తెలంగాణ

telangana

ఆల్పైన్​ గర్ల్​ ఆఫ్​ ఇండియా.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​లో సాహసాలతో రికార్డ్!

By

Published : Nov 12, 2021, 3:01 PM IST

లాక్‌డౌన్​లో ఐటీ ఉద్యోగులంతా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేశారు. ఇంట్లోనే ఇష్టంగానో, కష్టంగానో పని చేశారు. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి మాత్రం చిన్ననాటి అభిరుచి వైపు కదిలింది. ట్రెక్కింగ్‌పై ఆసక్తితో.. కశ్మీర్ లోయలో వాలిపోయింది. పదివేల అడుగుల ఎత్తులో అలవోకగా ప్రయాణం సాగించింది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. 50 సరస్సులు చుట్టేసి, ఆల్పైన్​ గర్ల్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందింది. తనే నమ్రత నందీష్‌.

'Alpine Girl' From Bengaluru
ఆల్ఫైన్​ గర్ల్​ ఆఫ్​ ఇండియా

ఆల్పైన్​ గర్ల్​ ఆఫ్​ ఇండియాగా గుర్తింపు పొందిన నమ్రత

అందమైన మంచు పర్వతాలపై నడుస్తున్న ఈ అమ్మాయి పేరు.. నమ్రత నందీష్‌. బెంగళూరుకు చెందిన ఈమె ఐటీ కంపెనీలో హెచ్​ఆర్​ మేనేజర్‌. కళాశాల వయసు నుంచే ఈమెకు ట్రెక్కింగ్‌ అంటే చాలా ఇష్టం. ఉద్యోగ జీవితం మొదలవడం.. ఇంటి బాధ్యతలతో కూడిన గజిబిజి జీవితం ఆమె అభిరుచులకు, ఇష్టాలకు బ్రేక్ వేసింది. అయితే, మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం.. ఆ సమయాన్ని పాత ఇష్టాల వైపు మళ్లించింది.

పక్కాగా ప్లాన్ అంటూ లేదు. శ్రీనగర్‌ను సందర్శించాలనే ఆలోచనతో ఇదంతా ప్రారంభమైంది. గడ్డకట్టిన దాల్ సరస్సును చూడాలనుకుని బయలుదేరింది. అలా.. జనవరి 26న కశ్మీర్ లోయకు జర్నీ ప్రారంభించింది నమ్రత.

నమ్రత నందీష్​

ట్రెక్కింగ్‌ కోసం కశ్మీర్‌కు వెళ్లి.. దక్షిణ కశ్మీర్‌, పహల్గామ్ ప్రాంతంలోని పీర్ పంజాల్, జంస్కార్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న తులియన్ సరస్సుతో ప్రారంభించింది నమ్రత. అనంతనాగ్- కిష్త్‌వర్ ప్రాంతంలోని శిల్సార్ సరస్సు వరకు 4 నెలల్లో 50 సరస్సులను చుట్టేసింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిందీ యువతి.

సముద్ర మట్టానికి 10 వేల అడుగులో ఎత్తులో ఉండే ఈ సరస్సులను ఆల్పైన్​ సరస్సులు అంటారు. వీటిని ట్రెక్కింగ్‌ చేయడం ద్వారా ట్రెక్కింగ్‌ కమ్యూనిటీ నమ్రతకు ఆల్పైన్​ గర్ల్‌గా కితాబునిచ్చింది.

ఆల్పైన్​ గర్ల్​ ఆఫ్​ ఇండియా నమ్రత నందీష్​

ఆర్థటైటిస్​ ఉన్నా..

ట్రెక్కింగ్ మీద ఇష్టంతో ఎంతోమంది పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. 3-4 రోజుల సుదీర్ఘ ట్రెక్ చేయాలని కోరుకుంటారు. అయితే నమ్రత మాత్రం వారికి భిన్నం. తను నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కష్టపడింది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నా ప్రయాణం పూర్తి చేసి.. డేరింగ్‌ లేడీగా తోటి పర్వతారోహకుల మనన్నలు పొందింది.

ఆల్పైన్​ గర్ల్ ఆఫ్‌ ఇండియాగా సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమ్రత. ఈమె ప్రయాణం గురించి తెలుసుకున్న నెటిజన్లు.. బహుశా దేశంలో మరెవరూ లాక్‌డౌన్‌ను ఈ విధంగా ఉపయోగించుకోలేదేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ.. బెంగళూరు.. ఇంకెక్కడ శ్రీనగర్‌.. ఇష్టమైన పని కష్టంగా ఉన్నప్పటికీ మనసు పెట్టి చేస్తే విజయతీరాలకు చేరవచ్చని నిరూపిస్తోంది.. ది ఆల్పైన్​ గర్ల్‌ నమ్రత నందీష్‌.

ఇవీ చూడండి: 'భారత్​లో డెల్టా ఉద్ధృతే ఎక్కువ.. మిగిలినవి తక్కువే'

ఆంగ్లం వద్దు.. అమ్మభాషే మేలు- తగువులాడుకున్న తెల్లవారు

ABOUT THE AUTHOR

...view details