ETV Bharat / bharat

మా భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది: గహ్లోత్‌

author img

By

Published : Nov 17, 2020, 8:15 AM IST

సొంత పార్టీపై కాంగ్రెస్​ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన విమర్శలను తప్పుబట్టారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. పార్టీ అంతర్గత వ్యవహారాలను కపిల్​ సిబల్ మీడియా ముందు ప్రస్తావించాల్సింది కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందులానే.. పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Ashok Gehlot response to kapil sibal on Congress
కపిల్ సిబల్ విమర్శలకు గహ్లోత్ స్పందన

కాంగ్రెస్‌ పార్టీపై సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తలను మనోవేదనకు గురిచేశాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. 'పార్టీ అంతర్గత వ్యవహారాల్ని కపిల్‌ సిబల్‌ మీడియా వద్ద ప్రస్తావించాల్సింది కాదు. అవి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తాయి. గతంలోనూ పార్టీ పలు సమయాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంది. కానీ మా భావజాలం, కార్యక్రమాలు, పటిష్టమైన నాయకత్వం ఉండటంతో సంక్షోభ సమయాలనుంచి గట్టెక్కాం. ప్రతిసారీ మేం నిలదొక్కుకోగలిగాం. ఆ తర్వాత 2004లో సోనియా నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా మేం సంక్షోభ పరిస్థితులను అధిగమిస్తాం' అని గహ్లాత్ విశ్వాసం వ్యక్తంచేశారు. అదేవిధంగా సిబల్‌ వ్యాఖ్యలకు బదులిస్తూ.. 'ఎన్నికల్లో ఓటమికి వివిధ రకాల కారణాలుంటాయి. అనేకసార్లు సంక్షోభాలు ఏర్పడినప్పటికీ దృఢమైన నాయకత్వం, ఐక్యతతో బయటపడ్డాం. ఈ రోజు వరకు కూడా దేశ సమగ్రతను కాపాడి, అభివృద్ధి పథంలో తీసుకువెళ్లగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్సే' అని గహ్లోత్‌ అన్నారు.

కపిల్ ‌సిబల్‌ విమర్శలు ఇలా..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుల్లో ఒకరైన కపిల్ ‌సిబల్‌ బిహార్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని ఉద్దేశిస్తూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమవారం పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఇక కాంగ్రెస్‌ను ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి ఎత్తిచూపారు. పార్టీలో వెంటనే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోని కాంగ్రెస్‌ ఇకముందు ఎలా చేసుకుంటుందని ఘాటు విమర్శలు చేశారు.

ఇదీ చూడండి:సొంత పార్టీపైనే కపిల్​ సిబల్ సంచలన వ్యాఖ్యలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.