తెలంగాణ

telangana

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులు సెల్యూట్‌ చేసిన దళిత వీరాంగన

By

Published : Feb 16, 2022, 8:51 AM IST

Azadi Ka Amrit Mahotsav: ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనగానే ఎక్కువమందికి ఝాన్సీ లక్ష్మీబాయి పేరే గుర్తుకొస్తుంది. కానీ ఆమెతో పాటు అనేక మంది మహిళలు... ధైర్యంగా ఆనాటి యుద్ధంలో పాల్గొన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. వారిలో అంతగా చరిత్ర పుటలకెక్కని వీరవనిత ఊదాదేవి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మహిళా దళాన్ని తయారు చేసి... 32 మంది తెల్లవారిని ఒంటిచేత్తో మట్టుబెట్టిన ఈ దళిత వీరాంగన సాహసం వింటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ హయాంలో అవధ్‌ (ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోనిది) ఓ సంస్థానం. రాజు నవాబ్‌వాజిద్‌ అలీషా. ఆయన భార్య బేగం హజ్రత్‌ మహల్‌. కీలకమైన ఈ సంస్థానంపై బ్రిటిష్‌ ప్రభుత్వం కన్నేసి 1856లో స్వాధీనం చేసుకుంది. చేసేది ఏమీ లేక... లండన్‌ వెళ్లి విక్టోరియా మహారాణిని కలుస్తానంటూ... కుటుంబాన్ని విడిచి... రాజు నవాబ్‌ వాజిద్‌ అలీషా కోల్‌కతా వెళ్లిపోయాడు. ఇంతలో... మేరఠ్‌, ఝాన్సీ, కాన్పుర్‌లలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు) మొదలైంది. అవధ్‌పైనా దీని ప్రభావం పడింది. ఇదే అదనుగా... కోల్పోయిన సంస్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి భర్త సాయం లేకపోయినా నడుం బిగించింది బేగం హజ్రత్‌ మహల్‌. ఆ క్రమంలో ఆమెకు తోడైంది ఊదాదేవి.

అవధ్‌లోని ఓ పాసీ దళిత కుటుంబంలో జన్మించిన ఊదాదేవి చిన్నప్పటి నుంచీ ఆంగ్లేయుల అరాచకాలను వింటూ పెరిగింది. వారిపై వ్యతిరేకత ఆమెలో నరనరాన గూడుకట్టుకుంది. ఆమె భర్త మక్కాపాసీ హజ్రత్‌ మహల్‌ సైన్యంలో చేరారు. సిపాయిల తిరుగుబాటుతో అవధ్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడగానే... ఊదాదేవి కూడా రంగంలోకి దిగింది. బేగం హజ్రత్‌ మహల్‌ సూచనల మేరకు... మహిళల బెటాలియన్‌ను ఏర్పాటు చేసి నాయకత్వం వహించింది.

సికిందర్‌బాగ్‌... కోటలాంటి విల్లా గార్డెన్‌. నవాబ్‌ వాజిద్‌ అలీషా వేసవి విడిదిగా దీన్ని నిర్మించుకున్నాడు. ఇది కేంద్రంగా... ఆంగ్లేయులపై హజ్రత్‌ మహల్‌ సైన్యం విరుచుకుపడి... బ్రిటిష్‌ రెసిడెన్సీని స్వాధీనం చేసుకుంది. ఇది తెల్లవారిని ఆశ్చర్యపర్చింది. రెసిడెన్సీని తిరిగి పొందటానికి కమాండర్‌ కాలిన్‌ క్యాంప్‌బెల్‌ సారథ్యంలో బ్రిటిష్‌ సైన్యం ఎదురుదాడి మొదలెట్టింది. సికిందర్‌బాగ్‌ లోపలి నుంచి తమపై దాడి జరుగుతున్నట్లు గుర్తించిన క్యాంప్‌బెల్‌ 1857 నవంబరులో భారీస్థాయిలో విరుచుకుపడ్డాడు. దాదాపు 2వేల మంది అవధ్‌ సిపాయిలు హతమయ్యారు. ఈ క్రమంలో ఊదాదేవి భర్త మక్కాపాసీ మరణించాడు. ఈ విషయం తెలియగానే... మరింత ఉక్రోషంతో ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రతిన పూనింది ఊదాదేవి. అలాగని ఆవేశంతో ఎదురుగా వెళ్లి ఆంగ్లేయుల సేనలను, వారి ఆయుధ సంపత్తిని ఎదుర్కోవటం మూర్ఖత్వమవుతుందని గమనించి వ్యూహం పన్నింది.

కొమ్మల్లో కూర్చొని.. 32 మందిని మట్టుపెట్టి

1857 నవంబరు 16న... ఊదాదేవి పురుషుడిగా వేషం మార్చి... సికిందర్‌బాగ్‌ ముందున్న మర్రిచెట్టు పైన కొమ్మల్లో ఎక్కి కనబడకుండా కూర్చొని... కిందనున్న బ్రిటిష్‌ సేనలపై కాల్పులు జరపటం ఆరంభించింది. సికిందర్‌బాగ్‌ లోపలి నుంచి ప్రతిఘటన తగ్గినా... తమ సైనికులు ఒకరొకరుగా పడిపోవటం ఆంగ్లేయులను ఆశ్చర్యపర్చింది. ఒకటి కాదు... రెండు కాదు...ఏకంగా 32 మంది తెల్లవారు నేలకొరిగారు. సాయంత్రం కాగానే... ఓ ఆంగ్లేయ అధికారికి అనుమానం వచ్చింది. చనిపోతున్న తమ వాళ్లపై బుల్లెట్లన్నీ... ఎదురుగానో, పక్కల నుంచో, వెనక నుంచో కాకుండా... ఎత్తు నుంచి... ఏటవాలుగా ఒకే కోణంలో దిగినట్లు గమనించాడు. ఎవరో చుట్టుపక్కల చెట్ల మీది నుంచి కాల్పులు జరుపుతుండొచ్చని సందేహించాడు. వెంటనే... మర్రిచెట్టు కొమ్మలకు గురిపెట్టి... తూటాల వర్షం కురిపించారు. కొద్దిసేపటికి తీవ్ర గాయాలతో నేలరాలి ప్రాణం కోల్పోయింది ఊదాదేవి. తరచి చూడగా... తమపై అనూహ్యంగా విరుచుకుపడ్డ ఆ యోధ పురుషుడు కాదని మహిళ అని తేలటంతో ఆంగ్లేయ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ ధైర్య సాహసాలకు, వ్యూహ చతురతకు కదిలిపోయిన కమాండర్‌ క్యాంప్‌బెల్‌ ఊదాదేవి పార్థివదేహానికి తలవంచి సెల్యూట్‌ చేశాడు. చరిత్ర పుటల్లోకి పెద్దగా ఎక్కకున్నా ప్రజల నోళ్లలో, జానపదకథల్లో ఇప్పటికీ ఊదాదేవి జీవించే ఉంది. ఏటా నవంబరు 16న ఈ ప్రదేశంలో ప్రజలు సమావేశమై ఆమెను స్మరించుకుంటారు.

ఇదీ చూడండి:

గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా?

ABOUT THE AUTHOR

...view details