తెలంగాణ

telangana

6 నెలల్లో 34 కేజీల బరువు తగ్గిన సిద్ధూ.. జైలులో ఏం చేశారో తెలుసా?

By

Published : Nov 29, 2022, 6:39 AM IST

Updated : Nov 29, 2022, 6:57 AM IST

34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఓ ప్రణాళిక ప్రకారం తన బరువు తగ్గించుకున్నారట. కేవలం ఆరు నెలల్లో 34 కేజీలు బరువు తగ్గినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అది ఎలా సాధ్యమైందంటే..?

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
Navjot Singh Sidhu

జైలు శిక్ష అనుభవిస్తున్నవారు బరువు తగ్గడం సహజమే. కానీ, చాలా సందర్భాల్లో అక్కడి భోజనం నచ్చక బరువు తగ్గుతుంటారు. కానీ, 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఓ ప్రణాళిక ప్రకారం తన బరువు తగ్గించుకున్నారట. కేవలం ఆరు నెలల్లో 34 కేజీలు బరువు తగ్గినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పటియాలా కేంద్రకారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన్ని కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, మాజీ ఎమ్మెల్యే నవతేజ్‌ సింగ్‌ చీమా.. సిద్దూ ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

6.2 అడుగుల ఎత్తున్న సిద్దూ ఆయన ప్రస్తుతం 99 కిలోల బరువు ఉన్నట్లు నవతేజ్‌ చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో క్రికెటర్‌గా ఉన్నప్పుడు సిద్దూ ఎలా కనిపించేవారో.. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారని అన్నారు. ఇంతకీ ఆయన బరువు తగ్గడానికి కారణమేంటో తెలుసా? రోజులో ఆయన కనీసం నాలుగు గంటల పాటు ధ్యానం, మరో రెండు గంటలు యోగా, వ్యాయామాలు చేస్తున్నారట. దాదాపు రెండు నుంచి నాలుగు గంటల పాటు వివిధ పుస్తకాలు చదివి, కేవలం నాలుగు గంటలపాటే నిద్రపోతున్నారని నవతేజ్‌ చెప్పారు.

.

"ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకొని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బయటకి వచ్చే సరికి అందరూ ఆశ్చర్యపోవడం పక్కా. క్రికెటర్‌గా ఉన్నప్పుడు ఆయన ఎంత దృఢంగా, అందంగా ఉండేవారో అలాగే కనిపిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన 34 కిలోల బరువు తగ్గారు. ఇంకా తగ్గే అవకాశం ఉంది" అని నవతేజ్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. ఆయన్ను చూసిన తర్వాత చాలా సంతోషం కలిగిందన్నారు.

మరోవైపు, సిద్ధూ నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీనినుంచి బయటపడేందుకు ప్రత్యేక ఆహారపు అలవాట్లను పాటించాలని వైద్యులు గతంలో సూచించారు. ఈ మేరకు ఆయన ఆహార నియమాలు పాటిస్తున్నట్లు నవతేజ్‌ చెప్పారు. కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తున్నారని, కొబ్బరి నీళ్లు, బాదం పాలు ఆహారంగా తీసుకుంటున్నారని అన్నారు. జైలు నిబంధనల ప్రకారం రోజులో కొన్ని గంటల పాటు క్లర్క్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. 1988లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని మే నెలలో తీర్పు వెలువరించింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్‌ విషయంపై 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గుర్నామ్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన కేసులో ప్రస్తుతం సిద్దూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Last Updated : Nov 29, 2022, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details