తెలంగాణ

telangana

జలదిగ్బంధంలోనే చెన్నై- అనేక గంటలుగా పవర్​కట్​- ఆహారం లేక ప్రజలు విలవిల!

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 3:50 PM IST

Updated : Dec 6, 2023, 6:57 PM IST

Chennai Floods Update : మిగ్‌జాం తుపాను బీభత్సానికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. కుండపోత వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గినప్పటికీ ముంపు కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక సిబ్బంది పడవల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Chennai Floods Update
Chennai Floods Update

జలదిగ్బంధంలోనే చెన్నై- అనేక గంటలుగా పవర్​కట్​- ఆహారం లేక ప్రజలు విలవిల!

Chennai Floods Update :తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు పరిసర జిల్లాలపై మిగ్‌జాం తుపాను తీవ్ర ప్రభావం చూపింది. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల నివాసాలను వరద నీరు చుట్టుముట్టింది. విద్యుత్‌ సరఫరా లేక చెన్నైతోపాటు శివారు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

అవస్థలు పడుతున్న చిన్నారులు!
వెలచ్చేరి, తాంబరం, ఇతర ప్రాంతాల్లో రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల ప్రజలు బుధవారం ఉదయం కూడా నడుములోతు నీటిలోనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. చిన్నారులతో అవస్థలు పడుతున్న దృశ్యాలు చాలా చోట్ల కనిపించాయి. ఇళ్లలోనే చిక్కుకుపోయిన వారికి నిత్యావసరాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

ఐటీ కారిడార్​ పరిస్థితి మరింత దారుణం
నగరంలోని ఐటీ కారిడార్‌ పరిస్థితి దయనీయంగా మారింది. పెరుంగుడి, షోలింగనల్లూర్, తొరైపాక్కం ప్రాంతాలు నడుముల్లోతు నీళ్లల్లో నానుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుండగా రహదారులు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరపాలక సిబ్బంది మోటార్ల ద్వారా వరద నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇళ్లలో చిక్కుకున్న వారు ఆహారం, నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలు కూడా అందుబాటులో లేవని వాపోతున్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
నగరపాలక సంస్థ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవలపైనే ఆహార పదార్థాలను తరలించి ఇళ్లలో చిక్కుకున్నవారికి అందిస్తున్నారు. నగరంలో 400 పడవలను సహాయ చర్యలకు ఉపయోగిస్తున్నారు.

స్కూళ్లకు సెలవులు
చాలా ప్రాంతాల్లో వరద నీరు క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు. ఆయా చోట్ల మురుగును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. NDRF, SDRF సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు కూడా వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో రెండు రోజులు సెలవు ప్రకటించింది.

కేంద్రానికి స్టాలిన్​ లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు. తమిళనాడులో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి స్టాలిన్, తక్షణ సాయంగా రూ.5,060 కోట్లు విడుదల చేయాలని కోరారు.

సీఎంల ఎంపికపై బీజేపీ ఫోకస్​- కొత్తవారికే ఛాన్స్​! మోదీ ఇంట్లో నాలుగున్నర గంటల చర్చ

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం- 10 మంది ఎంపీలు రాజీనామా- ఎవరెవరంటే?

Last Updated :Dec 6, 2023, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details