తెలంగాణ

telangana

జమ్ముకశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: అమిత్​ షా

By

Published : Nov 17, 2020, 4:18 PM IST

జమ్ముకశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఎలాంటి కూటమిని ప్రజలు ఎన్నిటికి సహించబోరన్నారు. కూటమితో కలిసి అక్కడ మళ్లీ ఉగ్రవాదం, అల్లర్ల నాటి పరిస్థితులను తీసుకురావాలని కాంగ్రెస్​ యత్నిస్తోందని ఆరోపించారు.

HM Shah terms J K alliance as Gupkar Gang asserts J K will remain integral part of India
జమ్ముకశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో భాగమే: అమిత్​ షా

జమ్ముకశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల కూటమి పీపుల్స్‌ అలయన్స్‌ జారీచేసిన గుప్‌కార్‌ డిక్లరేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు అంశంలో విదేశీ శక్తుల జోక్యం కోసం గుప్‌కార్‌ గ్యాంగ్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై కూడా ధ్వజమెత్తారు. గుప్‌కార్‌ గ్యాంగ్‌పై పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అమిత్ షా వరుస ట్వీట్లలో ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

"గుప్‌కార్‌ గ్యాంగ్‌ ప్రపంచంవైపు సాగుతోంది. జమ్ముకశ్మీర్‌ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవాలని అనుకుంటోంది. అంతేగాక, భారత త్రివర్ణ పతాకాన్ని కూడా ఈ గ్యాంగ్‌ అవమానించింది. ఇలాంటి చర్యలకు సోనియా జీ, రాహుల్‌ గాంధీ మద్దతిస్తారా? ఈ విషయంలో కాంగ్రెస్‌ వైఖరి ఏంటో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. కాంగ్రెస్‌, గుప్‌కార్‌ గ్యాంగ్‌ కలిసి జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదం, అల్లర్ల నాటి పరిస్థితులను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు చేసి దళితులు, మహిళలు, గిరిజనలకు తాము కల్పించిన హక్కులను కాలరాయాలని ఈ గ్యాంగ్ అనుకుంటోంది. ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్నందువల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారు."

--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.

2019లో గుప్‌కార్‌ డిక్లరేషన్‌కు మద్దతిస్తూ కాంగ్రెస్‌ సంతకం చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ షా పై విధంగా విమర్శలు చేశారు. జమ్ముకశ్మీర్‌ ఇప్పటికీ, ఎప్పటికీ సమగ్ర భారతదేశంలోని భాగమేనని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఇలాంటి అపవిత్ర 'ప్రపంచ గట్‌బంధన్‌(కూటమిని ఉద్దేశిస్తూ)'ను ప్రజలు ఎన్నటికీ సహించబోరన్నారు అమిత్ షా. ప్రజల మనోభావాలకు అనుగుణంగా గుప్‌కార్‌ గ్యాంగ్‌ చర్యలు ఉండాలని లేదంటే ప్రజలు వారిని ముంచేస్తారని హెచ్చరించారు.

గుప్‌కార్‌ డిక్లరేషన్‌ అంటే..

గత ఏడాది ఆగస్టు 4న జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేయటానికి ఒకరోజు ముందు భాజపా మినహా మిగిలిన రాజకీయ పక్షాలు శ్రీనగర్‌లోని గుప్‌కార్‌ రోడ్డులో ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా గృహంలో సమావేశమయ్యాయి. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని సమర్థిస్తూ ఓ సంయుక్త ప్రకటనను జారీ చేశాయి. దీనినే గుప్‌కార్‌ డిక్లరేషన్‌గా వ్యవహరిస్తున్నారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలని ఈ కూటమి డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రత్యేక హోదా పునరుద్ధరించేందుకు చైనా సాయం కోరతామని ప్రకటించగా.. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తాను జాతీయ పతాకాన్ని ఎగరవేయనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

ఇదీ చూడండి:మా భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది: గహ్లోత్‌

ABOUT THE AUTHOR

...view details