తెలంగాణ

telangana

G20 Dinner Invite : జీ 20 అతిథులకు రాష్ట్రపతి విందు.. ఖర్గేకు అందని అహ్వానం.. దేవెగౌడ దూరం

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 12:32 PM IST

Updated : Sep 8, 2023, 12:50 PM IST

G20 Dinner Invite : జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత్​కు విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. జీ-20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు నేతలకు ఆహ్వానం అందినా.. మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఎలాంటి పిలుపు రాలేదు. మరోవైపు దేవెగౌడ​కు ఆహ్వానం అందిన ఆయన రావట్లేదని చెప్పారు.

g20-dinner-invite-2023-mallikarjun-kharge-not-invited-to-g20-gala-dinner
g20-dinner-invite-2023-mallikarjun-kharge-not-invited-to-g20-gala-dinner

G20 Dinner Invite :జీ-20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. శనివారం ఏర్పాటు చేసిన విందుకు విదేశీ అతిథులు, పార్లమెంటేరియన్లు, కేబినెట్‌లోని మంత్రులతోపాటు పలువురు మాజీ ప్రధానులు హాజరుకానున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్‌ సింగ్‌కు ఆహ్వానాలు పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం ప్రకటించింది.

విందుకు దేవెగౌడ దూరం..
రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరుకాట్లేదని తెలిపారు మాజీ ప్రధాని, జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడ. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జీ20 సదస్సు విజయవంతం కావాలని ఆశిస్తూ.. 'ఎక్స్'లో ఆయన ఓ పోస్ట్​ చేశారు. మరోవైపు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రపతి విందుకు హాజరుకానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం బంగాల్​ నుంచి ఆమె దిల్లీకి బయలుదేరి వెళతారని పేర్కొన్నాయి. విందుతో పాటుగా దిల్లీలో వివిధ పార్టీ నేతలతో మమతా భేటీ అవుతారని సమాచారం. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతీశ్‌ కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, అరవింద్ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్.. తాము ఈ విందుకు హాజరవుతున్నట్లు తెలిపారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు కార్యక్రమం జరగనుంది. దీంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు సైతం జరగనున్నాయి.

ముస్తాబైన దిల్లీ..
ఈనెల 9, 10 తేదీల్లో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్‌బర్టో ఫెర్నాండెజ్‌ ఈ ఉదయం దిల్లీ చేరుకున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సును తొలిసారి నిర్వహిస్తున్న భారత్‌.. దేశ సంప్రదాయం, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు విస్తృతమైనట్లు ఏర్పాటు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా తదితరులు జీ-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌, షి జిన్‌పింగ్‌ స్థానంలో వారి ప్రతినిధులు పాల్గొననున్నారు.

G20 Bilateral Meetings : మూడు రోజులు బిజీబిజీగా మోదీ.. 15కి పైగా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు.. షెడ్యూల్​ ఇదే!

G20 Summit 2023 Agenda India : జీ20కి సర్వం సిద్ధం.. కీలక అంశాలపై దేశాధినేతల చర్చలు.. అజెండా ఇదే..

Last Updated : Sep 8, 2023, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details