ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagananna Houses Fraud: జగనన్న ఇళ్ల పేరుతో వాలంటీర్‌ మోసం.. బాధితుల ఆందోళన

By

Published : Jul 5, 2023, 10:53 PM IST

village volunteer scam: జగనన్న ఇళ్లు నిర్మిస్తానంటూ పల్నాడు జిల్లాలో వాలంటీర్ లబ్ధిదారులను మోసం చేసిన ఘటన తాజాగాా వెలుగులోకి వచ్చింది. గ్రామ వాలంటీర్ తమను ఇళ్ల నిర్మాణం పేరుతో సుమారు 33మందిని మోసం చేశాడని బాధితులు ఆందోళన చేపట్టారు. వెంటనే అతనిపై చర్యలు చేపట్టాలని అమరావతి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

village volunteer scam
village volunteer scam

YSR Housing Scheme: ఓ వైపు ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామంటూ పేర్కొంటుంది. అయితే, అధికార పార్టీ చెందిన కొంత మంది నేతలు, చోటా మోటా కార్యకర్తలు.. గ్రామ వాలంటీర్లు జగనన్న ఇళ్ల పేరుతో​ తమకు అందిన కాడికి దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటనల్లో బాధితులు ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ తలుపు తట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇళ్ల నిర్మాణం పేరుతో సుమారు 33మందిని మోసం చేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న కాలనీలో నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెబుతుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపింస్తున్నాయి. ఇళ్ల నిర్మాణంపేరుతో గ్రామాల్లో కొందరు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు నిర్మాణదారులుగా ముందుకు వచ్చి యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎద్దేవా చేస్తుండగా.. జగనన్న కాలనీలో పేరుతో ఇళ్ల నిర్మాణాలు అంటూ లబ్ధిదారు నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండల గ్రామంలోని కాలచక్రా కాలనీలో ప్రభుత్వం 90 మందికి ఇళ్ల పట్టాలు కేటాయించింది. మొదటి దశలో పేదలకు 35 ఇళ్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వాలంటీర్​ కంభంపాటి దినేష్ ఇదే అదునుగా భావించాడు. ఏడాదిన్నర క్రితం లబ్ధిదారులను కలిసి బేస్​మెంట్​ నిర్మాణానికి మెటీరియల్, నగదు రూపంలో ప్రభుత్వం ఇస్తున్న 75000 తనకు అప్పగిస్తే బేస్​మెంట్​ నిర్మాణం పూర్తి చేసి ఇస్తానని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన 33 మంది లబ్ధిదారులు అందుకోసం నిర్మాణం కోసం పనులు అప్పగించారు. బ్యాంకు ఖాతా తెరవాలంటూ ఇంటి స్థలాలు మంజూరైన మొత్తం 90 మంది నుండి ఒక్కొక్కరి దగ్గర రూ.1000 వసూలు చేశాడు.

వాలంటీర్‌ దినేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఇళ్ల నిర్మాణం మెుదలు పెట్టిన దినేష్ కొద్ది రోజుల తరువాత 33 ఇళ్ల నిర్మాణ పనులు నేల మీద బెల్ట్ వేసి మధ్యలో పనులు ఆపేశాడు. తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బేస్​మెంట్​ పూర్తి చేయాలని లబ్ధిదారులు దినేష్​ను నిలదీశారు. వారికి సరైన సమాధానం ఇవ్వకుండా... మీరే నాకు ఇంకా.. డబ్బులు ఇవ్వాలంటూ దినేష్ డిమాండ్ చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇకపై పనులు చేయనంటూ తెగేసి చెప్పాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగసాగాడని పేర్కొంటున్నారు. వాలంటీర్​ కంభంపాటి దినేష్ చేతిలో మోసపోయామని గుర్తించిన లబ్ధిదారులు.. బుధవారం అమరావతి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details