తెలంగాణ

telangana

రంగంలోకి INS వాగీర్​.. డ్రాగన్ నౌకల మారణాస్త్రం.. దాడి చేస్తే చావుదెబ్బే!

By

Published : Jan 21, 2023, 5:51 PM IST

ins vagir submarine

చైనాను చావుదెబ్బ తీయగల సత్తా దాని సొంతం. భారత నావికాదళాన్ని బలోపేతం చేయడమే దాని లక్ష్యం. సముద్రగర్భంలో శత్రువుకు చుక్కలు చూపించి విజయాన్ని చేరువ చేయడమే ధ్యేయం. గూఢచర్యమైనా, యుద్ధరంగమైనా ఆ జలాంతర్గామిని ఎదుర్కోవడం కష్టం. అదే INS వాగీర్‌. ఈ అధునాతన జలాంతర్గామి ఇప్పుడు భారత అమ్ములపొదిలో మరో ‌ప్రధాన అస్త్రంగా మారనుంది. భారత్‌పై నిఘా పెట్టే చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాములను పసిగట్టడమే కాదు. వాటిని ఢీకొట్టి వాటి పాలిట మారణాస్త్రంగా మారనుంది INS వాగీర్‌.

చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత నౌకాదళం మరో అస్త్రాన్ని అమ్ములపొదిలో చేర్చుకోనుంది. డ్రాగన్‌ నిఘాసామర్థ్యాన్ని గండికొట్టగల జలాంతర్గామిని సముద్రగర్భంలో మోహరించనుంది. జనవరి 23న ఐదో కల్వరీ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాగీర్‌ను భారత నౌకాదళం ప్రారంభించనుంది. ఐఎన్‌ఎస్‌ వాగీర్‌తో చైనా నుంచి సముద్రంలో ఎదురయ్యే ముప్పునకు చెక్ పెట్టొచ్చని నౌకాదళాధికారి దల్జీందర్‌ సింగ్‌ తెలిపారు. భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే ఈ జలాంతర్గామిని అధునాతన సాంకేతికతతో భారత్‌ నిర్మించింది. అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల ఈ జలాంతర్గామి శత్రు సబ్‌మెరైన్‌లు, యుద్ధనౌకలను సులువుగా ఏమార్చగలవు. ఇందులో ఉండే అధునాతన సోనార్‌, రాడార్‌ వ్యవస్థలు ప్రత్యర్థి నౌకలు, జలాంతర్గాముల కదలికలను నిశితంగా గమనించగలవు. యుద్ధం వస్తే శత్రువును నిలువరించేందుకు లేదా ఎదురుదాడికి దిగేందుకు అత్యాధునిక మైన్‌లు, టార్పిడోలను ఇందులో పొందుపరిచారు. దీన్ని తీరానికి దగ్గరగా లేదా నడిసముద్రంలోనూ మోహరించవచ్చని అధికారులు తెలిపారు.

INS వాగీర్‌ను ఫ్రాన్స్‌ సహకారంతో ముంబయిలోని నౌకానిర్మాణ సంస్థ మజ్‌గావ్​డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ నిర్మించింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో నౌకాదళ పర్యవేక్షణలో వాగీర్ నిర్మాణం జరిగినట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళ అవసరాలను తీర్చే ఈ జలాంతర్గామి నిర్మాణం భారత ఆత్మనిర్భరతకు అద్దం పడుతుందని అధికారులు వివరించారు. ఇప్పటికే నాలుగు కల్వరీ తరగతి జలాంతర్గాములు నావికాదళంలో సేవలందిస్తుండగా ఇది ఐదోవది కానుంది.

1973 నుంచి 2001 వరకు 3 దశాబ్దాలు నావికాదళంలో ఎన్నో ఆపరేషన్‌లు నిర్వహించిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాగీర్‌ పేరునే దీనికి పెట్టినట్లు దల్జీందర్‌ సింగ్‌ తెలిపారు. 2020 నవంబర్‌ 12న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భారత్‌లో తయారైన జలాంతర్గాములలో ఇదే అత్యంత తక్కువ కాలంలో నిర్మించారు. గతేడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్‌ వరకు అనేక కఠినమైన పరీక్షల్లో వాగీర్ జలాంతర్గామి విజయం సాధించినట్లు నేవీ తెలిపింది. జలాంతర్గాముల నిర్మాణంలో భారత్‌ సత్తాను ఇది రుజువు చేయగలదని ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details