తెలంగాణ

telangana

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ సమావేశాలు.. మీటింగ్​కు సోనియా, రాహుల్ దూరం

By

Published : Feb 24, 2023, 11:43 AM IST

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కాంగ్రెస్​ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ప్లీనరీలో పార్టీ వర్కింగ్​ కమిటీ, రాజకీయ, ఆర్థిక పరిస్థితి విధానాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Congress plenary session
Congress plenary session

కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. మల్లిఖార్జున ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం గంటలకు AICC స్టీరింగ్​ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు హాజరుకాలేదు.

ఈ సమావేశంలో 6 ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి. దీంతో పాటుగా పలు తీర్మానాలు రూపొందించనున్నారు. 2024 లోక్​సభ ఎన్నికలకు స్పష్టమైన రోడ్​మ్యాప్​ను రూపొందించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ ఫిబ్రవరి 26న జరిగే చివరి రోజున ఆమోదం పొందనున్నాయి. అనంతరం 26తేదీ సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్లీనరీ సమావేశాలను ముగించనున్నారు.

ప్లీనరీ ఎజెండాను నిర్ణయించేందుకు స్టీరింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే చాలా మంది పార్టీ నాయకులు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేరని.. దీనికి బదులుగా సీడబ్యూసీ సభ్యులను నామినేట్ చేసే హక్కును పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మాత్రం ఎన్నికలు జరగాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు జరగకపోతే.. 25 మంది కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 23 మందిని కాంగ్రెస్​ అధ్యక్షుడు నామినేట్​ చేస్తారు. అయితే, సీడబ్యూసీకి ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పార్టీ సిద్ధంగా ఉందని సీనీయర్ నేత జైరాం రమేశ్​ తెలిపారు.

రాజకీయ, ఆర్ధిక, అంతర్జాతీయ వ్యవహారాలు, రైతులు-వ్యవసాయం, సామాజిక న్యాయం-సాధికారత, యువత-విద్య-నిరుద్యోగం వంటి పలు అంశాలపై ఈ ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నారు. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా విధాన నిర్ణయం, వ్యూహాలను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. దీంతో పాటుగా భాజపా విధానాలపై ప్లీనరీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details