May 6, 2023, 12:39 PM IST

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మెగా రోడ్​షోను నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నగరంలో దాదాపు 26 కిలోమీటర్ల పాటు కన్నడ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

karnataka election 2023
karnataka election 2023

కర్ణాటకలో మోదీ ప్రచార జోరు

కర్ణాటక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 26.5 కిలోమీటర్ల మేర మెగా రోడ్​ షోను చేపట్టారు. ఇటీవలే నైస్​ రోడ్​ జంక్షన్​ నుంచి బెంగళూరు నార్త్​ నియోజకవర్గంలోని సుమనహల్లి సర్కిల్​ వరకు రోడ్​ షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా బెంగళూరు సౌత్​ నియోజకవర్గంలో మెగా రోడ్​ షోను చేపట్టారు.

శనివరాం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. సోమేశ్వర్​ భవన్​ నుంచి బెంగళూరు సౌత్​లోని మల్లేశ్వర్​ సంకి ట్యాంక్​ వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని 34 రోడ్లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసివేశారు. వాహనదారులు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్​షో చేపట్టనున్నారు ప్రధాని మోదీ. కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్​ వరకు సాగనుంది.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజుల రోడ్​ షో పెట్టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒక రోజులో నగరమంతా పర్యటిస్తే.. ప్రజలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. నగరంలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని బీజేపీ ఎలక్షన్​ నిర్వహణ కమిటీ కన్వీనర్​ శోభా కరంద్లాజే చెప్పారు.

ప్రధాని మోదీ ర్యాలీపై కాంగ్రెస్​ ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన మెగా రోడ్​షోపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. ప్రధాని మోదీని మాటలు వక్రీకరించడంలో మాస్టర్​ అని.. ఆయన తన ర్యాలీలో పక్షపాతం, మతోన్మాదంపై రెచ్చగొడుతారని ఆరోపించింది.

'ఉచితంగా సిలిండర్లు.. 'నందిని' పాలు'
బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించడం, సంక్షేమం కల్పించడమే బీజేపీ విజన్‌ అని తెలిపారు.

భాజపా మేనిఫెస్టోలోని ప్రధాన హామీలివే..

  • కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు
  • తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు
  • పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్‌ కిట్‌.
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు (ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున)
  • కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ
  • ప్రతి వార్డులో అటల్‌ ఆహార కేంద్రాలు
  • మైసూరులోని ఫిల్మ్‌ సిటీకి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు
  • నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు
  • బెంగళూరుకు స్టేట్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్యాగ్
  • వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్‌ చెకప్‌లు
  • ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం
  • రూ.30వేల కోట్లతో మైక్రో కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల కల్పన
  • రూ.1500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి

Karnataka Election Date : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్​కు 76, జేడీఎస్​కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Last Updated : May 6, 2023, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details