తెలంగాణ

telangana

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.. గెలుపుపై పార్టీల ధీమా

By

Published : Mar 10, 2022, 8:25 AM IST

Assembly elections 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ భద్రతా మధ్య, కొవిడ్​ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తున్నారు. తొలుత పోస్టల్​ బ్యాలట్లు లెక్కించి.. ఆ తర్వాత ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు.

Assembly elections 2022
ఓట్ల లెక్కింపు

Assembly elections 2022: సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతికదూరం వంటి నిబంధనలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,200 కౌంటింగ్‌ హాళ్లను ఈసీ ఏర్పాటు చేసింది. వీటిలో 750కి పైగా ఒక్క యూపీలోనే ఉన్నాయి. తొలుత పోస్టల్‌ బ్యాలట్లను లెక్కిస్తారు. ఆపై ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ ఐదు రాష్ట్రాలకు గత నెల 10 నుంచి ఈ నెల 7 వరకు వివిధ విడతల్లో పోలింగ్‌ జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​లో..

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్‌ జరిగింది. యూపీ ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. సమాజ్‌వాదీ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తెలిపాయి. అయితే 2017 ఎన్నికలతో పోలిస్తే తన బలాన్ని పెంచుకుంటుందని పేర్కొన్నాయి. భాజపానే మరోసారి అధికారంలోకి వస్తే గత 37 ఏళ్లలో యూపీలో వరుసగా రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించనుంది.

పంజాబ్​లో..

పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో విజయంపై.. కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, అకాలీదళ్‌ నేతలు ఎవరికివారే ధీమాగా ఉన్నారు. అయితే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం అధికార కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని, ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనావేశాయి. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ పార్టీని వీడి కొత్త కుంపటి పెట్టుకోవడం.. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ, సీఎం చన్నీ మధ్య విభేదాలు తలెత్తడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్​లో..

ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 13 జిల్లాల పరిధిలో కౌంటింగ్‌కు.. EC ఏర్పాట్లు చేసింది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఎగ్జిట్‌పోల్స్ సైతం స్పష్టంగా ఏ పార్టీకీ మెజార్టీ కట్టబెట్టలేదు. ఫలితంగా ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా చరిత్రను తిరగరాయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధాని మోదీ ప్రభపైనే వారు ఇక్కడ ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి పార్టీకి గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

మణిపుర్​లో..

60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపుర్‌లో ఐదేళ్ల కిందట చిన్న పార్టీలతో కలిసి సర్కారును ఏర్పాటు చేసిన భాజపా ఈ దఫా ఒంటరిగా గద్దెనెక్కుతామన్న విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్‌, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు పెట్టుకున్నాయి. ఐతే మణిపూర్‌లో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి.

గోవాలో..

భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ నెలకొన్న గోవాలో హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌లో మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. ఫలితంగా కూటముల ఏర్పాటు ప్రయత్నాల్లో ప్రధాన పార్టీల నాయకులు తలమునకలై కనిపిస్తున్నారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హంగ్‌ ఏర్పాటైంది..

ఇదీ చూడండి:ఈవీఎంల ట్యాంపరింగ్​పై అఖిలేశ్​ ఆరోపణ.. ఈసీ ఏమందంటే?

ABOUT THE AUTHOR

...view details