తెలంగాణ

telangana

భూతల స్వర్గానికి సరికొత్త అందాలు.. కశ్మీర్ లోయకు పోటెత్తిన పర్యటకులు

By

Published : Feb 6, 2023, 7:25 AM IST

భూతల స్వర్గం జమ్ముకశ్మీర్.. హిమసోయగంతో కొంగొత్త అందాన్ని అద్దుకుంది. హిమపాతంతో ధవళవర్ణ శోభితంగా మారిన లోయ అందాలను తిలకించేందుకు పర్యటకులు పోటెత్తుతున్నారు. కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడుపుతూ.. మేఘాలలో తేలిపోతున్నామనే అనుభూతి చెందుతున్నారు.

The Unimaginable Beauty of Kashmir
The Unimaginable Beauty of Kashmir

భూతల స్వర్గానికి సరికొత్త అందాలు.. కశ్మీర్ లోయలో పోటెత్తిన పర్యటకులు..

మంచు కురిసే వేళల్లో అందాల కశ్మీరం ముగ్ధమనోహరంగా మారుతుంది. హిమసోయగాలు.. భూతల స్వర్గాన్ని తలపిస్తాయి. విపరీతమైన మంచు వల్ల పర్వత ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు వేలాది పర్యటకులు.. కశ్మీర్‌ లోయకు పయనమవుతూ ఉంటారు. ఇటీవల భద్రతపరంగా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టడం, ఉగ్రవాద కార్యకలాపాలు మరింత తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది పర్యాటకులు కశ్మీర్​ లోయకు పోటెత్తారు.

కశ్మీర్​ లోయలో మంచు

హిమపాతం ఎక్కువగా ఉండే గుల్మార్గ్, పహల్గామ్‌, సోన్‌మార్గ్‌ ప్రాంతాలకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలి వెళుతున్నారు. గుర్రాలపై ప్రయాణిస్తూ.. మంచులో ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. గతంలో కశ్మీర్‌కు రావాలంటే కొంత భయంగా ఉండేదని, నేడు ఇక్కడ పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని పర్యటకులు చెబుతున్నారు. ఇక్కడి ప్రజలు, వారి అతిథ్యం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తరలివస్తున్న పర్యటకులు

ఈ ఏడాది ప్రారంభం నుంచే కశ్మీర్ లోయలో.. పర్యటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక్కడి హోటళ్లు, అతిథి గృహాలు పర్యటకులతో నిండిపోయాయి. గత రెండేళ్లుగా పర్యటక రంగం ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details