తెలంగాణ

telangana

ETV Bharat / health

శబ్దమే ఔషధం! - ఒత్తిడికి చెక్ పెట్టే ‘సౌండ్ హీలింగ్’ గురించి తెలుసా?

-మనసును కుదుటపరిచే శబ్ద తరంగాలు - వీటితో ఇంటినే ప్రశాంత నిలయం చేసుకోమంటున్న నిపుణులు!

Representational image
Representational image (Getty Images)

By ETV Bharat Health Team

Published : August 30, 2026 at 4:32 PM IST

Sound Healing Benefits :ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నారు. వారికి పక్షుల రాగాలు, నదీ ప్రవాహాల శబ్దాల ద్వారా ఒత్తిడి తగ్గించుకుని.. ఉల్లాసంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇలాంటి ఆహ్లదకర శబ్దాలకు మనసును కుదుటపరిచే శక్తి ఉందని, కొన్ని ఆరోగ్య సమస్యలనూ తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్నే సౌండ్ హీలింగ్​గా పిలుస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పుడా ఆనందాన్ని ఇంట్లోనూ పొందొచ్చని సూచిస్తున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

ఏం జరుగుతుంది? :మనం వినే శబ్దాలు మెదడుపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ట్రాఫిక్ హోరు, యంత్రాల చప్పుళ్లు ఒత్తిడిని పెంచితే.. ప్రకృతిసిద్ధమైన నాదాలు, సంప్రదాయ వాద్యాల ధ్వనులతో మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయని చెబుతున్నారు. గుండె వేగాన్ని తగ్గించి, రక్తపోటును అదుపుచేసి ప్రశాంతత కలిగిస్తాయని పేర్కొంటున్నారు. అలాగే, వర్షపు శబ్దాలు, ప్రశాంతమైన సంగీతం గామా, ఆల్ఫా బ్రెయిన్‌వేవ్‌లను పెంచుతాయని, ఇవి ఏకాగ్రతను, సృజనాత్మకతను వృద్ధి చేస్తాయని Nexus Teen Academyపేర్కొంది.

ప్రాచీన వాయిద్యాలు, అద్భుత అస్త్రాలు : ప్రకృతి శబ్దాలతో పాటు మన సంప్రదాయ వాయిద్యాలకు శరీరంలోని చక్రాలను ఉత్తేజపరిచే, మానసిక స్థితిని మార్చే అద్భుత శక్తి ఉందంటున్నారు నిపుణులు.

చౌగడ :ప్రాచీన ఆలయాలలో, ఉత్సవాలలో వాడే ఈ చర్మ వాయిద్యం శరీరంలో సానుకూల ప్రకంపనలు పుట్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుంగుబాటుతో వచ్చే బద్ధకం, మానసిక అలజడిని దూరం చేసి నూతనోత్సాహాన్ని నింపుతుందని అంటున్నారు. కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయంలో ఈ తరహా వాద్యం వాయిస్తారట.

టిబెటన్ సింగింగ్ బౌల్స్ :మిశ్రమ లోహాలతో చేసే గిన్నెలను ప్రత్యేకమైన కర్రతో రుద్దినప్పుడు 'ఓం' కారపు అనునాదం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరంగాలు తీవ్ర ఆందోళన, మైగ్రేన్ నుంచి ఉపశమనం ఇస్తాయని అంటున్నారు.

టైమ్​పాస్ కోసం 'సిగరెట్​' తాగుతున్నారా? - ఈ హెచ్చరిక సంకేతాలతో అలర్ట్ కావాల్సిందే!

ఏ స్థాయి ఒత్తిడి? ఎలాంటి శబ్దం :

సాధారణ ఒత్తిడి :పనిలో ఏకాగ్రత కుదరకపోవడం, చుట్టూ ఉండే చిన్న చిన్న శబ్దాలకు చికాకు కలగడం.

పరిష్కారం - వైట్​ నాయిస్ : స్థిరంగా సాగే ఫ్యాన్​ చప్పుడు, ఏసీ శబ్దం వంటివి పరిసరాల్లోని అనవసర రొదను కమ్మేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించేలా చేసి, పని సామర్థ్యాన్ని పెంచుతాయంటున్నారు.

మధ్యస్థ ఒత్తిడి : రోజంతా పనిచేసి అలసిపోవడం,చిరాకు, రాత్రుళ్లు త్వరగా నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతాయట

పరిష్కారం - (పింక్ నాయిస్) : ప్రకృతి శబ్దాలు, వాన చప్పుడు, ఆకుల కదలికలు, పక్షుల కూతలు, సముద్ర అలల ఘోష వంటివి గుండె వేగాన్ని తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. మెదడును గాఢనిద్రకు సిద్ధం చేస్తాయని చెబుతున్నారు.

తీవ్రమైన ఒత్తిడి :భవిష్యత్తుపై విపరీతమైన ఆందోళన, అదుపులేని ఆలోచనలు.

పరిష్కారం - బ్రౌన్ నాయిస్ : గంభీరంగా సాగే జలపాతం హోరు, ఉరుముల శబ్దం వంటివి మనస్సులోని ఆందోళనను తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. హెడ్​ఫోన్స్​తో బైనరల్ బీట్స్ వింటే మెదడును ధ్యాన స్థితికి తీసుకెళ్తాయని చెబుతున్నారు.

ఇంట్లో ఇలా :ప్లేస్టోర్​లో 'రైన్ రైన్, అట్మాస్పియర్, వైట్ నాయిస్​' వంటి ఉచిత యాప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు.

  • యూట్యూబ్​లో 'టిబెటన్ సింగింగ్ బౌల్ మెడిటేషన్, కైలాస నాదం రిలాక్సింగ్ మ్యూజిక్, బ్రౌన్​ నాయిస్​ ఫర్ యాంగ్జైటీ' అని వెతికితే అద్భుతమైన ఆడియోలు వస్తాయని చెబుతున్నారు.
  • వీలైతే ఇంట్లో చిన్న టిబెటన్ సింగింగ్ బౌల్ లేదా ఇండోర్ వాటర్ ఫౌంటెన్ ఉంచుకుంటే రోజంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని వివరిస్తున్నారు.
  • రోజంతా ఆఫీసు పనులు, ఒత్తిళ్లతో అలసిపోయినప్పుడు కనీసం 15-20 నిమిషాలు ఇలాంటి శబ్దాలు, సంగీతం వినడం అలవాటు చేసుకోవాలని పేర్కొంటున్నారు.

నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు :

  • శబ్దాల పరిమితి ఎప్పుడూ 60 డెసిబెల్స్ దాటకూడదని WHOపేర్కొన్నట్లు చెబుతున్నారు.
  • బైనరల్ బీట్స్ వినేందుకు నాణ్యమైన హెడ్​ఫోన్స్ వాడాలని, మిగిలిన శబ్దాలను నేరుగా స్పీకర్ల ద్వారా వినొచ్చంటున్నారు.
  • రోజుకు 20-30 నిమిషాలే వినాలని, గంటల తరబడి వింటే చెవులు, మెదడుపై భారం పడుతుందంటున్నారు.
  • హోరెత్తించే శబ్దాలు వినే సమయంలో డ్రైవింగ్, యంత్రాలు నడపడం వంటివి చేయకూడదంటున్నారు.
  • తీవ్రమైన మానసిక సమస్యలున్న వారు నిపుణుల సమక్షంలోనే ఈ థెరపీ తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మహిళలకు అలర్ట్ : 35 ఏళ్లు దాటాక 'ఈ లక్షణాలను' నిర్లక్ష్యం చేయకూడదట!

రాత్రి వేళ 'ఈ తప్పులు' చేస్తున్నారా? - కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్లేనట!