తెలంగాణ

telangana

ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్​బై- అఖిలేశ్​కే లాభమా?

By

Published : Jan 21, 2022, 10:51 AM IST

Akhilesh Yadav: మరికొద్దిరోజుల్లో ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బహిరంగ సమావేశాలపై ఈసీ ఆంక్షలతో.. అన్ని పార్టీలు ఆన్​లైన్​లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఫిరాయింపులు కూడా ఊపందుకున్నాయి. అయితే.. యూపీలో ప్రతిపక్షంగా ఉన్న సమాజ్​వాదీ పార్టీ ఈసారి కొత్త పంథాతో ముందుకెళ్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడా కుటుంబం ఛాయలు కనిపించకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు ఎస్​పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​. కొత్తతరాన్ని వెంటేసుకొని ఆయన ముందుకు సాగుతున్నారు.

Akhilesh Yadav UP election 2022 campaign
Akhilesh Yadav UP election 2022 campaign

Akhilesh Yadav: పోతే పోనీ సతుల్‌ సుతుల్‌ హితుల్‌... వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌ అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పిన మాటలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులను ఎస్పీ రాజకీయాలకు దూరంగా పెట్టి ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు తాను, తన తలపై ఎర్ర టోపీ తప్ప మిగిలిన పరివార ఛాయలేవీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. సొంతమరదలు అపర్ణా బిస్త్‌ యాదవ్‌, ములాయం తోడల్లుడు ప్రమోద్‌ గుప్తా పార్టీని వదిలి భాజపా తీర్థం పుచ్చుకున్నా.. అఖిలేశ్‌ వారిని పార్టీలో ఉంచుకునేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. ''ఎస్పీ అంటే కుటుంబ పార్టీ అని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన భాజపా ఇప్పుడు మా కుటుంబసభ్యులను చేర్చుకొని మా మీద ఉన్న నిందను తుడిపేస్తున్నందుకు, బరువు తగ్గిస్తున్నందుకు భాజపాకు ధన్యవాదాలు చెబుతున్నా'' అని అఖిలేశ్‌ చమత్కరించారు. ఎప్పటినుంచో భాజపావైపు మొగ్గుచూపుతూ కంట్లో నలుసులా తయారైన ఇంటి కోడలు పార్టీ ఫిరాయించడానికి సిద్ధమైందని తెలిసినా ఆమెను అఖిలేశ్‌ నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎస్పీ ఓ కుటుంబ పార్టీ, తండ్రి, కుమారుడు, బాబాయ్‌, కోడళ్లదే పెత్తనం తప్ప ఇంకెవరికీ చోటులేదని భాజపా గత ఎన్నికల్లో ప్రచారం చేసి సాధ్యమైనంతమేరకు నష్టాన్ని చేకూర్చింది. ఈసారి అలాంటి వెసులుబాటును మోదీ లాంటి వాక్చాతుర్యం ఉన్న నేతలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో మొత్తం కుటుంబాన్ని దూరంపెట్టి ఒంటరిగానే అఖిలేశ్‌ గోదాలోకి దిగారు.

కుటుంబ ఛాయలు కనిపించకుండా..

UP Elections 2022:ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడా ములాయం జాడ, నీడకూడా కనిపించకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అఖిలేశ్‌. 2017 ఎన్నికల సమయంలో అఖిలేశ్‌-శివపాల్‌యాదవ్‌ మధ్య కుటుంబ యుద్ధం మొదలైనప్పుడు యువనేత పక్షాన నిలిచిన ములాయం సోదరుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌, అఖిలేశ్‌కు తమ్ముడి వరుసైన ధర్మేంద్రయాదవ్‌ ఛాయలు కూడా ఈసారి ఎక్కడా బహిరంగంగా కనిపించడంలేదు. 2017 ఎన్నికల్లో ప్రముఖ ప్రచారకర్తగా, నిరంతరం అఖిలేశ్‌ వెంట నిలిచిన ఆయన సతీమణి డింపుల్‌యాదవ్‌ కూడా ఈసారి బహిరంగంగా దర్శనమివ్వడం లేదు. ఇప్పుడు అఖిలేశ్‌, ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీ (ఎస్‌బీఎస్‌పీ), జయంత్‌సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌, శివపాల్‌యాదవ్‌ నేతృత్వంలోని ప్రగతిశీల్‌ సమాజ్‌ పార్టీలతో కలిసి పోటీకి దిగుతున్నారు. ఇందులో శివపాల్‌ను చిన్నాన్నగా కాకుండా ఓ పార్టీ నేతగా పరిగణించి పొత్తులుపెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. నానాటికీ కొత్తతరం ఓటర్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పాత తరం రాజకీయాలకు స్వస్తిపలికే దిశలో అఖిలేశ్‌ అడుగులేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం రెండు లోక్‌సభ స్థానాలనుంచి, ఆయన కుటుంబసభ్యులు మరో మూడు సీట్ల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ములాయం ఒక స్థానం నుంచి రాజీనామా చేయడంతో అందులోనూ సోదరుడి కుమారుడినే పోటీచేయించి గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ గెలిచిన అయిదుసీట్లూ ములాయం కుటుంబసభ్యుల చేతుల్లోనే ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఎస్పీ కుటుంబపార్టీ అన్న వాదనకు బలమైన ముద్రపడింది. దాన్నుంచి బయటపడటానికి ఇప్పుడు అఖిలేశ్‌ నడుం బిగించారు. పార్టీపై పూర్తి పట్టురావడం, కేడర్‌లో తన నాయకత్వంపై నమ్మకం కలిగేలా చేసుకోవడంతో ఇప్పుడు ఆయన కుటుంబ రాజకీయాలనుంచి బయటపడే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

కొత్తతరంతో ముందుకు..

ములాయంకు అండగా నిలిచిన సీనియర్‌ నేతలు ఎవ్వరూ ఇప్పుడూ అఖిలేశ్‌ వెంట లేకపోయినా కొత్తతరాన్ని వెంటేసుకొని ఆయన ముందుకు కదులుతున్నారు. కేవలం కుటుంబ ఛాయల నుంచే కాకుండా ఎస్పీ అంటే యాదవ్‌ పార్టీ అన్న ముద్ర నుంచి కూడా బయటపడటంకోసం ఇతర ఓబీసీ వర్గాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రసంగాలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల జోలికి పోకుండా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతూ, సున్నితమైన హాస్యంతో ప్రత్యర్థులపై ఛలోక్తులు విసురుతూ ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చూడటానికి చాలా పార్టీలు కనిపిస్తున్నా పోటీ మాత్రం అఖిలేశ్‌ వర్సెస్‌ భాజపా అన్నట్లే కనిపిస్తోంది. బహుముఖ పోటీని ప్రజలు క్రమంగా ముఖాముఖి పోటీగా భావించేలా చేయడంలో అఖిలేశ్‌ కొంత కృతకృత్యులయ్యారు.

UP Assembly Elections: యూపీ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో పోలింగ్​ నిర్వహించనున్న ఈసీ.. మార్చి 10న ఫలితాలు వెలువరించనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:ప్రియాంక ఎంట్రీతో యూపీ ఎన్నికల్లో నష్టం ఎవరికి ?

ఎవరీ అపర్ణా యాదవ్​- భాజపాలో చేరికతో ఎవరికి లాభం?

UP Elections 2022: పశ్చిమ యూపీలో జాట్ల మొగ్గు ఎవరివైపు?

యూపీలో 'ఓబీసీ' జపం- ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల ఎత్తులు

ABOUT THE AUTHOR

...view details