8 KG Tumor Removed Tamil Nadu :అత్యంత అరుదైన ఆపరేషన్‌లో భాగంగా తమిళనాడులోని ఓ ఆస్పత్రి వైద్యులు ఎనిమిది కేజీల కణతిని ఓ రోగి శరీరంలో నుంచి తొలగించారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ శరీరం నుంచి ఈ కణతిని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ రాణిపేట్‌లోని రాజేశ్వరి ఆస్పత్రిలో జరిగింది.
6 నెలలుగా నొప్పి..
తిమిరి ప్రాంతంలోని తమరైపక్కం గ్రామానికి చెందిన ఉమ గత ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గ్రామంలో తగిన సౌకర్యాలు లేకపోవడం, సమస్యపై అవగాహన కొరవవడం వల్ల ఆమె చికిత్స చేయించుకోలేదు. కడుపు నొప్పి ఎంత తీవ్రమైనా.. పట్టించుకోలేదు. చివరకు, నాలుగు రోజుల క్రితం ఆమె రాజేశ్వరి ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైద్యులు కపిల్ నాగరాజ్, మహ్మద్ సాహిత్ల బృందం మహిళ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చింది. పరీక్షలు నిర్వహించి మహిళ సమస్యను గుర్తించింది.
అంతకంతకూ పెరుగుతూ..
స్కానింగ్‌లో ఆమెకు కణతి ఉన్నట్లు తేలింది. ఉమ గర్భాశయంలో ఇది ఏర్పడినట్లు గుర్తించారు. ఇది అంతకంతకూ పెరుగుతోందని వైద్యులు అంచనాకు వచ్చారు. దీంతో, సమయం వృథా చేయకుండా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మూడు గంటల పాటు కష్టపడి కణతిని విజయవంతంగా ఉమ శరీరం నుంచి తొలగించారు. ఇతర శరీర భాగాలకు ఎలాంటి నష్టం జరగకుండా సర్జరీ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. కణతి బరువు 8 కేజీలు ఉందని చెప్పారు.