తెలంగాణ

telangana

ఓట్ల వేటలో కొలువుల వల.. నిరుద్యోగుల వైపే పార్టీల చూపు!

By

Published : Nov 8, 2022, 8:08 AM IST

మంచుకొండల్లో ఈసారి నిరుద్యోగం వేడి రగిలిస్తోంది. ఉద్వేగాంశాలేవీ పెద్దగా లేని వేళ హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో నిరుద్యోగం కీలకాంశంగా మారింది. 10 లక్షలకుపైగా ఉన్న నిరుద్యోగ యువతను ఆకట్టుకోవటానికి రాజకీయ పార్టీలన్నీ తమ నాలుకలకు పదును పెట్టాయి. మాకు కొలువిచ్చారంటే.. మీకు లక్షల్లో కొలువులిస్తామంటూ ఊరిస్తున్నాయి! ఒకరిని మించి మరొకరు ఓట్ల వేటలో కొలువుల వలలు విసురుతున్నాయి.

Himachal Pradesh Election 2022
Himachal Pradesh Election 2022

Himachal Pradesh Election 2022 : దేశంలో నిరుద్యోగం అధికంగాగల రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ ఒకటి. జాతీయ సగటు (6.8%) కంటే ఇక్కడ నిరుద్యోగిత శాతం (7.3) ఎక్కువ. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైనవారి సంఖ్యే 9లక్షలపైన ఉంది. మొత్తం మీద వీరి సంఖ్య 12-14 లక్షల మధ్య ఉండొచ్చని అనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ కావటంతో పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడే ఈ రాష్ట్రం నుంచి చాలామంది యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి వెతుక్కుంటుంటారు. కొవిడ్‌ నేపథ్యంలో వీరిలో చాలామంది సొంతరాష్ట్రానికి తిరిగి వచ్చారు. దీనికి ఆర్థిక మందగమనం, ఎలాంటి పారిశ్రామిక ప్రగతి లేకపోవటం తోడై ఆ ప్రభావం ఇప్పుడు ఎన్నికలపై పడుతోంది. యువతలో తీవ్రమైన నిరాశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మారింది. ఈనెల 12న జరిగే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకోవటానికి అన్ని పార్టీలూ తమ అమ్ములపొదిలో హామీలను నింపుకొంటున్నాయి.

కాంగ్రెస్‌.. 5 లక్షలిస్తాం
భాజపాను గద్దెదించి అధికారంలోకి రావటం కోసం తీవ్రంగా పోరాడుతున్న కాంగ్రెస్‌ ఇప్పటికే యువ రోజ్‌గార్‌ సంఘర్ష్‌ యాత్ర పేరుతో ఉద్యమం ఆరంభించింది. భాజపాకు వ్యతిరేకంగా యువతరాన్ని ఏకం చేస్తోంది. అంతేగాకుండా... తాము అధికారంలోకి వస్తే 5లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వటంతో పాటు రూ.680 కోట్లతో స్టార్టప్‌ నిధిని ఏర్పాటు చేస్తామంది.

ఆప్‌.. 6 లక్షలిస్తాం
ఆమ్‌ ఆద్మీపార్టీ యువతరానికి ఎక్కువగా గాలం వేస్తోంది. కాంగ్రెస్‌కు పోటీగా తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలిస్తామంటూ ప్రకటించింది. అంతేగాకుండా.. ఉద్యోగం వచ్చే దాకా నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది.

భాజపాకు ఇబ్బంది..
నిరుద్యోగులకు హామీలివ్వటంలో విపక్షాలు పోటీపడుతుండటంతో అధికార భాజపాకు సహజంగానే కాసింత సంకటంగా మారింది. వేలకొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, నీటిపారుదలశాఖలో 10వేలు, పీడబ్ల్యూడీలో 5వేల మందిని తీసుకున్నామంటూ లెక్కలు చెబుతోంది. సొంతంగా వ్యాపారం చేసుకునేవారికి కోటి రూపాయల దాకా ఆర్థిక సాయం అందజేస్తున్నామని గుర్తు చేస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తూనే.. రాష్ట్రంలో నిరుద్యోగానికి కాంగ్రెస్‌ పార్టీ గతంలో అనుసరించిన విధానాలే కారణమని భాజపా విమర్శలు గుప్పిస్తోంది.

ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కల్పన లేదు. తీసుకున్నా తాత్కాలిక పద్ధతిలో నడిపిస్తున్నారు. ఇది యువత శ్రమను దోచుకోవటమే. ఇక ప్రైవేటులోనూ కొవిడ్‌ తర్వాత పరిస్థితి బాగోలేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగం కీలకం కాబోతోంది’’ అని హిమాచల్‌ ప్రదేశ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:కమలాన్ని కలవరపెడుతున్న యాపిల్​ పండ్లు.. తలుచుకుంటే ప్రభుత్వాలని కూల్చేస్తాయ్​!

ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు

ABOUT THE AUTHOR

...view details