ETV Bharat / opinion

బజరంగ్ బలీ చుట్టూ కర్ణాటక రాజకీయం.. కాంగ్రెస్​లో గుబులు.. నష్టం తప్పదా?

author img

By

Published : May 5, 2023, 9:58 PM IST

Bajrang dal ban controversy : కర్ణాటకలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల ప్రచార వ్యూహాలు మారిపోయాయి. మొదట అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, నేతల ఫిరాయింపులపై వాగ్బాణాలు సంధించుకున్న ఇరు పార్టీలు.. ఇప్పుడు రూటు మార్చాయి. ఎన్నికల ప్రణాళిక విడుదల ద్వారా కాంగ్రెస్‌ ప్రచార వ్యూహం మార్చిన నేపథ్యంలో.. కమలనాథులు సైతం ప్రతిదాడి మొదలుపెట్టారు. బజరంగదళ్‌పై నిషేధం, కేరళ స్టోరీ చిత్రం అంశాల ఆధారంగా హస్తం పార్టీపై విమర్శల దాడి పెంచారు.

KARNATAKA ASSEMBLY ELECTION CAMPAIGN CHANGE
KARNATAKA ASSEMBLY ELECTION CAMPAIGN CHANGE

Bajrang dal ban controversy : కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపించిన తరుణంలో ప్రధాన పార్టీల ప్రచార అజెండాలు మారిపోయాయి. మొదట అవినీతి, అభివృద్ధి, లింగాయత్‌ సీఎం, నేతల ఫిరాయింపు తదితర అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకొని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదలతో కర్ణాటక ఎన్నికల ప్రచార సరళి ఒక్కసారిగా మారిపోయింది. కర్ణాటక ప్రచారంలో ధార్మిక అంశాలు సెగ రేపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీ అవినీతి, టికెట్లు దక్కని సీనియర్లు నేతలు లక్ష్మణ్‌ సవది, జగదీశ్‌ శెట్టర్‌ వంటి కీలక నేతలు పార్టీ ఫిరాయించటంతో డీలాపడినట్లు కనిపించిన కమలం పార్టీ... కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక విడుదల తర్వాత దూకుడు పెంచింది. ప్రచారవ్యూహం మార్చింది. కాంగ్రెస్‌ లక్ష్యంగా ఎదురుదాడి చేస్తోంది.

కర్ణాటకలో తిరిగి అధికారం చేపట్టాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌ పార్టీ... ప్రభుత్వ అవినీతితోపాటు ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ తర్వాత ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన హస్తం పార్టీ... తాము అధికారంలోకి వస్తే మతకలహాలకు కారణమయ్యే వ్యక్తులు లేదా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా-PFI, బజరంగ్‌ దళ్ వంటి సంస్థలపై నిషేధం విధించనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రచారస్త్రంగా మార్చుకున్న కమలనాథులు హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకోని ఎదురుదాడి ఉద్ధృతం చేశారు.

రంగంలోకి మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నారు. మొదట రామున్ని జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు బజరంగ్‌ దళ్‌పై నిషేధం ద్వారా బజరంగ్‌ బలీని బంధించాలని చూస్తోందని హోస్పేట సభలో ప్రధాని మోదీ ఆరోపించారు. గత కొన్నిరోజుల నుంచి ప్రధాని మోదీ ఏ ప్రచారసభలోపాల్గొన్నా... తన ప్రసంగానికి ముందు, చివరలో జై బజరంగ్‌ బలీ అని నినదిస్తున్నారు.

ఆ వేడి కొనసాగేలా బజరంగ్‌ దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంస్థలు కూడా కాంగ్రెస్‌ మేనిఫెస్టోను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉద్ధృతం చేశాయి. హనుమాన్‌ చాలీసాను పఠిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. హనుమాన్‌ ఆలయాలు సహా ఇతర మందిరాల్లోనూ హనుమాన్‌ చాలీసా పఠనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. కర్ణాటక వెలుపల కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలం శ్రేణులు పోరుబాట పట్టాయి.

తాజాగా ప్రధాని మోదీ కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను కార్నర్‌ చేస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం కాంగ్రెస్‌ ఉగ్రవాదానికి రక్షణ నిలుస్తోందని ప్రచార సభల్లో విమర్శిస్తున్నారు. ఉగ్రకుట్రల కథాంశంతో నిర్మించిన కేరళ స్టోరీ చిత్రంపై నిషేధం విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్ర ప్రవృత్తి కలిగిన వారితో కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిలో రాజకీయ బేరసారాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ అలర్ట్.. ఆలయాల నిర్మాణానికి హామీ
మరోవైపు, బజరంగ్ దళ్​పై నిషేధం విధించాలన్న వ్యూహం ఎన్నికల్లో చేటు చేస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు హిందువుల ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బజరంగ్ దళ్​పై నిషేధం విధిస్తామని హామీ ఇవ్వడం అవసరం లేదని అంటున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అనుకున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు మంచిది కాదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. ప్రతి నియోజకవర్గాల్లో హనుమాన్ మందిరాలు నిర్మిస్తామని ప్రకటించారు. హనుమాన్ ఆలయాల అభివృద్ధికి అంజనాద్రి డెవలప్​మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. తామూ హిందువులమేనని, హనుమాన్​ను తామూ ఆరాధిస్తామని బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు.

అయితే, బజరంగ్ దళ్​పై నిషేధం విధిస్తామని ప్రకటించి బీజేపీకి కాంగ్రెస్ మంచి అవకాశం ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అన్ని కీలక అంశాలు పక్కకు వెళ్లిపోయాయని.. ప్రచారం మొత్తం దీనిపైనే సాగుతోందని చెబుతున్నారు. 'కమలం నేతలు ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు ఈ వ్యవహారంపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. చివరి వరకు ప్రచార సరళి ఇదే విధంగా కొనసాగేలా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచి బీజేపీ ఓట్లు అడిగే అవకాశం ఉంది' అని విశ్లేషకులు చెబుతున్నారు.

వాటిపై మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్
కర్ణాటకలో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తున్న రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలు... ప్రధాని మోదీ, ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నిస్తున్నారు. మూడున్నరేళ్లలో కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, పెట్రో ధరలు, వంట గ్యాస్‌ ధరల మంట, నిరుద్యోగం అంశాలపై కమలనాథులు మాట్లాడాలని అంటున్నారు. ప్రచార గడువు మరో 3రోజుల్లో ముగియనుండటం వల్ల ప్రధాన పార్టీల ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రచారంలో ఈ అనూహ్య మార్పు ఎవరికి లాభిస్తుందో చూడాలి మరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.