'అరగంట నడిచి అలసిపోతున్నారా? - చీటికి మాటికీ చిరాకు పడుతున్నారా?'
జీవనశైలిలో మార్పులతో అనారోగ్య సమస్యలు - యువతలో అలసటకు కారణాలు ఇవే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 28, 2025 at 11:45 AM IST
Reasons for Chronic Fatigue In Youth : రోజూ గంటసేపు ఈజీగా నడిచే రాజేశ్ ఇటీవల అరగంటకే చతికిల పడిపోతున్నాడు. ఏ ప్రాజెక్టయినా కళ్లు మూసుకొని పూర్తిచేసే విజ్ఞాన్‌కు ఇప్పుడు రొటీన్ వర్క్ భారంగా తోస్తోంది. ఆఫీసులో ఎదురయ్యే సవాళ్లకు చిటికెలో పరిష్కార మార్గం చూపే పవిత్రకి ఏకాగ్రతే కరవైంది. అన్ని పనులను ఎంతో ఓపికతో చేసే సౌమ్య ప్రస్తుతం చీటికీ మాటికీ చిరాకు పడుతోంది. ఒకదాంతో మరోటి సంబంధం లేదని అనిపించినప్పటికీ ఇవన్నీ బడలిక, అలసట (ఫెటీగ్) సంకేతాలేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతలో చాలా మంది దీనికి గురవుతున్నారు. అయితే, దీనికి గల కారణాలు ఏంటీ? అలసట నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

జీవనశైలి ప్రధాన కారణం:
- నేటి ఆధునిక జీవనశైలి మార్పుల కారణంగా యువత అలసటను ఎదుర్కొంటున్నారు. ఒక క్రమమంటూ లేని నిద్ర, గాడి తప్పిన ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి, బద్ధకం, పర్యావరణ అంశాలెన్నో బడలికకు దోహదం చేస్తుంటాయి.
- ఇర్రెగ్యూలర్ స్లీప్, అలాగే తక్కువ సమయం నిద్రపోవడం వంటివి యువతలో అలసటకు ప్రధాన కారణాలని National Institutes of Health (NIH) నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్ కోసం క్లిక్ చేయండి)
- చదువుల ఒత్తిడి, సోషల్ మీడియా వాడకం, పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివి నిద్రను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. తద్వారా శరీరంలోని జీవ గడియారమూ (సర్కేడియన్ రిథమ్) అస్తవ్యస్తమవుతుంది.
- ఆహార అలవాట్లను చూస్తే- ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం, వేళకు భోజనం చేయకపోవటం వల్ల బాడీకి రోజంతా అవసరమయ్యే శక్తి లభించటం లేదు.
- క్లాస్ రూముల్లో, ఆఫీసుల్లోనో గంటల కొద్దీ కదలకుండా కూర్చోవటం, టీవీలు, ల్యాప్‌టాప్‌ల ముందు కూలబడి ఎడతెగకుండా ఓటీటీలు, సినిమాలు చూడటం వంటి వాటితో బద్ధకం పెరుగుతోంది. ఇలా శరీరానికి పని చెప్పకపోవటం వల్ల శక్తి, బలం సన్నగిల్లుతున్నాయి.
- మానసిక ప్రశాంతత దూరమవడం. సామాజిక అంచనాలు, చదువుల్లో రాణించాలనే ఒత్తిడి, మున్ముందు కెరీర్ ఎలా ఉంటుందోననే దిగులు లాంటివి మానసిక అలసటకు గురిచేస్తున్నాయి.
- ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోవటం వల్ల ఎండ తగలకపోవటం, కాలుష్యం, స్వచ్ఛమైన గాలి లభించకపోవటం వంటి పర్యావరణ అంశాలూ యువతలో శక్తికి గండి కొడుతున్నాయి.
- ఐరన్ లోపాలు, విటమిన్ డి హార్మోన్లు అస్తవ్యస్తం కావటమూ బాగానే ప్రభావం చూపుతున్నాయి.
- ఇలాంటివన్నీ బడలిక, దీర్ఘకాల అలసటకు బీజం వేస్తున్నాయి, ఉద్ధృతం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడు సమస్యాత్మకం?
- తగినంత రెస్ట్ తీసుకున్నా, రాత్రి సరిగా నిద్రపోతున్నా కూడా అదేపనిగా అలసటకు గురవుతున్నా, రోజువారీ పనులు చేసుకోవటం మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నా తీవ్ర విషయంగానే పరిగణించాలి.
- 6 నెలలు దాటినా అలసట తగ్గకపోతే అప్రమత్తం కావాల్సిందే. జ్వరం, అకారణంగా బరువు తగ్గటం, రాత్రిపూట చెమటలు పడుతుంటే అసలే నిర్లక్ష్యం చేయొద్దు.
- బడలిక మూలంగా పనిలో రాణించలేకపోవటం, సామాజిక బంధాలు దెబ్బతినటం వంటివి గమనిస్తే సత్వరం వైద్యులను సంప్రదించాలి.
- నైట్‌టైమ్ నిద్రపోయినా మార్నింగ్ బాగా అలసి పోతున్నా, శ్రమ చేసిన 24 గంటల తర్వాతా బడలికగా అనిపిస్తున్నా, కొత్త లక్షణాలు మొదలైనా, ఉన్న లక్షణాలు ఉద్ధృతమైనా హెచ్చరికగానే భావించాలి.
- అలసటతో పాటు దిగులు, నిరాశ, నిస్పృహ, ఆందోళన, తరచూ మూడ్ మారటం వంటి మార్పులను గమనిస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి.
- దీర్ఘకాల నొప్పి, నిర్ణయాలు తీసుకోలేక పోవటం, ఆలోచనలు సాఫీగా సాగకపోవటం, ఏదైనా అవయవం గాడితప్పుతున్న సూచనలు కనిపించినా అశ్రద్ధ చేయొద్దు.

చిన్న జాగ్రత్తలే చాలా ముఖ్యం!
- టైమ్‌కు భోజనం చేయటం ముఖ్యం. అలాగే ప్రతి 3-4 గంటలకోసారి పండ్ల వంటి ఆరోగ్యకరమైన చిరుతిండి తీసుకోవాలి. దీంతో బాడీకి నిరంతరం అవసరమైన శక్తి లభిస్తుంది.
- శరీరంలో నీటి శాతం కొద్దిగా తగ్గినా అలసటకు దారితీయొచ్చు. కాబట్టి తగినంత వాటర్ తాగాలి.
- అధిక బరువు ఉంటే త్వరగా అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, బరువు అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువు గుండె మీదా ఎక్కువ భారం పడేస్తుంది.
- నైట్‌టైమ్ కంటి నిండా నిద్రపోవాలి. డైలీ ఒకే సమయానికి పడుకోవాలి, లేవాలి.
- రోజూ యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేయాలి.
షుగర్ పరీక్ష : షుగర్, రక్తహీనత, గుండెజబ్బు, థైరాయిడ్ సమస్యలు, క్షయ, గురక వంటి సమస్యలూ అలసటకు కారణం కావొచ్చు. కాబట్టి ఇలాంటి జబ్బులేవైనా ఉన్నాయేమో టెస్ట్ చేసుకోవాలి.
వ్యాయామం : క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేయాలి. ఇది దీర్ఘకాలంలో త్వరగా అలసిపోకుండా కాపాడుతుంది. కేవలం 15 నిమిషాలు నడిచినా ఉత్సాహంగా అనిపిస్తుంది.
ఇలా బయటపడుతుంది!
- అలసట కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా, భావోద్వేగ లక్షణాల రూపంలో కూడా బయటపడుతుంది.
- శారీరకంగా- తగినంత విశ్రాంతి తీసుకున్నా అదేపనిగా అలసిపోవటం, తలనొప్పులు, కండరాల బలహీనత, సమన్వయం కొరవడటం, పగలంతా మగతగా అనిపించటం, నిద్రలేమి, రోజువారీ పనులు, వ్యాయామం వంటివి చేయటం కష్టంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
- కొంతమందిలో జీర్ణ సమస్యలూ తలెత్తొచ్చు. రోగనిరోధకశక్తి తగ్గడం వల్ల తరచూ ఇన్‌ఫెక్షన్లకు గురికావొచ్చు.
- విషయగ్రహణపరంగా- ఏకాగ్రత కుదరకపోవటం, అవసరమైనప్పుడు ఆలస్యంగా ప్రతిస్పందించటం, మానసిక స్పష్టత తగ్గటం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గటం.
- భావోద్వేగపరంగా- చిరాకు, తరచూ మూడ్ మారటం, ఇంతకుముందు తేలికగా చేసిన పనులే పెద్ద భారంగా అనిపించటం, రోజువారీ పనులు చేసుకోవటానికి ఉత్సాహం కొరవడటం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కూరల్లో వెల్లుల్లి వేస్తున్నారా? రోజు తింటే షుగర్, బీపీ తగ్గుతుందట! ఇన్‌ఫెక్షన్లకు చెక్!
"తాళం వేశామా, స్టవ్ ఆఫ్ చేశామా?" - మీరూ ఇలాగే ఆలోచిస్తుంటారా?!

