తెలంగాణ

telangana

ED Inquiry in TSPSC Paper Leak: మొత్తం ఎంత డబ్బు చేతులు మారింది..?

By

Published : Apr 18, 2023, 9:00 AM IST

ED Inquiry in TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. దర్యాప్తులో వేగం పెంచింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను చంచల్‌గూడ జైల్లో తొలి రోజు విచారించిన అధికారులు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాలను ఎంత మొత్తానికి అమ్ముకున్నారు, ఇప్పటి వరకు ఎంత డబ్బు ముట్టింది, వచ్చిన డబ్బును ఏం చేశారంటూ ప్రశ్నించినట్లు సమాచారం.

ED Inquiry in Paper Leakage
ED Inquiry in Paper Leakage

ED Inquiry in TSPSC Paper Leak Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న అనుమానంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించేందుకు నాంపల్లి కోర్టు నుంచి రెండు రోజుల అనుమతి తీసుకున్న ఈడీ అధికారులు... తొలిరోజు చంచల్‌గూడ జైల్లో విచారణ జరిపారు. దాదాపు ఐదు గంటల పాటు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. ఎక్కువగా నిధుల మళ్లింపునకు సంబంధించిన వివరాలే అడిగినట్లు సమాచారం. నేడు మరోమారు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించనున్న అధికారులు.. నిధుల మళ్లింపునకు సంబంధించి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.

TSPSC Paper Leakage Case updates: ఇదిలా ఉండగా.. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు చేతులు మారి ఉంటాయని ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. ఈ క్రమంలోనే లాగే కొద్దీ డొంక కదులుతోంది. రోజురోజుకూ కొత్త కొత్త నిందితులు తెరపైకి వస్తున్నారు. డీఏవో ప్రశ్నపత్రాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ దంపతులు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని కొనుగోలు చేసినట్లు కేసు నమోదైన నెల రోజుల తర్వాత ఇటీవల బయటపడింది. పరీక్షకు ముందు రూ.6 లక్షలు చెల్లించిన ఆ దంపతులు.. ఎగ్జామ్‌ రాసిన తర్వాత మిగిలిన రూ.4 లక్షలు చెల్లించేలా ప్రవీణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అన్నీ ప్లాన్‌ ప్రకారమే జరగగా.. పేపర్ల లీకేజీ ఉదంతం వెలుగులోకి రావడంతో కథంతా అడ్డం తిరిగి చివరకు దొరికిపోయారు. అయితే ఇలాంటి ఉదంతాలు ఇంకా జరిగి ఉంటాయని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు సైతం ప్రధానంగా ఇలాంటి లావాదేవీలపైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌లను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

ప్రశ్నపత్రాలను ఎంతకు అమ్ముకున్నారు..: ఈ కేసులో ఇప్పటికే కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇంఛార్జి శంకరలక్ష్మి, అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి సత్యనారాయణలను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించిన ఈడీ అధికారులు.. వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇక ప్రవీణ్‌, రాజశేఖర్‌లను చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తున్నారు. రెండు రోజుల పాటు వీరి విచారణకు న్యాయస్థానం అనుమతి ఇవ్వగా.. తొలిరోజు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు సుమీత్‌ గోయల్‌, దేవేందర్‌ కుమార్‌ సింగ్‌లు వారిద్దరిని విచారించారు. మొత్తం లీకేజీ వ్యవహారంలో ఎంత సొమ్ము చేతులు మారిందనే అంశంపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రశ్న పత్రాలను ఎంత మొత్తానికి అమ్ముకున్నారు, ఇప్పటి వరకు ఎంత డబ్బు ముట్టింది, వచ్చిన డబ్బును ఏం చేశారంటూ ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించినట్లు సమాచారం. నిందితులిద్దరినీ కాసేపు విడివిడిగా.. తర్వాత కలిపి విచారించినట్లు సమాచారం. నేడు మరోమారు ప్రశ్నించనున్నారు.

అయితే.. పేపర్‌ లీకేజీకి సంబంధించి కొన్ని ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌లు స్వయంగా అమ్ముకోగా.. మరికొన్నింటిని నిందితుల వద్ద కొనుగోలు చేసిన వారు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇలా డబ్బులు పలువురి చేతులు మారాయి. కొంత మొత్తం నగదు రూపంలో ముట్టగా.. మరికొంత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమైంది. దీనిపైనే ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది.

ఇవీ చూడండి..

తండ్రిలా పోలీసు కావాలనే.. TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్

TSPSC పేపర్ లీకేజీ.. కారు అమ్మేసి.. ఆ ప్రశ్నపత్రం కొన్న దంపతులు

ABOUT THE AUTHOR

...view details