తెలంగాణ

telangana

Azadi Ka Amrit Mahotsav: ఆఖరి జన్మదినాన గాంధీ ఏం సందేశమిచ్చారు?

By

Published : Oct 2, 2021, 7:04 AM IST

అక్టోబర్​ 2.. గాంధీ జయంతి(Gandhi Jayanti) దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించటం ఆనవాయితీ అయ్యింది! మరి గాంధీ ఉండగా పుట్టిన రోజెలా చేసుకునేవారు? స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆయన జన్మదినం ఎలా జరిగింది? తన పుట్టినరోజును గాంధీ ఎలా స్వీకరించారు? ఏం సందేశమిచ్చారు?

gandhi jayanti
gandhi jayanti

స్వాతంత్య్రోద్యమం నడిచిన కాలంలో గాంధీజీ పుట్టిన రోజులు(Gandhi Jayanti) చాలానే వచ్చాయి. కానీ జీవితంలో ఒక్కసారి తప్పిస్తే ఎన్నడూ ఆయన పుట్టిన రోజు జరుపుకోలేదు. ఆ ఒకే ఒక్కసారి కూడా ఓ మంచి ఉద్దేశంతో చేయటంతో అంగీకరించారు. అది తన 75వ పుట్టినరోజు. 1944 ఫిబ్రవరిలో మరణించిన గాంధీజీ భార్య కస్తూర్బా సంస్మరణార్థం ఏర్పాటైన జాతీయ ట్రస్టుకు నిధులు సేకరించేందుకుగాను ట్రస్టు సభ్యులంతా బతిమిలాడితే గాంధీజీ(Gandhi Jayanti) అంగీకరించారు. ఈ ట్రస్టు ఏర్పాటు సమయంలో గాంధీ జైలులో ఉన్నారు. సుమారు 75 లక్షల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతమొత్తం సేకరించటం కష్టమనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా రూ.కోటిపైనే సమకూరింది.

1944 అక్టోబరు 2న వార్దా సేవాశ్రమంలో కార్యక్రమం ఏర్పాటుచేసి... కస్తూర్బా ట్రస్టు సొమ్మును ఆయనకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జమ్నాలాల్‌ బజాజ్‌ కుమార్తె మదాలస ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూశారు. సేవాశ్రమాన్ని అందంగా అలంకరించారు. చుట్టూ దీపాలు వెలిగించారు. ఇదంతా తెలిసిన గాంధీజీ వెంటనే మదాలసను పిలిచి కోప్పడ్డారు. 'ఒకవంక వేల ఊర్లలో తినటానికి తిండి లేదు... వారి జీవితాల్లో వెలుగుల్లేవు. నువ్వేమో ఇక్కడ దీపాల రూపంలో నూనె వృథా చేస్తున్నావా?' అంటూ ఆర్భాటం అంతా తీయించేశారు. దాదాపు 75 నిమిషాల పాటు ఆ పుట్టిన రోజు వేడుక నిరాడంబరంగా సాగింది.

డి.జి.తెందుల్కర్‌, ఎం.చలపతిరావు, మృదుల సారాభాయ్‌, విఠల్‌భాయ్‌ జావేరిలు గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకాన్ని గాంధీయే ఆవిష్కరించారు. అంతేగాకుండా ఈ పుస్తకానికి ముందుమాట కూడా ఆయనే స్వయంగా రాశారు. తనపై పుస్తకానికి తానే ముందుమాట రాసుకోవటమేంటని అడగ్గా... "నేను ముందుమాట రాస్తే ఈ పుస్తకం ఎక్కువ అమ్ముడు పోతుందన్నారు. ఓ మంచి పనికి ఆ సొమ్ము ఉపయోగపడుతుందంటే నాకంతకంటే ఏం కావాలి? మంచిపనిని కాదనలేని అశక్తుడిని" అన్నారు గాంధీజీ! పుట్టినరోజు సందర్భంగా ఏదైనా సందేశం ఇవ్వమని ఓ విలేకరి అడగ్గా... "ఇలాంటి సందర్భాల్లో సందేశాలివ్వటం నాకంతగా అలవాటు లేదు. నాకో పుట్టినరోజు(Gandhi Jayanti) ఉందనే సంగతీ నాకు కొద్దికాలం కిందటి దాకా తెలియదుఠ అంటూ నవ్వేశారు గాంధీజీ.

1947, అక్టోబరు2 స్వతంత్ర భారతంలో గాంధీజీ తొలి, ఆఖరు (78వ) పుట్టినరోజు! దిల్లీలో జరిగిన ప్రార్థన సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

"ఉపవాసం... నూలు వడకటం...ప్రార్థన... పుట్టినరోజు జరుపుకొనే సరైన పద్ధతి ఇదేనన్నది నా భావన! మీ అందరికీ ఇవాళ నా పుట్టినరోజు. నాకు మాత్రం సంతాప దినం! ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యంగానూ, సిగ్గుగానూ ఉంది. ఇన్నాళ్లూ లక్షల మంది నా మాట మీద నడిచారు. ఇవాళ ఒక్కరూ నా మాట వినటం లేదు. నిజంగా నా పుట్టిన రోజు సంబరంగా చేసుకోవాలనే మీకుంటే... మనసుల్లోంచి విద్వేషభావాన్ని తొలగించుకోండి. అది మీ బాధ్యత!"

-గాంధీజీ

ఇవీ చూడండి:

Gandhi Jayanti: 'సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతం'

Gandhi Jayanti: 'బాపూ కలల సాకారం దిశగా అడుగులు వేయాలి'

ABOUT THE AUTHOR

...view details