తెలంగాణ

telangana

370 రద్దుపై తీర్పు ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని మోదీ వ్యాఖ్య- పోరాటం చేస్తామన్న కశ్మీర్​ పార్టీలు

By PTI

Published : Dec 11, 2023, 1:23 PM IST

Updated : Dec 11, 2023, 2:00 PM IST

370 Article Verdict Reactions : ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీర్పును బీజేపీ స్వాగతించగా, కశ్మీర్​కు చెందిన పార్టీలు నిరాశను వ్యక్తం చేస్తున్నాయి.

370 Article Verdict Reactions
370 Article Verdict Reactions

370 Article Verdict Reactions : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కశ్మీర్​ పార్టీలు వ్యతిరేకించగా, మిగిలిన పార్టీలు స్వాగతించాయి. సుప్రీం తీర్పును బీజేపీ, కాంగ్రెస్​, శివసేన ఉద్దవ్ వర్గం స్వాగతించగా, కశ్మీర్​ పార్టీలు నేషనల్​ కాన్ఫరెన్స్​, డీపీఏపీ పార్టీ వ్యతిరేకించాయి. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పును చారిత్రకమైనదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం చట్టపరమైంది మాత్రమే కాదన్న ఆయన, జమ్ము కశ్మీర్‌కు ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, అక్కడి సోదరసోదరీమణులకు ఆశాకిరణమని ట్వీట్‌ చేశారు.

"సుప్రీంకోర్టు ధర్మాసనం లోతైన జ్ఞానంతో ఐక్యతా సారాంశాన్ని మరింత బలపరిచింది. ప్రగతి ఫలాలు ఆ రాష్ట్ర ప్రజలకు చేరకుండా ఆర్టికల్ 370 అడ్డుకుంది. అలా నష్టపోయిన బలహీన, అట్టడుగు వర్గాలకు ప్రయోజనాలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నాం"

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సుప్రీం తీర్పుపై బీజేపీ హర్షం
ఆర్టికల్‌ 370 రద్దు అణగారిన వర్గాల హక్కులను పునరుద్ధరించిందని, వేర్పాటువాదం, రాళ్లదాడులు సమసిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఆ ప్రాంతమంతా ఇప్పుడు మధురమైన సంగీతం, సాంస్కృతిక వైభవంతో విరాజిల్లుతోందన్నారు. ఈ తీర్పుతో ఐక్యత మరోసారి కొనసాగిందని చెప్పారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తోందని ఆపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జమ్ముకశ్మీర్‌ను జాతీయ భావజాలంలో చేర్చే చారిత్రక పనిని మోదీ ప్రభుత్వం చేసిందని, ఇందుకు కోట్లాది ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలంటూ ట్వీట్‌ చేశారు.

తీర్పు నిరాశ పరిచిందన్న కశ్మీర్​ పార్టీలు​
ఆర్టికల్‌ 370 రద్దును సుప్రీం సమర్థించడాన్ని కశ్మీర్​కు చెందిన పార్టీలు నిరాశ వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో తీవ్ర నిరాశ చెందానన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. కానీ నిరుత్సాహం మాత్రం పడబోమని, జమ్ముకశ్మీర్‌ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని ట్వీట్‌ చేశారు.

"జమ్మూకశ్మీర్​ అనేక ఎత్తుపల్లాలను చూసింది. ఈ తీర్పుతో మనం నిరాశ చెందకూడదు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన అని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మన ఓటమి కాదు. దేశప్రజలు దీనిని పండుగ జరుపుకొంటున్నారు. కానీ ఈరోజు జమ్ముకశ్మీర్​ జైలుగా మారిపోయింది. ఉదయం 10 గంటలలోపు దుకాణాలను తెరవవద్దని ఆదేశించారు. మేమంతా గృహ నిర్బంధంలోనే ఉన్నాం. ఇది చాలా కాలంగా జరుగుతున్న రాజకీయ యుద్ధం. దీంట్లో ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు. దీనికోసం కలిసికట్టుగా పోరాడాలి."

--మెహబూబా ముఫ్తీ, పీడీపీ చీఫ్​

ఈ తీర్పు తనను తీవ్ర నిరాశపరిచిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ వ్యవస్థాపకుడు గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు దురదృష్టకరమని, అయితే దాన్ని అంగీకరించక తప్పదని వివరించారు. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో జమ్ముకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు.

స్వాగతించిన కాంగ్రెస్​, శివసేన
మరోవైపు సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. కేంద్రం వీలైనంత త్వరగా జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విజ్ఞప్తి చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పూర్తిగా పునరుద్ధరించాలన్నారు. శివసేన నేత ఉద్ధవ్​ ఠాక్రే స్వాగతించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​లో కలిపి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

'ఆర్టికల్ 370 రద్దు సరైనదే, వచ్చే ఏడాది ఎన్నికలు'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు

'కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్ 370ని రద్దు చేయలేరా? ఇదేం నిబంధన?'

Last Updated : Dec 11, 2023, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details