తెలంగాణ

telangana

దిల్లీ ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యత, ప్రభుత్వం యాక్షన్ ప్లాన్, పిల్లలు-వృద్ధుల ఆరోగ్యంపై నిపుణుల ఆందోళన

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 11:13 AM IST

Delhi Air Pollution Level Today : దిల్లీలో రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయపు నడక వంటి కార్యకాలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ గాలి కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ, కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాలి కాలుష్యాన్ని నియంత్రిండడానికి ఎన్​సీఆర్​ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రేడెడ్​ యాక్షన్​ ప్లాన్​ను అమలు చేస్తోంది.

Delhi Air Pollution Level Today
Delhi Air Pollution Level Today

Delhi Air Pollution Level Today :దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. గత రాత్రి గాలి వేగం వల్ల వాయు కాలుష్య స్థాయిలు స్వల్పంగా తగ్గినప్పటికీ విషపూరితమైన PM2.5 సాంద్రత (గాలిలో 2.5 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉండే సూక్ష్మ కణాల సాంద్రత).. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి​ కంటే 80 రెట్లు ఎక్కువగా ఉంది.

వాయుకాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ, కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వరుసగా ఐదో రోజు శనివారం కూడా దట్టమైన విషపూరితమైన పొగమంచు వ్యాపించింది. గాల్లో ఉండే PM2.5 సాంద్రత గల సూక్ష్మ రేణువులు శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయని వైద్యులు తెలిపారు. అలాంటి PM2.5 సాంద్రత.. దిల్లీ-ఎన్​సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితి క్యూబిక్​ మీటర్​కు 60 మైక్రోగ్రాముల కంటే 7-8 రెట్లు ఎక్కువగా నమోదైంది.

దిల్లీలో గురువారం, శుక్రవారం తీవ్ర స్థాయి వాయు కాలుష్యానికి.. పంట వ్యర్థాలు తగలబెట్టడం ద్వారా వచ్చిన పొగనే 35 శాతం కారణం అని పుణెకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అభివృద్ధి చేసిన న్యూమరికల్ మోడల్ ఆధారిత వ్యవస్థ ద్వారా తెలుస్తోంది. ఇక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్- సీపీసీబీ గణాంకాల ప్రకారం, దిల్లీ వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 మధ్య 200 పాయింట్లకు పైగా పెరిగింది. ఇది శుక్రవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీకి (450 పైన) దిగజారింది.

కాలుష్యం తగ్గడానికి.. యాక్షన్​ ప్లాన్..
అనవసరమైన నిర్మాణ పనులతో సహా కొన్ని కాలుష్య కార్యకలాపాలపై దిల్లీ- ఎన్​సీఆర్​ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందించే కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ) అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నియంత్రణల కారణంగా.. కాలుష్య స్థాయి మరింత తగ్గుముఖం పడుతుందని వారు భావిస్తున్నారు. అయితే కఠినమైన నియంత్రణలు కాకుండా.. గ్రేడెట్​ రెస్పాన్స్​ యాక్షన్​ ప్లాన్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

ఉదయపు నడక బంద్​
ప్రమాదకర వాయు కాలుష్యం కారణంగా దిల్లీ- ఎన్​సీఆర్​లోని ప్రజలు ఉదయపు నడక, క్రీడలు తదితర బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. మరోవైపు పిల్లలు వేగంగా ఊపిరి పీల్చుకుంటారని, కాలుష్య కారకాలను ఎక్కువగా తీసుకుంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పంజాబ్​లో మా​ ప్రభుత్వం చాలా చేసింది : ఆప్​
మరోవైపు, దిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాలు తగలబెట్టడం కారణమని చెబుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏడాది కాలంలో పంజాబ్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు.

"పంజాబ్ సర్కారు తీసుకున్న చర్యల వల్ల ఆ రాష్ట్రంలో పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా వచ్చే కాలుష్యంలో 50 నుంచి 67 శాతం తగ్గుముఖం పట్టింది. దిల్లీ ముఖ్యమంత్రి, మన పర్యావరణ శాఖ మంత్రి నిరంతరం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. దిల్లీ ప్రజలు, ప్రభుత్వం కృషి వల్ల మనకు 200 మంచి గాలి ఉండే రోజులు లభించాయి. నేను చదివిన ఓ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని అత్యంత కాలుష్యం ఉన్న 52 జిల్లాల్లో 22 హరియాణాకు చెందినవే. పంజాబ్‌లో 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. హరియాణాలో (కాలుష్య నియంత్రణపై) పర్యవేక్షణ కూడా జరగకపోతే, వారు సమస్యను ఎలా పరిష్కారిస్తారు? వారు సమస్యల నుంచి పారిపోతారు" అని ఆప్‌ నేత ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు.

దిల్లీ వాయు సంక్షోభానికి! కారణావిలివే..
Delhi Air Pollution Reasons :ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడం, గాలి వేగం నెమ్మదించడం, పంజాబ్​, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో గత వారంలో రోజులుగా దిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణిస్తోంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, పంట వ్యర్థాలు కాల్చడం, బాణసంచా వంటి తదితర కారణాల వల్ల ఏటా దిల్లీ-ఎన్​సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. అంతేకాకుండా దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ- విశ్లేషణ ప్రకారం.. పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను కాల్చినప్పుడు.. నవంబర్ 1 నుంచి 15 మధ్య రాజధానిలో వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.

రాజధాని నగరాల్లోకెల్లా దిల్లీ అత్యంత దారుణం!
ప్రపంచ రాజధానుల్లోకెల్లా దిల్లీలో గాలి నాణ్యత అధ్వానంగా ఉంది. ఈ వాయు కాలుష్యం కారణంగా మనిషి సగటు ఆయుష్షు 12 ఏళ్ల వరకు తగ్గుతోందని చికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్​స్టిట్యూట్ ఆగస్టులో ఓ నివేదికలో పేర్కొంది.

Delhi Air Pollution Today : దిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు

దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత, స్కూళ్లు బంద్- '9ఏళ్లలో కేజ్రీవాల్ చేసిందిదే'

ABOUT THE AUTHOR

...view details