తెలంగాణ

telangana

Deepfake Voice Cloning : 'డీప్​ ఫేక్'​ మోసం.. స్నేహితుడిలా మాట్లాడి రూ.30వేలకు టోకరా

By

Published : Aug 18, 2023, 11:23 AM IST

Deepfake Voice Cloning Fraud In Faridabad : తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని ఓ వ్యక్తికి ఫోన్​ కాల్​ వచ్చింది. అది నిజమేనని నమ్మిన వ్యక్తి వేల రూపాయలు అతడు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. చివరకు అది తన స్నేహితుడి ఒరిజినల్​ వాయిస్​ కాదని.. ఏఐ, డీప్​ ఫేక్​ సాంకేతికతల సహాయంతో సైబరాసురులు మోసం చేశారని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత ఏం జరిగిందంటే?

Deepfake Voice Cloning Fraud In Faridabad
Deepfake Voice Cloning Fraud In Faridabad

Deepfake Voice Cloning Fraud In Faridabad :టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దాంతోపాటు సైబర్​ నేరాలూ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వచ్చిన ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​- ఏఐతో అలాంటి నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. సులభంగా అమాయకులకు సైబరాసురులు గాలం వేస్తున్నారు. 'డీప్ ​ఫేక్' సాంకేతికతో ఇతరుల ముఖం, వాయిస్​లను.. ప్రతిసృష్టి చేసి సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే హరియాణాలోని ఫరీదాబాద్​లో వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..
ఫరీదాబాద్​లోని పంచశీల కాలనీలో కరణ్​ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఓ ఫోన్​ కాల్​ వచ్చింది. అందులో కరణ్​ స్నేహితుడి వాయిస్​ వినిపించింది. 'నేను వాకింగ్​కు వెళ్లాను. ఇక్కడ నాకు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాను. నా ఫోన్​ కూడా పగిలిపోయింది. పక్కవాళ్ల ఫోన్​ అడిగి నీకు కాల్ చేస్తున్నాను. డబ్బులు పంపించు' అని కరణ్ స్నేహితుడు అడిగాడు. దీంతో అది తన స్నేహితుడే అని నమ్మిన కరణ్..​ ఫోన్​లో చెప్పిన అకౌంట్​కు రూ.30 వేలు పంపించాడు. అనంతరం తన స్నేహితుడికి కాల్​ చేసి క్షేమ సమాచారాలు అడిగాడు. అయితే, తాను క్షేమంగానే ఉన్నానని, ప్రమాదమేమీ జరగలేదని కరణ్​ స్నేహితుడు బదులిచ్చాడు. దీంతో కంగుతిన్న కరణ్ తనకు​ జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ఎన్​ఐటీ సైబర్​ పోలీస్​ స్టేషల్​లో కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై సైబర్​ నిపుణుడు, సెంట్రల్ సైబర్ స్టేషన్ ఇన్​ఛార్జ్​ సురేంద్ర సింగ్ స్పందించారు. ఈ ఘటనలు ఎలా జరుగుతాయో వివరించారు. 'ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్, డీప్​ ఫేక్​ సాంకేతికతలతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇందులో ఒక యూజర్​ను మోసం చేయాలంటే వారి వాయిస్​ శాంపిల్ అవసరం. దీని ఆధారంగా వాయిస్​ను క్లోన్ చేసి మోసం చేస్తారు. వాయిస్‌ను క్లోన్ చేయడానికి, సైబర్ నేరగాళ్లు ముందుగా ఆ వ్యక్తి సమాచారాన్ని ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా సేకరిస్తారు. ఆ వ్యక్తి పేరు, ఫోన్ నంబర్‌ను సేకరిస్తారు. అనంతరం కస్టమర్ కేర్ లేదా ఇతర సర్వీస్ ప్రొవైడర్‌ రూపంలో టార్గెట్​కు కాల్​ చేస్తారు. ఈ సమయంలో నేరస్థులు వారి వాయిస్‌ను రికార్డ్ చేస్తారు' అని సురేంద్ర సింగ్​ తెలిపారు.

'సోషల్ మీడియా సైట్‌లలో యూజర్లు అప్‌లోడ్ చేసిన వీడియోల నుంచి కూడా నేరగాళ్లు వాయిస్‌ శాంపిళ్లను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఈ వాయిస్‌ను ఏఐ టూల్స్​ ద్వారా క్లోన్ చేస్తారు. ఆ క్లోన్ వాయిస్​ ద్వారా ప్రజలు అది తమ స్నేహితుడు లేదా బంధువు అని సులభంగా నమ్ముతారు. అందుకే ఆలోచించకుండా వారు ఇచ్చిన నంబర్‌కు డబ్బును బదిలీ చేస్తారు. ఆ తర్వాత తాము మోసపోయామని తెలుసుకుంటారు' అని సైబర్​ నిపుణుడు సురేంద్ర సింగ్ వివరించారు.

అప్రమత్తతే ఏకైక మార్గం..
'ఇలాంటి మోసాలను నివారించడానికి ఏకైక మార్గం.. మీ స్నేహితులు లేదా బంధువులు డబ్బు సహాయం చేయమన్నప్పుడు లేదా వారు అత్యవసర పరిస్థితిలో ఉన్నామని చెప్పినప్పుడు తొందరపడవద్దు. వెంటనే అతడి వ్యక్తిగత నంబర్ లేదా కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి మాట్లాడండి. ఆ తర్వాత నిజనిజాలు నిర్ధరించుకుని.. డబ్బులు పంపించండి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త అవగాహనతో వ్యవహరిస్తే సైబర్​ దుండగుల నుంచి తప్పించుకోవచ్చు' అని నిపుణులు చెబుతున్నారు.

క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి.. నెత్తిన కుచ్చుటోపీ పెట్టి..!

మీ షోలో కారు బహుమతి వచ్చిందంటూ.. 15 లక్షలు టోకరా..!

ABOUT THE AUTHOR

...view details