తెలంగాణ

telangana

Chandrababu Comments: పటాన్​చెరులో ఎకరం రూ.30 కోట్లు.. ఏపీలో భూములకు ధరేది..?

By

Published : Jun 29, 2023, 9:07 PM IST

Chandrababu Fires on Jagan: వైసీపీ పాలనలో శ్రీకాళహస్తిలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరారు. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు విమర్శించారు. నాలుగేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని ధ్వజమెత్తారు.

Chandrababu Fires on Jagan
చంద్రబాబు కామెంట్స్

Chandrababu Fires on Jagan: వచ్చే ఎన్నికల్లో జగన్​ను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం గెలిచినట్టని.. ఈ నాలుగేళ్లల్లో రాష్ట్రానికి నరకం అంటే ఏంటో చూపించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీలోని చిన్న చేపలను ఆ పార్టీలోని పెద్ద చేపలే మింగేస్తున్నాయని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు పార్టీలో చేరారు. ఆయనను చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Chandrababu Comments: 'రాబోయే ఎన్నికల్లో పులివెందులతో సహా.. 175 సీట్లు గెలవాలి'

ఈ కార్యక్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలను దోచేస్తూ.. వారిని నాశనం చేస్తూ పేదల పక్షం అని చెప్పుకోవడం జగన్​కే చెల్లిందని చంద్రబాబు మండిపడ్డారు. కళ్లు మూయకుండా అబద్దాలు ఆడడం జగన్​కే సాధ్యమని ఎద్దేవా చేశారు. ఏపీలో తెలుగుదేశం ఓడిపోయాక భూముల విలువలు పడిపోయాయన్నారు.

తెలంగాణ పఠాన్​చెరులో ఎకరం రూ.30 కోట్లు ఉందని.. ఏపీలో ఇలాంటి ధరలు ఎక్కడున్నాయన్నారు. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే జరిగే నష్టం ఏంటో 22ఏ భూముల్లో జరుగుతోన్న దోపిడీ చూస్తే అర్థమవుతోందని ధ్వజమెత్తారు. దేశంలోనే ధనికుడైన పెత్తందారు జగన్.. తాను పేదోడిని అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు కర్రు కాల్చి వాతలు పెట్టి.. మీ బిడ్డను తనకు ఓట్లేయండి అంటున్నాడని విమర్శించారు.

ధైర్యంగా రాజకీయం చేస్తాననే జగన్.. పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని ఆక్షేపించారు. వైసీపీకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సైకోలకు తాను భయపడనని.. అందరి సంగతి తేలుస్తానని అన్నారు. తనకు ఈ సైకోలు ఓ లెక్కకాదని చెప్పారు. లులూను విశాఖ నుంచి తరిమేశారని.. అమరరాజా సంస్థను ఇబ్బందులు పెట్టినా.. చిత్తూరు జిల్లా వాళ్లెవ్వరూ స్పందించ లేదని విమర్శించారు.

అమరరాజా సంస్థను తామే పంపించేశామని సజ్జల చెప్పారని గుర్తు చేశారు. అసలు అలా ఎలా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ అంటే ఏంటో జగన్​కు తెలియదనటం విడ్డూరమన్నారు. మహిళలపై కూడా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎగిరిగెరి పడుతున్నాడని.. అక్కడ ఇప్పుడున్న దారుణ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని దుయ్యబట్టారు.

ఎన్ఆర్ఐల భూములను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు పని చేయడం లేదని.. వారిని కాపాడేలా పని చేస్తున్నారని విమర్శించారు. చాలా మంది పోలీసుల్లో ప్రస్తుతం మార్పు వచ్చిందన్న చంద్రబాబు.. ఇంకా కొందరు పోలీసులు మారాలన్నారు.

"ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు.. ప్రపంచమంతా రాణిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్​లో అయితే ఎవరికీ కంటి నిండా నిద్ర కూడా పట్టడం లేదు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. టీడీపీకి సపోర్ట్ చేసినందుకు.. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అస్సలు వీళ్లు మనుషులా.. రాక్షసులా.. వింత జంతువులా.. నాకు అయితే అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు. రాబోయే ఎన్నికల్లో పులివెందులతో సహా.. 175 సీట్లు గెలవాలి. - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

ABOUT THE AUTHOR

...view details