తెలంగాణ

telangana

60+ ఏజ్​లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్​స్టార్.. అంతా లాక్​డౌన్​ మేజిక్​!

By

Published : Apr 20, 2022, 4:36 PM IST

ఆయనో బిజినెస్​మ్యాన్. వయసు 60 ఏళ్లుపైనే. దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు చూసుకోవడం తప్ప ఇతర విషయాలేవీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా మోడలింగ్​ రంగంలోకి ప్రవేశించారు. నెలల వ్యవధిలోనే సూపర్ క్రేజ్ సంపాదించారు. ఎవరాయన? ఎలా సాధ్యమైంది?

Model Adhir Bhagwanani of Raipur
60+ ఏజ్​లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్​స్టార్.. అంతా లాక్​డౌన్​ మేజిక్​!

అధీర్ భగవ్​నానీ.. భారతీయ మోడలింగ్ రంగంలో నయా సూపర్​స్టార్​. దిగ్గజ సంస్థల యాడ్​లలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది ఈయనే. ఫ్యాన్​ ఫాలోయింగ్​ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఆయనతో సెల్ఫీ కోసం జనం పోటీపడుతున్నారు. ఇంతటి క్రేజ్​ను అధీర్​ కొన్ని నెలల్లోనే సంపాదించడం విశేషం. అది కూడా ఫ్యాషన్​ రంగంలో ఎలాంటి నేపథ్యం లేకుండా సాధించడం ప్రత్యేకం.

అధీర్​ భగవ్​నానీ వయసు సుమారు 62 ఏళ్లు. ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని బారోన్ బజార్ వాసి. మోడలింగ్ ప్రపంచంతో గతేడాది వరకు ఆయనకు అసలు సంబంధమే లేదు. కుటుంబ వ్యాపారాలు చూసుకోవడమే ఆయన పని. ఉక్కు, స్టీల్ వ్యాపారం చేసేవారు. ఓ పరిశ్రమ నడిపేవారు. అలా అనేక దశాబ్దాలుగా సాగిపోతున్న జీవితం 2021 జులైలో అనూహ్య మలుపు తిరిగింది. ఇందుకు కరోనా లాక్​డౌన్​ కూడా కారణమంటారు అధీర్. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సెకెండ్ ఇన్నింగ్స్​ ఎలా మొదలయ్యిందో వివరించారు అధీర్.

60+ ఏజ్​లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్​స్టార్.. అంతా లాక్​డౌన్​ మేజిక్​!

"ఇంతకుముందు నా గడ్డం చిన్నగా ఉండేది. కరోనా లాక్​డౌన్ సమయంలో సెలూన్లు మూతపడ్డాయి. కటింగ్ చేయించడం కుదరక.. గడ్డం పెరిగింది. అదే లుక్ కొనసాగించా. 2021 జులైలో నా భార్యను తీసుకొద్దామని మార్కెట్​కు వెళ్లి కారులో ఎదురుచూస్తున్నా. ఓ వ్యక్తి వచ్చి అద్దంపై కొట్టి, నాతో మాట్లాడాడు. మోడలింగ్​ చేసేందుకు అవకాశం ఇస్తానని చెప్పాడు. నేనే ఎందుకు అని అడిగితే.. మీ గడ్డం బాగుంది అన్నాడు. ఇదేదో బాగుంది కదా అని తర్వాత అతడ్ని కలిశా. అలా మోడలింగ్ మొదలుపెట్టా. మళ్లీ వెనుదిరిగి చూడలేదు. దిల్లీలోని నా స్నేహితుడి కుమారుడు, కోడలు ఫ్యాషన్ రంగంలో ఉంటే వారితో మాట్లాడా. మోడలింగ్​లో నాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వారు చెప్పారు. వారి ద్వారానే రేమండ్ యాడ్​కు, మరో మేగజైన్​కు షూటింగ్​ చేశా" అని వివరించారు అధీర్.

ఆ కిక్కే వేరు: ఆరు పదుల వయసులో సరికొత్త రంగంలోకి ప్రవేశించడం గొప్ప అనుభూతి ఇస్తోందని చెబుతున్నారు అధీర్. "నా పనిని అస్వాదిస్తున్నా. ఇదేదో కెరీర్​లా సీరియస్​గా ఆలోచించి ఏమీ చేయను. కానీ.. ఆఫర్స్​ వచ్చినంత కాలం చేస్తూనే ఉంటా. బయటకు వెళ్తే ప్రజలు గుర్తుపడుతున్నారు. కొందరు నాతో ఫొటోలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కలిగే ఫీలింగ్ ఎంతో బాగుంది" అని వెల్లడించారు అధీర్.

60+ ఏజ్​లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్​స్టార్.. అంతా లాక్​డౌన్​ మేజిక్​!

సాహసమే శ్వాసగా..: వ్యాపారం, మోడలింగ్​తో పాటు బైక్​ రైడింగ్​లోనూ అధీర్​ దిట్ట. వయసును లెక్కచేయకుండా బైక్​పై రయ్​రయ్​మంటూ దూసుకెళ్తారాయన. లద్దాఖ్, ఈశాన్య భారతం, మయన్మార్​కు ద్విచక్రవాహనంపై సాహస యాత్రలు చేశారు. జూన్​లో కన్యాకుమారి నుంచి లద్దాఖ్​ వరకు బైక్​ రైడ్​ చేయాలని స్నేహితులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధీర్.

ABOUT THE AUTHOR

...view details