ETV Bharat / bharat

'రామమందిరంతో బీజేపీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్- కౌంటర్ వ్యూహాలపై 'ఇండియా' ఫోకస్​'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 11:40 AM IST

India Alliance Ram Mandir
India Alliance Ram Mandir

India Alliance Ram Mandir : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అయోధ్య ప్రాణప్రతిష్ఠను బీజేపీ తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటోందని భావిస్తున్న ఇండియా కూటమి కౌంటర్ వ్యూహాలపై దృష్టిపెట్టింది. ఈ అంశంపై చర్చించనున్నట్లు కూటమిలోని పార్టీలు తెలిపాయి.

India Alliance Ram Mandir : అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఘనతను అధికార బీజేపీ తన ఖాతాలో వేసుకోవడాన్ని దీటుగా ఎదుర్కొవాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల ప్రతిపక్ష కూటమిలోని అన్ని పార్టీలు సమావేశమై ఈ అంశంపై బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలని చూస్తున్నాయి. అతి ముఖ్యమైన సీట్ల సర్దుబాటుపైనా చర్చలు జరుగుతున్నాయని కూటమిలోని ఝార్ఖండ్​ ముక్తి మోర్చా ఎంపీ మహూవా మాఝీ తెలిపారు. విపక్ష పార్టీలు అన్ని కలిసి అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాయని చెప్పారు.

"పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు​ జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలు అన్ని కలిసి బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలను రచించాలి. దేశంలో ప్రధాన సమస్యలైన ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా బీజేపీ మతాలతో ఆడుకుటోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంక్​ రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మా ఇండియా కూటమిలో వివిధ మతాలకు చెందిన నేతలు ఉన్నారు. కానీ మేమెప్పుడూ వాటితో రాజకీయాలు చేయలేదు. సీట్ల సర్దుబాటపై రాష్ట్ర నేతలే చర్చిస్తారు. అక్కడ ఏమైనా భేదాభ్రియాలు వస్తే కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది."
--మహూవా మాఝీ, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా ఎంపీ

సమాజ్​వాదీ పార్టీకి చెందిన మరో ఎంపీ సైతం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. రామమందిరాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ ఓట్లు సంపాదించుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. రామ మందిర నిర్మాణం పూర్తి కాకపోయినా, ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు హడావుడిగా ప్రాణప్రతిష్ఠ చేస్తుందని ఆరోపించారు.

'వారు నియమాలు పాటించడం లేదు'
సనతాన ధర్మంలోని విధానాలను పాటించనందున, దేశంలోని నలుగురు శంకరాచార్యులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఉత్తరాఖండ్​లోని జ్యోతిష్​పీఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తెలిపారు.

"మాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదు. కానీ హిందూమత పద్ధతులను పాటించాల్సిన, సూచనలు ఇచ్చే బాధ్యత మాపై ఉంది. రామ మందిరాన్ని నిర్మించిన వారు ప్రాణప్రతిష్ఠలో నియమాలను విస్మరిస్తున్నారు. అందుకే జనవరి 22న జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదు."
--అవిముక్తేశ్వరానంద్​ సరస్వతి, జ్యోతిశ్​పీఠ్​ శంకరాచార్య

మరోవైపు విపక్ష కూటమికి చెందిన అనేక మంది నేతలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాబోమని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్​, సీపీఐ(ఎం) తాము వెళ్లబోమని ప్రకటించాయి. తృణమూల్​ కాంగ్రెస్​ అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ, ప్రాణప్రతిష్ఠకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. జేఎంఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శివసేన ఉద్ధవ్​ వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే, ప్రాణప్రతిష్ఠకు హాజరు కాబోనని తేల్చి చెప్పారు. రాముడి ప్రాణప్రతిష్ఠను బీజేపీ తమ పార్టీ కార్యక్రమంలా మార్చిందని ఆరోపించారు. సమాజ్​వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్​ పార్టీలు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

'అయోధ్య' ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్- బీజేపీ రాజకీయ ప్రాజెక్ట్​ అంటూ విమర్శ

ఎన్నికల అస్త్రంగా 'రామ మందిరం'- బీజేపీ 15రోజుల ప్లాన్ రెడీ- RSSతో కలిసి కార్యక్రమాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.