తెలంగాణ

telangana

వారిని విడిపించేందుకు.. వివాహ నగలను విరాళంగా ఇచ్చిన వీర వనిత..

By

Published : Jul 23, 2022, 8:31 AM IST

భగత్‌సింగ్‌, రాజ్‌గురులాంటి నాటి విప్లవ వీరులు స్వాతంత్య్ర సాధనే ఊపిరిగా బతికారు. వేషాలు మార్చారు. జైళ్లకూ వెళ్లారు. వారిని కాపాడేందుకు ఓ మహిళామణి కూడా అంతే వీరోచితంగా ప్రయత్నించారు. ఈక్రమంలో బ్రిటిషర్ల నుంచి తప్పించుకునేందుకు పట్టణాలను, ఉద్యోగాలను, వేషాలను మార్చారు. జైలు గోడలను బద్దలుకొట్టడానికీ సాహసించారు. ఉద్యమకారులను విడిపించేందుకే తన పెళ్లి కోసం దాచిన నగలనూ ఖర్చు చేశారు. ఎన్నో కష్టాలను ఓర్పుగా అనుభవించారు. ఆ యోధురాలే.. సుశీలాదీదీ.

sushila didi
సుశీలాదీదీ

పంజాబ్‌ రాష్ట్రం డాంటో చుహార్​లో (ప్రస్తుతం పాకిస్థాన్‌) సంప్రదాయ కుటుంబంలో 1905 మార్చి 5న సుశీలాదీదీ జన్మించారు. తండ్రి ఆర్మీ డాక్టర్‌. చిన్నతనంలోనే తల్లి దూరమైంది. పాఠశాల విద్య పూర్తవగానే 1921లో జలంధర్‌లోని ఆర్య మహిళా కళాశాలలో చేరారు సుశీలాదీదీ. అక్కడ నాయకుల ప్రసంగాలతో ఆమెలో జాతీయోద్యమ బీజాలు నాటుకున్నాయి. రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌, ఠాకూర్‌ రోషన్‌సింగ్‌, రాజేంద్ర లాహిరిల ఉరితీతతో ఆమె తీవ్రంగా కలత చెందారు. పోరాటంలో యువత పాల్గొనాల్సిన ఆవశ్యకతపై స్వయంగా కవితలు, పాటలు రాశారు. ఉద్యమం వద్దని తండ్రి వారించగా ఆమె ఏకంగా ఇంటినే వదిలేశారు.

భగత్‌సింగ్‌ డిఫెన్స్‌ కమిటీ:సుశీల 1928లో కోల్‌కతా వెళ్లి, ట్యూటర్‌గా పనిచేశారు. లాహోర్‌లో బ్రిటిష్‌ పోలీసు అధికారి సాండర్స్‌ను హత్య చేశాక కోల్‌కతాకు చేరుకున్న భగత్‌సింగ్‌తోపాటు మరికొందరికి దీదీ తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)లో చేరి ఉద్యమకారులకు సహాయపడ్డారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు మహిళలతో 'భగత్‌సింగ్‌ డిఫెన్స్‌ కమిటీ'ని ప్రారంభించారు. దిల్లీ అసెంబ్లీ బాంబు కేసు, కాకోరీ దోపిడీ ఘటనల్లో అరెస్టై జైలుశిక్ష అనుభవిస్తున్న ఉద్యమకారులను విడిపించేందుకు విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో సుశీల తన పెళ్లి కోసం దాచి ఉంచిన.. 10 తులాల బంగారాన్ని క్షణమైనా ఆలోచించకుండా విరాళంగా ఇచ్చేశారు.

వైస్రాయ్‌ హత్యకు పథకం:దిల్లీ అసెంబ్లీ బాంబు కేసులో భగత్‌సింగ్‌తోపాటు మరికొందరు అరెస్టయ్యాక హెచ్‌ఎస్‌ఆర్‌ఏ ఉద్యమకారులంతా కలిసి వైస్రాయ్‌ ఇర్విన్‌ను హతమార్చాలని పథకం రచించారు. ఇందుకు రెక్కీ నిర్వహించేందుకు సుశీల ఆంగ్ల మహిళ అవతారమెత్తారు. యూరోపియన్‌ వేషధారణలో వివరాలనూ సేకరించారు. అయితే ఆ పథకం విఫలమైంది. అనంతరం జైలు గోడలు బద్దలుకొట్టి భగత్‌సింగ్‌తోపాటు ఇతర ఉద్యమకారులను బయటకు తీసుకురావాలని అనుకున్నారు. ఇందుకు ఆయుధాలు, సామగ్రి అవసరమేర్పడింది. ఈ ఆపరేషన్‌లోనూ సుశీలా దీదీదే కీలకపాత్ర. ఈ క్రమంలో కోల్‌కతాలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి లాహోర్‌కు చేరుకున్నారు. ఆయుధాల సేకరణకు సిక్కు యువకుడి వేషధారణలోకి మారారు. జైలుపై వేయాల్సిన బాంబును పరీక్షిస్తూ హెచ్‌ఎస్‌ఆర్‌ఏకు వెన్నెముకగా ఉన్న భగవతీ చరణ్‌ వోహ్రా దురదృష్టవశాత్తు మృతి చెందారు. దీంతో ఆ ప్రణాళిక కూడా విఫలమైంది. తమపై తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్న సుశీలాదీదీ అరెస్టుకు బ్రిటిష్‌ ప్రభుత్వం వారెంట్‌ జారీ చేయగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉద్యమ ఆవశ్యకతను వివరిస్తూ భగత్‌సింగ్‌కు ఆమె రాసిన ఓ లేఖ అప్పటి 'స్వతంత్ర భారత్‌' పత్రికలో ప్రచురితమైంది. ఆ లేఖను ప్రచురించినందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం పత్రిక ఎడిటర్‌ భగవత్‌పై దేశద్రోహ నేరం మోపి జైలుశిక్ష విధించింది. చంద్రశేఖర్‌ ఆజాద్‌ మృతి, భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల ఉరితీత అనంతరం బలహీనపడిన హెచ్‌ఎస్‌ఆర్‌ఏను గాడిన పెట్టేందుకు దీదీ దిల్లీ, లాహోర్‌ శాఖల బాధ్యతలు చేపట్టారు. భగత్‌సింగ్‌ ఉరితీతకు అప్పటి పంజాబ్‌ ప్రభుత్వ సెక్రటరీ హెన్రీ కిర్క్‌ కారణమని భావించిన దీదీ.. ఆయన్ని తుద ముట్టించేందుకు ధన్వంతరి, జగదీశ్‌తో కలిసి లాహోర్‌లో పథకం రూపొందించారు. అనూహ్యంగా పోలీసులు జగదీశ్‌ను కాల్చి చంపారు. కొన్ని రోజులకు సుశీలాదీదీని అరెస్టు చేశారు. ఆధారాలు దొరక్కపోవడంతో ఆమెపై కేసు నమోదు చేయలేక.. దిల్లీ వదిలిపోవాలని ఆదేశించారు.

కాంగ్రెస్‌లో చేరి.. ఇందుమతిగా మారి..:జైళ్ల నుంచి ఉద్యమకారులను విడుదల చేయాలంటూ 1932లో దిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీలో సుశీలాదీదీ.. ఇందుమతిగా పేరు మార్చుకుని పాల్గొన్నారు. అప్పుడు అరెస్టై ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు. విడుదలయ్యాక 1933లో ఉద్యమకారుడు శ్యాంమోహన్‌ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో భార్యాభర్తలు చురుగ్గా పాల్గొని ఎన్నోసార్లు జైలుకు వెళ్లివచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించాక దిల్లీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగానూ, దిల్లీ పురపాలక సంఘం సభ్యురాలిగానూ పనిచేసిన సుశీలాదీదీ 1963 జనవరి 13న మరణించారు.

ఇవీ చదవండి:'సారే జహాసె అచ్ఛా' రచయితే.. భారతదేశ విభజనకు రూపకర్త!

వివేకానందుడి బోధనలతో స్ఫూర్తి.. తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలి..

ABOUT THE AUTHOR

...view details