తెలంగాణ

telangana

ఆర్యన్ ఖాన్ కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్.. సమీర్ వాంఖడే ఇంటిపై CBI దాడులు

By

Published : May 12, 2023, 9:48 PM IST

క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను తప్పించేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారన్న ఆరోపణలపై అప్పటి ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే సహా మరో నలుగురిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. ముంబయి సహా దేశవ్యాప్తంగా 29 చోట్ల శుక్రవారం దాడులు నిర్వహించింది.

aryan khan drug case cruise
aryan khan drug case cruise

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో బాలీవుడ్ బాద్​షా షారుక్​​ ఖాన్​ కుమారుడు ఆర్యన్ ఖాన్​ను తప్పించేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారన్న ఆరోపణలపై మాజీ ఎన్​సీబీ అధికారి సమీర్​ వాంఖడే సహా మరో నలుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం గోరెగావ్​లోని సమీర్ వాంఖడే నివాసంపై సీబీఐ అధికారులు.. శుక్రవారం సోదాలు నిర్వహించారు. ముంబయి, దిల్లీ, రాంచీ, కాన్పూర్​ సహా 29 ప్రాంతాల్లో సమీర్​, మరో నలుగురికి సంబంధించిన నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఆర్యన్ ఖాన్​ను డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు సమీర్ వాంఖడే, ఆయన సహచరులు రూ. 50 లక్షలు అడ్వాన్స్ తీసుకొన్నట్లు సమాచారం వచ్చిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ కేసు..
2021 అక్టోబర్‌ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్‌ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ ఘటనలో ఆర్యన్ ఖాన్​తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. 25 రోజుల తర్వాత బెయిల్​పై విడుదలయ్యారు. ఈ కేసులో కొన్నాళ్ల తర్వాత ఆర్యన్​కు క్లీన్ చిట్​ లభించింది. దీంతో అప్పటి ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే అనేక ఆరోపణలు కూడా వచ్చాయి.

డబ్బులు గుంజేందుకే ఆర్యన్‌ను కుట్రపూరితంగా డ్రగ్స్ కేసులో ఇరికించారంటూ ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్ ఆరోపించారు. అంతేగాక, వాంఖడే ముస్లిం అని, ఉద్యోగం పొందేందుకు ఎస్సీగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమంలోనే ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌గా వాంఖడే పదవీ కాలం ముగియడం వల్ల ఆయనను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కు బదిలీ చేశారు.

అనంతరం డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఎన్‌సీబీ సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అతడికి క్లీన్‌ చిట్‌ ఇస్తున్నట్లు ఎన్‌సీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశించడం గమనార్హం. కాగా.. వాంఖడే నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో అనేక అవకతవకలు జరిగినట్లు తాజాగా బయటికొచ్చింది. దీంతో ఆయన నివాసంపై సీబీఐ సోదాలు నిర్వహించింది.

ABOUT THE AUTHOR

...view details