తెలంగాణ

telangana

'పాపులారిటీ కోసమే అతీక్ హత్య- నిందితులంతా నిరుద్యోగులు, డ్రగ్ బానిసలే'

By

Published : Apr 16, 2023, 1:40 PM IST

Updated : Apr 16, 2023, 2:26 PM IST

గ్యాంగ్​స్టర్ అతీక్ అహ్మద్​ను పాపులారిటీ కోసమే చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు! ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. నిందితులు చెడు అలవాట్లకు బానిస అయ్యారని, ఎలాంటి పనీ చేసేవారు కాదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Atiq Ahmed killers
Atiq Ahmed killers

పాపులారిటీ కోసమే గ్యాంగ్​స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్​ను హత్య చేసినట్లు నిందితులు చెప్పుకొచ్చారు. అతీక్- అష్రఫ్ గ్యాంగ్​ను తుదముట్టించేందుకే హత్యకు పథక రచన చేసినట్లు తెలిపారు. తద్వారా తాము పేరు సంపాదించవచ్చని భావించినట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులు చెప్పిన వివరాలతో పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు. 'అతీక్, అష్రఫ్​ను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్న విషయం మాకు తెలియగానే అప్రమత్తమయ్యాం. అతడి హత్యకు సిద్ధమయ్యాం. స్థానిక జర్నలిస్టుల్లా మీడియా బృందంలో కలిసిపోయాం' అని నిందితులు చెప్పినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది.

ఘటన జరిగిన వెంటనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని లవ్లీశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యగా గుర్తించారు. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ వీరంతా.. ఖాళీగా తిరిగేవారని సమాచారం. నిందితుల్లో ఒకరైన లవ్లీశ్.. మాదకద్రవ్యాలు సేవించేవాడని తెలుస్తోంది. ప్రయాగ్​రాజ్​కు తన కుమారుడు ఎందుకు వెళ్లాడో తమకు తెలియదని లవ్లీశ్ తండ్రి యజ్ఞ తివారీ పేర్కొన్నారు. అతడితో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. లవ్లీశ్ మత్తుపదార్థాలకు బానిస అయ్యాడని వివరించారు. లవ్లీశ్ కుటుంబం బాందా జిల్లాలో నివసిస్తోంది. నిందితుడు తన తండ్రి వద్ద ఉండటం లేదు. తన కుటుంబానికి దూరంగా నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యుల గురించి ఎవరికీ చెప్పుకోలేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని అతడి తండ్రి యజ్ఞ తివారీ చెబుతున్నారు.

లవ్లీశ్ తివారీ

"జరిగిన ఘటన గురించి టీవీలో చూసి తెలుసుకున్నాం. అతడు నా కుమారుడే. అతడు చేసే పనుల గురించి మాకు తెలియదు. ఈ ఘటనతో మాకు సంబంధం లేదు. అతడు ఇక్కడ ఉండటం లేదు. ఐదారు రోజుల క్రితం లవ్లీశ్ ఇంటికి వచ్చాడు. మాకు ఏ విషయాలూ చెప్పలేదు. అతడు ఏ పని చేయడు. డ్రగ్స్​కు బానిస అయ్యాడు. గతంలోనూ ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు."
-యజ్ఞ తివారీ, నిందితుడు లవ్లీశ్ తండ్రి

లవ్లీశ్ తివారీకి ఆధ్యాత్మికత ఎక్కువ అని అతడి తల్లి ఆశా చెబుతున్నారు. తరచుగా ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకునేవాడని తెలిపారు. 'నా కుమారుడు ఇతరులకు సాయం చేసేవాడు. హనుమంతుడిని ఆరాధించేవాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత అతడితో మాట్లాడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎవరో అతడిని తప్పుదోవపట్టించారు. అందుకే ఇలా చేశాడు. అతడి విధి రాత ఎలా రాసి ఉందో?' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'లవ్లీశ్ చెడు వ్యక్తులతో తిరిగేవాడు. డ్రగ్స్​కు బానిస అయ్యాడు. చట్టవిరుద్ధమైన పనులు చేసేవాడు. అది నచ్చకే అతడిని దూరం పెట్టాం. ఇంటి గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏమీ చెప్పకుండా వారం క్రితం బయటకు వెళ్లాడు. టీవీలో వార్తలు వచ్చాకే ఈ ఘటన గురించి తెలిసింది' అని లవ్లీశ్ సోదరుడు వేద్ వివరించాడు.

లవ్లీశ్ తివారీ కుటుంబ సభ్యులు

మరో నిందితుడు సన్నీ సింగ్​ నిరుద్యోగి అని అతడి సోదరుడు పింటూ సింగ్ తెలిపాడు. గ్యాంగ్​స్టర్లను సన్నీ హత్య చేసిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు. ప్రస్తుతం సన్నీ ఎలాంటి పని చేయడం లేదని, స్నేహితులతో కలిసి బయట తిరుగుతున్నాడని వివరించాడు.
మరోవైపు, అతీక్ హత్యపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లఖ్​నవూలోని సీఎం అధికారిక నివాసంలో పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

Last Updated : Apr 16, 2023, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details