తెలంగాణ

telangana

Azadi Ka Amrit Mahotsav: శవాలనూ విభజించి పాలించిన బ్రిటిష్​ ప్రభుత్వం!

By

Published : Oct 28, 2021, 7:38 AM IST

జలియన్​వాలాబాగ్​ ఉదంతం అనంతరం ప్రకటించిన పరిహారంలోనూ బ్రిటిష్​ ప్రభుత్వం 'విభజించి పాలించు' విధానాన్ని అమలు చేసింది. ఘటనలో ఒకే విధంగా గాయపడిన ఇద్దరికి వేరువేరు పరిహారాలు చెల్లించి వివక్ష చూపించింది.

azadi ka amrit mahostav
శవాలనూ విభజించి పాలించిన బ్రిటిష్​ ప్రభుత్వం!

జలియన్‌వాలాబాగ్‌లో భారతీయులను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన బ్రిటిష్‌ ప్రభుత్వం.. వారి ప్రాణాలకు వెల కట్టడంలోనూ వివక్ష చూపింది. పరిహారం ఇచ్చే విషయంలోనూ పరిహాసమాడింది. శవాలను సైతం విభజించి పాలించింది.

1919లో జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు చెలరేగాయి. నిరసనగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తన నైట్‌హుడ్‌ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. బ్రిటన్‌, అమెరికాల్లోనూ జనరల్‌ డయ్యర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సంఘటన బ్రిటన్‌పై మాయని మచ్చగా మారటంతో ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ డయ్యర్‌ తీరును తప్పుపట్టింది. ఘోరమైన తప్పు చేశాడంటూ నిందించింది. డయ్యర్‌ను వెనక్కి పిలిపించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో తర్వాత కొన్నాళ్లకు జలియన్‌వాలాబాగ్‌ బాధితులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

చనిపోయిన వారి సంఖ్య విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి, ప్రజల వాదనకు భారీ తేడా ఉంది. వెయ్యిమందికిపైగా మరణించినట్లు స్థానికులు చెబుతుంటే.. ఆంగ్లేయ ప్రభుత్వం మాత్రం 376 మందే మరణించినట్లు తేల్చింది. పరిహారంపై తీవ్ర తర్జనభర్జన జరిగింది. చాలా మంది బ్రిటిష్‌ అధికారులు భారీ పరిహారం ఇవ్వటాన్ని వ్యతిరేకించారు. చర్చోపచర్చల అనంతరం మరణించినవారికి, గాయపడ్డవారికి, అనంతరం అల్లర్లలో ఆస్తులు దెబ్బతిన్నవారికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించి 1921లో మొదలెట్టారు.

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న దశలో తెల్లవారు తమ సంకుచితతత్వాన్ని బయటపెట్టారు. పరిహారంలో వివక్ష ప్రదర్శించసాగారు. సామాజిక, ఆర్థిక అంతరాలు చూపుతూ పరిహారం ప్రకటించారు. తద్వారా బాధిత కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. లక్ష్మీచంద్‌ అనే వ్యాపారి కాలికి బుల్లెట్‌ గాయమైంది. ఆయనకు రూ.60వేలు చెల్లించారు. అదేంటని అడిగితే.. 'సమాజంలో పేరున్నవాడు. పైగా ఆయన వార్షికాదాయం రూ.11వేలపైనే. గాయం కాకుంటే బాగా బతికి, ఎక్కువ సంపాదించేవాడుగా. అందుకే అంత పరిహారం,' అన్నారు. అంతే బుల్లెట్‌ గాయమైన 19ఏళ్ల ఓ చర్మకారుడికి రూ.170 మాత్రమే చెల్లించారు. మొత్తానికి అందరికీ కలిపి 22 లక్షల రూపాయలు చెల్లించినట్లు.. రూ.27వేలపైనే ఎవ్వరికీ ఇవ్వకుండా మిగిలిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఆ రక్తపు సొమ్ము వద్దు..

చాలా మంది పరిహారం తీసుకున్నా, ఇద్దరు మహిళలు మాత్రం తిరస్కరించారు. తమ భర్తలను చంపిన హంతకుల నుంచి డబ్బు తీసుకునేది లేదని అత్తర్‌కౌర్‌, రతన్‌దేవిలు స్పష్టం చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వ పరిహారాన్ని వారు 'రక్తపు సొమ్ము'గా అభివర్ణించారు.

ఇదీ చూడండి:-స్వాతంత్య్రం కోసం వెళ్లి.. సస్య విప్లవం తెచ్చి..

ABOUT THE AUTHOR

...view details