తెలంగాణ

telangana

మానవత్వం నిలిపిన ప్రాణం.. పసిగుండెను కాపాడేందుకు తరలిన జనం!

By

Published : Apr 3, 2022, 7:44 AM IST

Bhopal People Save Infant: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పసికందుకు ఆక్సిజన్​ సిలిండర్లు అవసరమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు సామాజిక సంస్థల ప్రతినిధులు, సేవాతత్పరులు, రైల్వే, రెవెన్యూ అధికారులు.. ఇలా ఎందరో రైల్వే స్టేషన్​కు ఆక్సిజన్​ సిలిండర్లతో కదలివచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​ రైల్వే స్టేషన్​లో జరిగింది.

bhopal
పసిగుండెకు ప్రాణమిచ్చారు

Bhopal People Save Infant: ఓ నెల రోజుల పసికందు ప్రాణం నిలిపేందుకు 'మానవత్వం' రెక్కలు కట్టుకుని వాలిపోయిన ఘటన ఇది. సాటిమనిషి ఆపదల్లో ఉంటే నేనున్నానంటూ ఎందరో కదలివచ్చిన వైనం 'సామాజిక' బలాన్ని నిరూపించింది. గుండెకు హత్తుకునే ఓ అద్భుత సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ సంఘటనకు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని రైల్వేస్టేషన్‌ వేదికగా నిలిచింది. గుండె సంబంధిత తీవ్రసమస్యతో బాధపడుతున్న తమ 26 రోజుల బాబుకి దిల్లీలోని ఎయిమ్స్‌లో అత్యవసర వైద్యచికిత్స అందించేందుకు గాను ప్రవీణ్‌ సహారే, నిఖిత సహారే దంపతులు నాగ్‌పుర్‌ నుంచి బిలాస్‌పుర్‌-దిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో గురువారం రాత్రి బయల్దేరారు. కొంతదూరం వెళ్లేసరికి బాబుకి అందించే మెడికల్‌ ఆక్సిజన్‌కు కొరత వచ్చినట్లు గుర్తించారు. దీంతో చిన్నారి తండ్రి ప్రవీణ్‌ నాగ్‌పుర్‌లోని తన స్నేహితుడు ఖుశ్రు యోచా సాయం కోరారు. బాబుకి ఆక్సిజన్‌ అవసరమంటూ భోపాల్‌లోని కొన్ని సామాజిక సంస్థల సాయాన్ని కోరడం సహా విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్‌ చేశారు ఖుశ్రు. దీన్ని రైల్వే అధికారులకు ట్యాగ్‌ చేశారు.

భోపాల్‌కు చెందిన మాజీ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఉదయ్‌ని కూడా ఖుశ్రు సంప్రదించారు. ఆయన భోపాల్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ అందిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో విషయాన్ని తెలుసుకున్న మానవతావాదులు వెల్లువలా స్పందించారు. సామాజిక సంస్థల ప్రతినిధులు, సేవాతత్పరులు, రైల్వే, రెవెన్యూ అధికారులు.. ఇలా ఎంతోమంది శుక్రవారం వేకువజామున 2 గంటల సమయానికి ఆక్సిజన్‌ సిలిండర్లతో భోపాల్‌ రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే బాబుకి అవసరమైన 3 సిలిండర్లను మాత్రమే తీసుకున్న తల్లిదండ్రులు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే రైలులో తమకు బెర్తులు సమకూర్చిన నాగ్‌పుర్‌కు చెందిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి కూడా నిఖిత ధన్యవాదాలు తెలిపారు. తాము దిల్లీకి చేరుకున్నామని.. ఎయిమ్స్‌లో బాబుకి పరీక్షలు జరుగుతున్నాయని ఆమె శనివారం 'పీటీఐ'కి తెలిపారు.

ఇదీ చూడండి :'మొబైల్ ఫోన్ల వల్లే అత్యాచార ఘటనలు'

ABOUT THE AUTHOR

...view details