తెలంగాణ

telangana

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై స్టేకు సుప్రీం నో- కేంద్రానికి నోటీసులు

By PTI

Published : Jan 12, 2024, 12:16 PM IST

Updated : Jan 12, 2024, 1:01 PM IST

CEC Appointment Supreme Court : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త చట్టంపై స్టే విధించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం- కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

supreme court judgement cec
supreme court judgement cec

CEC Appointment Supreme Court :ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వీటిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ నుంచి ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం అధికార విభజనకు వ్యతిరేకంగా ఉందని, వెంటనే దీనిపై స్టే విధించాలని ఆమె తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ వాదించారు. కేంద్రం స్పందన ఏంటో తెలియకుండా చట్టంపై స్టే విధించలేమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)లను నియమించే ప్యానెల్​ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ తీసుకొచ్చిన చట్టంపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ చట్టంపై జయా ఠాకూర్‌ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయవాది గోపాల్ సింగ్ కూడా సీఈసీ, ఈసీల నియామకాలపై కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం పారదర్శకమైన తటస్థ, స్వతంత్ర ఎంపిక కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం వాదనలు వినకుండా స్టే విధించలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

పాత చట్టం ప్రకారం సీఈసీ, ఈసీలను ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమించే వారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇక నుంచి ఈ బాధ్యతలను సెర్చ్‌, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. అయితే, కొత్త చట్టం ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఉందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

'రామమందిరంతో బీజేపీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్- కౌంటర్ వ్యూహాలపై 'ఇండియా' ఫోకస్​'

'రాముడి కోసం 11 రోజులు దీక్ష'- ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో మోదీ ఎమోషనల్

Last Updated : Jan 12, 2024, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details