తెలంగాణ

telangana

'చీలిక కాదు.. పార్టీలో అందరి మద్దతు మాకే.. NCP గుర్తుపైనే వచ్చే ఎన్నికల్లో పోటీ'

By

Published : Jul 2, 2023, 4:51 PM IST

Updated : Jul 2, 2023, 6:06 PM IST

Ajit Pawar Deputy CM : ఎన్​సీపీ ఎమ్మెల్యేలు అందరూ తన వెంటే ఉన్నారని ఆ పార్టీ నేత అజిత్ పవార్ తెలిపారు. భవిష్యత్​లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎన్​సీపీ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ప్రాధాన్యం ఉంటుందని అజిత్ పవార్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందని తెలిపారు. మరోవైపు.. తనకు ఇలాంటి రాజకీయ సంక్షోభాలు కొత్త కాదని అన్నారు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​. ఈ తిరుగుబాటు ఇంటి సమస్య కాదని.. ప్రజల సమస్యని వ్యాఖ్యానించారు.

Ajit Pawar Deputy CM
Ajit Pawar Deputy CM

Ajit Pawar Deputy CM : మహారాష్ట్రలోని ఎన్​డీఏ ప్రభుత్వంలో చేరేందుకు ఎన్​సీపీని చీల్చారన్న వాదనల్ని తోసిపుచ్చారు అజిత్ పవార్ వర్గం నేతలు. పార్టీలోని అందరి మద్దతు తమకు ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్​లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎన్​సీపీ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తేల్చిచెప్పారు. ఎన్​సీపీ శాసనసభాపక్షం శిందే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని చెప్పారు. పార్టీలో అందరూ ఎమ్మెల్యేలు శిందే-ఫడణవీస్ ప్రభుత్వంలో భాగం కావాలని నిర్ణయించారని అజిత్ పవార్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనతో కలిసి వెళ్లగలగినప్పుడు.. బీజేపీతో ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు.

పార్టీ అధినేతపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్​.. డిప్యూటీ సీఎంగా ఎన్​డీఏ ప్రభుత్వంలో చేరారు. ఆయనతో సహా మొత్తం 9 మంది ఎన్​సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ముంబయిలో మీడియాతో మాట్లాడారు.

"ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంది. ఆయన ఇతర దేశాల్లో కూడా మంచి ప్రజాదరణ పొందారు. మోదీ నాయకత్వానికి అందరూ మద్దతిస్తున్నారు. రాబోయే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలిసి పోటీ చేస్తాం. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమయ్యాం. శుక్రవారం నేను ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేశాను. దేశాభివృద్ధి కోసం ఎన్​డీఏలో చేరాం "

-- అజిత్ పవార్​, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

Ajit Pawar NCP Logo : ఎన్​సీపీ ఎమ్మెల్యేందరూ తన వెంటే ఉన్నారని అన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​. ఎన్​సీపీ నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ప్రాధాన్యం ఉంటుందని.. అందుకే ఎన్​సీపీ తమదేనని అన్నారు అజిత్ పవార్​. కొందరు ఎమ్మెల్యేలు ఇతర దేశాల్లో ఉన్న కారణంగా వారితో సరిగా చర్చించలేదని.. అయితే తన నిర్ణయానికి వారు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారని వివరించారు. భారతీయ జనతాపార్టీతో తాను కలవడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, వారి విమర్శలను ప‌ట్టించుకోనని అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు. ఎన్​సీపీకి 24 ఏళ్లు వయసని.. యువ నాయకత్వం ముందుకు రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తాను తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఎన్​సీపీ ఎమ్మెల్యేలు సంతృప్తితో ఉన్నారని అన్నారు.

'మోదీ చేతిలో దేశం సురక్షితం'
తాము ప్రభుత్వంలో మూడో పార్టీగా చేరామని అన్నారు ఎన్​సీపీ నేత, మంత్రి ఛగన్​ భుజగల్​. ఎన్​సీపీని తాము చీల్చామని అనడం సరికాదని చెప్పారు. ఎన్​సీపీ పార్టీ మొత్తం ప్రభుత్వంలో చేరిందని అన్నారు. ప్రధాని మోదీని చాలా సార్లు విమర్శించామని. కానీ ఆయన చేతుల్లో దేశం ప్రస్తుతం సురక్షితంగా ఉందన్నది నిజమని తెలిపారు.

'ఈ ఎపిసోడ్ మీకు కొత్త.. నాకు కాదు..'
sharad pawar on ajit pawar : పార్టీపై అజిత్​ పవార్ చేసిన తిరుగుబాటుపై స్పందించారు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​. ఈ తిరుగుబాటు ఎపిసోడ్​ ఇతరులకు కొత్తగానీ.. తనకు కాదని అన్నారు. ఎన్​డీఏలో అజిత్ పవార్ చేరడంపై.. ఇది గూగ్లీ కాదని.. దోపిడీ అని విమర్శించారు. ఎన్​సీపీ పేరును తీసుకుని ఎవరైనా ఏదైనా మాట్లాడితే తాము పోరాడమని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. ఎన్​సీపీ ప్రధాన బలం.. సామాన్య ప్రజలనేనని శరద్ పవార్ అన్నారు. మరోవైపు.. ఎన్​సీపీ నాయకుడు జితేంద్ర అవద్​ను ప్రతిపక్ష నేతగా నియమించారు శరద్ పవార్​.

నా ఇల్లు విడిపోయిందని నేనెప్పుడూ చెప్పను. ఈ సమస్య నా ఇంటిది కాదు. ప్రజల సమస్య. తిరుగుబాటు చేసిన బీజేపీ కూటమితో జట్టు కట్టిన నాయకుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాను. అందులో కొందరు ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు. ఎన్​సీపీ 'ఫినిష్' అన్నారు. అందుకేనేమో కొందరు నాయకులు భయపడి ఎన్​డీఏలో చేరారు. ​మా పార్టీ ఎమ్మెల్యేలు కొందరూ మంత్రులుగా ప్రమాణం చేసినందుకు సంతోషిస్తున్నా. మహారాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా యువతపై నాకు నమ్మకం ఉంది. ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుంటా.

--శరద్ పవార్​, ఎన్​సీపీ అధినేత

'1980లో నేను నాయకత్వం వహించిన పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కొందరు పార్టీపై తిరుగుబాటు చేశారు. ఆఖరికి ఆరుగురు మాత్రమే నావెంట ఉన్నారు. కానీ నేను నిరాశ చెందలేదు. పార్టీని బలపరిచా. నన్ను వెన్నుపోటు పొడిచినవారు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. నాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. నేను ఈ రోజు జరిగిన పరిణామాల పట్ల చింతించట్లేదు.' అని శరద్ పవార్ అన్నారు.

'మహారాష్ట్రకు త్వరలో కొత్త సీఎం'
Sanjay Raut On Ajit Pawar : మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్​సీపీ చేరడం.. ఏక్​నాథ్ శిందే సీఎం పదవిని కోల్పోవడానికి నాంది అని శివసేన( ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి వస్తారని రౌత్ తెలిపారు. అజిత్​ పవార్​.. బీజేపీతో జట్టుకడతారని తమకు ముందే తెలుసని రౌత్​ అన్నారు.

"ఏక్‌నాథ్ శిందే తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడానికి ఎన్​సీపీ నేతల ప్రమాణ స్వీకారం ప్రారంభం. శిందే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. ఆ తర్వాత కూడా బీజేపీ కూటమి అధికారంలో కొనసాగడానికి.. అజిత్ పవార్, ఎన్​సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగమయ్యారు."

--సంజయ్ రౌత్​, శివసేన(యూబీటీ) నాయకుడు

Last Updated :Jul 2, 2023, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details